‘సైరా’లో అతడి పాత్రేంటో తెలిసిపోయింది

Update: 2017-12-24 11:12 GMT
విజయ్ సేతుపతి.. గత కొన్నేళ్లలో తమిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. గొప్ప పేరు సంపాదించి.. స్టార్ హీరోగా ఎదిగిన నటుడు. ‘నేను రౌడీనే’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ కూడా కొంత మేర అతను పరిచయమే. అతను మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’లో ఓ కీలక పాత్రకు ఎంపికైన సంగతి తెలిసిందే. మంచి నటుడిగా పేరున్న విజయ్.. ఈ సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతడి పాత్రేంటో ఇప్పుడు బయటికి వచ్చింది. ‘సైరా’లో ఓబయ్య అనే పాత్ర చేస్తున్నాడట విజయ్.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అత్యంత నమ్మకమైన అనుయాయుల్లో ఓబయ్య ఒకడు. ఎప్పుడూ ఆయన వెన్నంటే ఉన్నాడు. ఆయన పోరాటంలో తనూ పాలుపంచుకున్నాడు. ఈ పాత్ర సినిమాలో ఎంతో కీలకమట. దాదాపుగా సినిమా అంతటా ఈ పాత్ర ఉంటుందని సమాచారం. కచ్చితంగా ఈ పాత్ర సినిమాలో మేజర్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. తెలుగులో చేస్తున్న తొలి సినిమాతోనే విజయ్ తనదైన ముద్ర వేసే అవకాశముంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చిరంజీవి తమ్ముడి కూతురు నిహారిక తమిళంలో కథానాయికగా పరిచయం కాబోతున్నది విజయ్ సేతుపతి సినిమాతోనే కావడం విశేషం. ఆ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోపే విజయ్ ఇక్కడ తెలుగులో చిరంజీవితోనే తన అరంగేట్ర చిత్రాన్ని మొదలుపెడుతున్నాడు.
Tags:    

Similar News