టాలీవుడ్ నిర్ణ‌యాల‌తో బాలీవుడ్ కి ప‌నేంటి?

Update: 2022-08-19 05:41 GMT
తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతోన్న అనిశ్చితి గురించి తెలిసిందే. హీరోల పారితోషికాలు..థియేట‌ర్ ఆక్యుపెన్సీ పెంచ‌డానికి తీసుకోవాల్సి చ‌ర్య‌లు..ఓటీటీ రిలీజ్ ఇలా కొన్ని స‌మ‌స్య‌ల‌తో ప‌రిశ్ర‌మ ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడిప్పుడే  ఒక్కొక్క‌టిగా ప‌రిష్కారం అవుతున్నాయి. 8 వారాల త‌ర్వాత ఓటీటీలో సినిమా రిలీజ్ చేసుకునేలా కంపెనీల‌తో ఒప్పందం కుదిరింది.

థియేట‌ర్ లో తినుబండారాల ధ‌ర‌ల విష‌యంలో అంతా ఏకాభిప్రాయానికి రావాల‌ని...త‌గ్గింపు ధ‌ర‌ల‌తోనే ప్రేక్ష‌కుడు థియేట‌ర్ వ‌స్తాడ‌ని ఓ అంచ‌నాకి వ‌స్తున్నారు. మిగ‌తా స‌మ‌స్య‌ల‌కి మ‌రో రెండు మూడు రోజుల్లో పూర్తి పరిష్కారం దొర‌క‌డానికి ఆస్కారం ఉంది. ఈ నేప‌థ్యంలో నేటి స‌మావేశం ఎంతో కీల‌కం కానుంద‌ని తెలుస్తోంది. అయితే నిన్న‌టి భేటి సంద‌ర్భంగా నిర్మాత దిల్ రాజు  టాలీవుడ్ ప‌రిస్థితులు  అన్నింటిని బాలీవుడ్ స‌హా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లు నిశితంగా ప‌రిశీలిస్తున్నాయ‌ని..ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్స్ అడిగి తెలుసుకుంటున్నార‌ని  వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తిక‌రంగా  మారింది.

ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ ప‌రిస్థితుల గురించి బాలీవుడ్ దేనికి విచారిస్తున్నట్లు అన్న సందేహం వ‌స్తోంది. తెలుగు చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లి తీసుకునే నిర్ణ‌యాల్ని కూడా బాలీవుడ్  ప‌రిశ్ర‌మ కూడా అనుస‌రించాల‌నుకుంటుందా?  అన్న సందేహం తెర‌పైకి వ‌స్తోంది. కోవిడ్ ప్రారంభ‌మైన ద‌గ్గ‌ర నుంచి బాలీవుడ్ లో కూడా సంక్షోభం కొన‌సాగుతుంది.

దీనికి తోడు రెండేళ్ల‌గా ఒక్క  స‌క్సెస్ కూడా  లేదు. భారీ బడ్జెట్ తో నిర్మాణం జ‌రిగిన సినిమాలు  భారీ అంచ‌నాల‌తో రిలీజ్ అయి దారుణ‌మైన ఫ‌లితాలు సాధిస్తున్నాయి.  కొన్ని చిన్న సినిమాలు మిన‌హా చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ రెండేళ్ల కాలంలో ఒక‌టీ  లేదు. బాక్సాఫీస్ వ‌సూళ్లు ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేవు.  దీంతో ప‌రిశ్ర‌మ ఆర్ధికంగా మ‌రింత  ఇబ్బందుల‌కు గుర‌వుతున్న మాట వాస్త‌వం.

వీటికి తోడు థియేట‌ర్ కి జ‌నాలు రాక‌పోవ‌డం అతి పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ఓటీటీ ప్ర‌భావం కొంత వ‌ర‌కూ థియే ట‌ర్ ఆక్యుపెన్సీపైనా ప‌డింది. సినిమా నిర్మా ణం వ్య‌యం అంత‌కంత‌కు పెరుగుతుంది త‌ప్ప‌! ఆ స్థాయి వ‌సూళ్లు బాక్సాఫీస్ వ‌ద్ద క‌నీసం  క‌న‌పించ‌లేదు. సాధార‌ణంగానే బాలీవుడ్ లో కాస్ట్ ఆఫ్ ప్రొడ‌క్ష‌న్ ఎక్కువ.

తాజా ప‌రిస్థితుల  నేప‌థ్యంలో వాటిని అదుపు చేసే ఆలోచ‌న‌లో అక్క‌డి ప‌రిశ్ర‌మ కూడా ఉంద‌ని తాజా స‌న్నివేశాన్ని బ‌ట్టి తెలుస్తోంది. నిర్మాణ వ్య‌యం త‌గ్గించుకుంటే  అన్ని దారిలోకి వ‌స్తాయి అన్న భావ‌న అన్ని భాష‌ల ప‌రిశ్ర‌మ‌లోనూ టాలీవుడ్ క‌ద‌లిక‌తో మొద‌లైన‌ట్లు క‌నిపిస్తుంది. ఇదే నిజ‌మైతే  మార్పు మంచిదే.
Tags:    

Similar News