కోలీవుడ్లో ఆ ఇద్దరు స్టార్ హీరోల తరువాత ప్లేస్ ఎవరిది?

Update: 2021-03-11 15:30 GMT
తమిళంలో మాస్ హీరోలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అందువలన అక్కడి హీరోలు మాస్ ఇమేజ్ తో కూడిన కథల ద్వారా పరిచయం కావడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. రజనీకాంత్ .. కమల్ కి ముందు ఎంజీఆర్ .. శివాజీ గణేశన్ లాంటి  హీరోలు తమిళనాట తమ జోరును చూపించారు. కానీ రజనీ .. కమల్ ఎంచుకున్న మార్గాలు వేరు .. వాళ్లకి దక్కిన క్రేజ్ వేరు. మొదటి నుంచి కూడా రజనీకాంత్ తన స్టైల్ తోనే ఆకట్టుకుంటూ రాగా, కమల్ విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తూ వచ్చారు. రజనీకాంత్ విపరీతమైన మాస్ ఫాలోయింగును సంపాదించుకుంటే, కమల్ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకున్నారు.

రజనీ .. కమల్ .. ఇద్దరూ ఎంచుకునే కథలు వేరు .. పాత్రలు వేరు .. వాళ్ల బాడీ లాంగ్వేజ్ వేరు. అయినా ఇద్దరూ కలిసి నడిచారు .. కలిసి గెలిచారు. మంచి స్నేహితులుగా కొనసాగుతూనే బాక్సాఫీస్ దగ్గర భారీ రికార్డులను నమోదు చేశారు. ఏ ప్రాంతానికి చెందిన ప్రేక్షకులైనా, తమ ప్రాంతానికి చెందినవారిగానే వాళ్లను అభిమానించారు .. ఆదరించారు. అందువలన ఇప్పుడు వినిపిస్తున్న పాన్ ఇండియా సినిమా అనే మాట అప్పుడు లేకపోయినా, వాళ్లిద్దరూ చేసిన సినిమాలు అలాంటివే అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. నటనలో తమదైన ముద్ర నుంచి పక్కకి తప్పుకోకుండా వాళ్లిద్దరూ కలిసి చేసిన ప్రయాణాన్ని తలచుకోకపోతే, థియేటర్లు సైతం దిగులు పెట్టుకోవడం ఖాయం.

రజనీ .. కమల్ వంటి స్టార్ హీరోల తరువాత కోలీవుడ్లో ఆ స్థాయిలో సత్తాను చాటగల హీరోలు ఎవరబ్బా? అని అంతా అనుకున్నారు. మేమున్నాం అంటూ విజయ్ -  అజిత్ బరిలోకి దిగిపోయారు. ఈ ఇద్దరి హీరోలకి మాస్ లో విపరీతమైన క్రేజ్ వుంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించగల సత్తా ఉంది. ఒకరి రికార్డులను ఒకరు తుడిచేస్తూ .. చెరిపేస్తూ తమిళ సినిమాను ప్రపంచపటంపై పరుగులు తీయిస్తున్నారు. వాళ్ల అభిమానుల్లోనే తప్ప ఆ హీరోల మధ్య ఎలాంటి వాదనలు వినిపించవు .. కామెంట్లు కనిపించవు.

మరి ఈ ఇద్దరి హీరోల తరువాత ఆ స్థాయిలో చెప్పుకోదగిన హీరోలు ఎవరనే ప్రశ్న ఇప్పుడిప్పుడే తలెత్తుతోంది. ఈ ప్రశ్నకు ఇప్పట్లో ఆన్సర్ దొరకడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఒక విజయ్ లా .. ఒక అజిత్ ల తెరపై మిగతావాళ్లు మేజిక్ చేయలేకపోతున్నారు. తమ మాట .. పాట .. ఆట .. ప్రతిదీ ఒక పండుగలా ప్రేక్షకులు భావించేలా చెలరేగలేకపోతున్నారు. ధనుశ్ .. శివకార్తికేయన్ .. విజయ్ సేతుపతి లాంటి కొంతమంది హీరోలు లైన్లో ఉన్నప్పటికీ, వాళ్ల దారివేరు .. తీరు వేరు. విజయ్ - అజిత్ తరువాత ఆ రేంజ్ రేసులోకి ఏ ఇద్దరు హీరోలనైనా ఎంటర్ చేద్దామని చూస్తే, దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు. అలాంటి ఇద్దరు స్టార్ హీరోలను .. ఆ రేంజ్ పోటీని ఆ తరువాత కాలంలో చూడటం కష్టమేనేమో?   
Tags:    

Similar News