స్పీడ్ పెంచిన విశాల్.. 'హైదరాబాద్'లోనే లాంగ్ షెడ్యూల్..!

Update: 2021-06-16 02:30 GMT
దక్షిణాది స్టార్ హీరోలలో ఒకరు హీరో విశాల్. ఫస్ట్ హిట్ పందెంకోడి మూవీ దగ్గరనుండి రీసెంట్ చక్ర వరకు విశాల్ సినిమాలు తెలుగులో డబ్ అవుతూ రిలీజ్ అవుతున్నాయి. అందుకే తెలుగులో కూడా విశాల్ మంచి ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నాడు. రీసెంట్ చక్ర మూవీ విజయంతో స్పీడ్ పెంచిన విశాల్ ప్రస్తుతం చేతినిండా సినిమాలు లైనప్ చేసి పెట్టుకున్నాడు. తాజాగా 'నాట్ ఏ కామన్ మ్యాన్'(వర్కింగ్ టైటిల్) మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. విశాల్ 31వ సినిమాగా 'నాట్ ఏ కామన్ మ్యాన్' తెరకెక్కుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించాడు.

‘నాట్ ఏ కామన్ మ్యాన్’ వర్కింగ్ టైటిల్ తో విశాల్ ప్రీలుక్ సినిమా పై ఆసక్తి రేపింది. అలాగే ప్రీలుక్ తో పాటుగా ఇంట్రెస్టింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. జనసందోహం నుంచి హీరో ఫేస్‌ను చూపించిన మేకర్స్.. కోపంతో మండుతున్న హీరో కళ్లను హైలెట్ చేయడం మనం గమనించవచ్చు. విశాల్ సొంతంగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌ పై సినిమా నిర్మిస్తుండగా టిపి శరవణన్ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. అయితే విశాల్ - యువన్ కాంబినేషన్ లో రాబోతున్న 11వ సినిమా ఇది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ సంబంధించి అప్డేట్ ప్రకటించాడు విశాల్. తాజాగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. కరోనా ప్రోటోకాల్ పాటిస్తూనే సినిమా షూటింగ్ జరుపుతున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే హైదరాబాద్ లోనే షూటింగ్ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. జులై చివరి లోగా పూర్తి షూటింగ్ కంప్లీట్ అవుతుందని విశాల్ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. విశాల్ ఆల్రెడీ చేతిలో తుప్పరివాలన్ సీక్వెల్ - ఎనిమి - ఇరుంబుతురై సీక్వెల్ లతో పాటు ఇప్పుడు 'నాట్ ఏ కామన్ మ్యాన్' చేస్తున్నాడు. అయితే ఎనిమి సినిమాలో విశాల్ తో పాటు ఆర్యా కూడా నటిస్తున్నాడు. దాదాపు పదేళ్ల కిందట వీరిద్దరూ 'వాడు వీడు' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. మరిప్పుడు సెకండ్ హిట్ అందుకుంటారేమో చూడాలి.
Tags:    

Similar News