అవార్డు వేలం వేస్తా అంటున్న దేవరకొండ

Update: 2018-06-18 04:39 GMT
నటుడు అనేవాడికి అవార్డులు మంచి ఉత్సాహాన్నిస్తాయి. ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకంలా ఉంటాయి. అందుకే చిన్న చితకా అవార్డులను పక్కన పెట్టేసే ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను మాత్రం గ్యారంటీగా దాచుకుంటారు. అందులోనూ మొదటి అవార్డు ఇంకా జాగ్రత్తగా దాచుకుంటారు. కానీ ఈ విషయంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ డిఫరెంట్ స్టయిల్లో ఆలోచించాడు.

అర్జున్ రెడ్డి సినిమాలో ప్రదర్శించిన అద్భుతమైన నటనకు ఈ ఏడాది విజయ్ దేవరకొండను ఫిలిం ఫేర్ అవార్డు వరించింది. తాను ఇండస్ట్రీకి వచ్చి తాను ఇష్టపడే ప్రొఫెషన్.. అమ్మానాన్నలకు సొంతిల్లు.. హీరోగా క్రేజ్.. బోలెడు మంది ఫ్యాన్స్.. ఇలా ఎంతో సంపాదించుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ ఫిలిం ఫేర్ అవార్డు తనకు ఓ బోనస్ గా అభివర్ణించాడు. ఈ అవార్డు తనింట్లో షెల్ఫ్ లో దాచి పెట్టుకునేందుకు కాకుండా తను పుట్టి పెరిగిన హైదరాబాద్ సిటీకీ ఏదైనా ఉపయోగపడేలా ఉండాలని కోరుకుంటున్నానని సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.

ఈ అవార్డును వేలం వేసి ఆ వచ్చే డబ్బును చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కు ఇచ్చేద్దామని అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ఇది ఎలా వర్కవుట్ అవుతుందో కూడా నాకు తెలియదని.. కానీ అనిపించిందని తన అభిప్రాయం చెప్పేశాడు. కమిట్ అయిపోయానంటూ తెలంగాణా రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశాడు. విజయ్ దేవరకొండ ఆలోచనను కేటీఆర్ కూడా మెచ్చుకున్నారు.
Tags:    

Similar News