టాప్ స్టోరి: ఏపీ టాలీవుడ్ రూప‌క‌ర్త‌ ఎవ‌రు?

Update: 2019-06-08 17:30 GMT
వందేళ్ల భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో 85ఏళ్ల చ‌రిత్ర టాలీవుడ్ కి ఉంటే ఇన్నేళ్ల‌లో ఈ ప‌రిశ్ర‌మ ఎదిగిన తీరు అసాధార‌ణం అనే చెప్పాలి. 100 కోట్ల క్ల‌బ్ కాదు.. రూ.2000 కోట్ల క్ల‌బ్‌ సినిమాని తీయ‌గ‌ల‌మ‌ని టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి నిరూపించారు. మునుముందు దేశ - విదేశాల మార్కెట్ల‌ను క‌లుపుకుంటూ యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న సినిమాల్ని తీసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. మార్కెట్ల‌కు కొత్త దారులు తెరుచుకుంటున్న ఈ త‌రుణంలో సినీప‌రిశ్ర‌మ‌ల విస్త్ర‌తికి ఆస్కారం లేక‌పోలేద‌న్న వాద‌నా ప‌రిశ్ర‌మ‌లో  వినిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు విడిపోయాక మ‌రో కొత్త ప‌రిశ్ర‌మ ఏపీకి అవ‌స‌రం ఉంద‌న్న వాద‌న యువ‌త‌రంలో ప్ర‌ముఖంగా వినిపించింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఈ విషయంలో ఏపీ ప్ర‌జ‌ల సెంటిమెంటును ప‌ట్టించుకోక‌పోయినా ప్ర‌స్తుతం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొత్త‌గా సీఎం అయ్యాక మ‌రోసారి ఏపీ టాలీవుడ్ ప్ర‌స్థావ‌న మొద‌లైంది. బీచ్ సొగ‌సుల‌ వైజాగ్ లో కొత్త టాలీవుడ్ ని నిర్మించాల‌న్న ధృడ సంకల్పం కొంద‌రికి ఉంద‌ని.. లేదూ అమ‌రావ‌తిలోనే నెల‌కొల్పేందుకు ఆస్కారం ఉంద‌న్న ఆస‌క్తిక‌ర‌చ‌ర్చ సాగుతోంది.

అయితే సినిమా వాళ్ల‌కు వంద‌ల ఎక‌రాల భూములు విశాఖ ప‌రిస‌రాల్లో ఉన్నందున పెద్ద‌ల చూపు ప్ర‌ధానంగా అటువైపే ఉంద‌ని బ‌లంగా వినిపిస్తోంది. రామానాయుడు స్టూడియోస్ స‌హా ఎఫ్ ఎన్ సీసీ- ఫిలించాంబ‌ర్ వంటివి విశాఖ కేంద్రంగా బ‌లంగా కార్య‌క‌లాపాలు సాగిస్తుండ‌డం చూస్తుంటే ప‌రిశ్ర‌మ రూప‌క‌ల్ప‌నకు విశాఖ బీచ్ ప‌రిస‌రాలు లేదా కొత్త వ‌ల‌స‌- అర‌కు మ‌ధ్య‌ ప‌రిస‌రాలు అనుకూలంగా ఉన్నాయా? అంటూ ఆస‌క్తిక‌ర చర్చకు తెర లేచింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి - అల్లు అర‌వింద్ వంటి పెద్ద‌లు సైతం విశాఖ లో కొత్త ప‌రిశ్ర‌మ ఏర్పాటున‌కు కృషి చేస్తామ‌ని వైజాగ్ ఈవెంట్ల‌లోనూ బ‌హిరంగంగా వ్యాఖ్యానించ‌డం ఉత్త‌రాంధ్ర‌లో హాట్ టాపిక్ అయ్యింది అప్ప‌ట్లో.

