‘బాహుబలి’కి ముందు రాసుకున్న కథ వేరు

Update: 2017-04-30 12:47 GMT
‘బాహుబలి’ కథపై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చేసింది. ‘బాహుబలి: ది కంక్లూజన్’తో ప్రేక్షకుల మదిలో ఉన్న చాలా సందేహాలకు సమాధానం లభించింది. ఇప్పుడు తొలి భాగం నుంచి గుర్తు తెచ్చుకుంటే ఓవరాల్ గా ‘బాహుబలి’ కథపై ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ పార్ట్ చూసినపుడు కథ విషయమై విమర్శలు వ్యక్తమైనా.. ఇప్పుడు అలాంటి అభిప్రాయం వ్యక్తం కాలేదు. కథ గురించి.. పాత్రల గురించి అందరూ పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఇంత భారీ కథను.. శక్తిమంతమైన పాత్రల్ని తీర్చిదిద్దిన విజయేంద్ర ప్రసాద్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐతే మనం తెరపై చూసిన కథతో పోలిస్తే.. ముందు విజయేంద్ర ఆలోచనల్లో పురుడు పోసుకున్న ‘బాహుబలి’ కథ భిన్నమైందట. అసలు ‘బాహుబలి’ కథ ఎలా మొదలైందో తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ ఆసక్తికర విషయాలు చెప్పాడు రాజమౌళి తండ్రి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.

‘‘కట్టప్ప పాత్ర నుంచి ‘బాహుబలి’ ఆలోచన మొదలైంది. శక్తి మంతుడైన కట్టప్ప పిల్లలకు యుద్ధ విద్యలు నేర్పిస్తుండగా ఒక రోజు అతడి దగ్గరికి ఓ విదేశీయుడు వస్తాడు. ‘ఇంత గొప్పగా యుద్ధం చేస్తున్నారు... నేనింత వరకూ మీలాంటి వీరుడ్ని చూడలేదు’ అని నమస్కరిస్తాడు. అప్పుడు కట్టప్ప ‘నాకంటే గొప్ప వీరుడు మరొకడు ఉన్నాడు. అతని పేరు బాహుబలి. అతన్ని యుద్ధంలో ఎవ్వరూ గెలవలేరు..’ అంటూ బాహుబలి కథ చెబుతాడు. కథంతా విని ‘అతడిని చూడాలని ఉంది. నాకోసారి చూపిస్తారా’ అని విదేశీయుడు అడిగితే ‘ఇప్పుడతను లేడు. చనిపోయాడు’ అని బదులిస్తాడు. ‘అంతటి వీరుడన్నారు. ఎలా చనిపోయాడు’ అని అడిగితే.. ‘కత్తిపోటు కంటే బలమైనది వెన్నుపోటు. నేనే అతన్ని పొడిచి చంపేశా’ అంటూ అసలు కథ చెప్పడం మొదలుపెడతాడు. ఈ సన్నివేశాన్ని రాజమౌళికి చెబితే.. బాగుందని చెప్పి.. దీని ఆధారంగా మిగిలిన పాత్రలు అల్లుకొందామన్నాడు. తర్వాత శివగామి పాత్ర పుట్టింది. ఆపై.. బాహుబలితో పాటు మిగతా పాత్రల్ని అల్లుకున్నా. ఆపై కథను మరో రకంగా మార్చుకున్నాం. తెరమీద చూసింది అదే’’ అని విజయేంద్ర ప్రసాద్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News