అయితే ఒక కొత్త ఇండ‌స్ట్రీ ఏర్పాటు అన్న‌ది కొంద‌రు పెద్ద‌లు త‌లుచుకుంటే పూర్త‌య్యే ప‌ని. కానీ ఈ విష‌యంలో ప్ర‌భుత్వం నుంచి స్ప‌ష్ట‌మైన హామీ లేక వేచి చూస్తున్నామ‌ని ఇటీవ‌ల ఓ చిట్ చాట్ లో అగ్ర‌నిర్మాత .. రామానాయుడు స్టూడియోస్ అధినేత డి.సురేష్ బాబు అన్నారు. విశాఖ బీచ్ లో ఎఫ్ ఎన్ సీసీ వంటివి ఏర్పాటు చేసి కృషి చేస్తున్నా.. ప్ర‌భుత్వ స్పంద‌న స‌రిగా లేక‌పోవ‌డంతో నిరాశ కలిగింద‌ని ఓ అగ్ర నిర్మాత వ్యాఖ్యానించారు. అయితే ఒక కొత్త ప‌రిశ్ర‌మ ఏర్పాటున‌కు ముందు గ‌త చ‌రిత్ర‌ను పరిశీలించాలి.  ఓమారు మ‌ద్రాసు నుంచి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ త‌ర‌లింపున‌కు సంబంధించిన చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే.. మ‌ద్రాసు నుంచి టాలీవుడ్ ను హైద‌రాబాద్ కి తేవ‌డంలో కీల‌క పాత్ర‌ధారులుగా డా.డి.రామానాయుడు- ఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ‌- డా.దాస‌రి నారాయ‌ణ‌రావు - అల్లు రామ‌లింగ‌య్య‌- ఎల్‌.వి.ప్ర‌సాద్ - ఐమ్యాక్స్ ర‌మేష్ ప్ర‌సాద్ - వీబీ రాజేంద్ర ప్ర‌సాద్ (ద‌స‌రా బుల్లోడు నిర్మాత‌) వంటి ప్ర‌ముఖుల కృషి ఎంతో దాగి ఉంద‌ని చెబుతుంటారు. ప‌లువురు సినీపెద్ద‌లు హైద‌రాబాద్ లో ప్ర‌భుత్వం ఇచ్చిన భూముల్లో సొంతంగా సినీ స్టూడియోలు- ల్యాబులు నిర్మించి సినిమా అభివృద్ధికి కృషి చేశారు.  

హైద‌రాబాద్ స్టూడియోలు సినీనిర్మాణానికి ఎంతో అనుకూలంగా మారాయి. రామానాయుడు స్టూడియోస్.. సార‌థి స్టూడియోస్ .. శ‌బ్ధాల‌య స్టూడియోస్‌ (ఎం.ఎస్.రెడ్డి - శ్యాప్ర‌సాద్).. ప‌ద్మాల‌య (సూప‌ర్ స్టార్ కృష్ణ‌- ఆది శేష‌గిరిరావు) స్టూడియోస్ వంటి స్టూడియోల రూప‌క‌ల్ప‌న హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ ఎదుగుద‌ల‌కు స‌హ‌క‌రించింది. వీళ్లంతా తెగించ‌క‌పోతే ప‌రిశ్ర‌మ తెలుగు రాష్ట్రానికి వ‌చ్చేదా? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ నిరంత‌రం సాగుతుంటుంది. ఆరోజుల్లో సినీపెద్ద‌లు చేసిన సాహ‌సం వ‌ల్ల‌నే ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ కి త‌ర‌లి వ‌చ్చింది. అయితే ఇప్పుడు అమ‌రావ‌తి- వైజాక్ కి తీసుకెళ్లే దేవుడు ఎవ‌రు? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌కు ధీటుగా ఏపీలోనూ మ‌రో కొత్త ప‌రిశ్ర‌మ అభివృద్ధి చెందాల‌ని సినీపెద్ద‌లు కోరుకుంటున్నారు. అయితే ఈ విష‌యంలో బ‌య‌ట‌ప‌డేందుకు కొంద‌రు మొహ‌మాట ప‌డుతున్నార‌ని .. ఇరు రాష్ట్రాల్లో సినిమా అభివృద్ధి ఎంతో అవ‌స‌ర‌మ‌ని ప‌లువురు ప్ర‌ముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దిశ‌గా `తుపాకి` క‌థ‌నాల‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. కొత్త ముఖ్య‌మంత్రి ర్యాపిడ్ ఫోర్స్ యాక్టివిటీస్ కొత్త టాలీవుడ్ పై దృష్టి సారిస్తాయా? అంటూ  ప్ర‌స్తుతం టాలీవుడ్ యావ‌త్తూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

    
    
    

Tags:    

Similar News