తమ్ముడు హీరో అవ్వడం ఇష్టం లేదా?

Update: 2019-07-07 19:03 GMT
విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు టాలీవుడ్ జపిస్తున్న పేరిది. ఒక ద‌శ‌లో అత‌న్ని ప‌ట్టించుకోని టాలీవుడ్ ఇప్పుడు అత‌నికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతోంది. అలాంటి విజయ్ ప‌బ్లిక్ ఫంక్ష‌న్‌ కి వ‌చ్చాడంటే ఆ ర‌చ్చ రేంజే వేరు. ఎక్క‌డా ఆర్టిఫిషియ‌ల్‌ గా వుండ‌దు. త‌ను ఏం ఫీల‌వుతాడో అదే చెబుతాడు. మ‌న ప‌క్కింటి కుర్రాడిలా ఎలాంటి మొహ‌మాటం లేకుండా నిర్భ‌యంగా విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడే తీరుకి ఆడియ‌న్సే కాదు స్టార్ హీరోలు కూడా ఫిదా అవుతుంటారు. అలాంటి రౌడీ హీరో తొలిసారి ఎమోష‌న‌ల్ అయ్యాడు. క‌న్నీళ్లు పెట్టుకున్నంత ప‌నిచేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. విజ‌య్ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం `దొర‌సాని`.

ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ ఆదివారం రాత్రి హైద‌రాబాద్‌ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఇన్ని రోజులు తన త‌మ్ముడి చిత్రానికి ఎందుకు దూరంగా వుంటూ వ‌చ్చానో ఆ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టేసి ఎమోష‌న‌ల్ అయ్యాడు. దానికి తెర వెన‌కున్న అస‌లు కార‌ణం ఏంటో చెప్పేశాడు. త‌మ్ముడు ఆనంద్ అమెరికాలో ఉద్యోగం చేస్తూ త‌న కుటుంబాన్ని ఏవిధంగా ఆదుకున్నాడో - త‌ను న‌టుడు కావ‌డానికి ఏవిధంగా స‌హ‌క‌రించాడో త‌న మాట‌ల్లో క్లుప్తంగా వివ‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే అలాంటి ఉద్యోగాన్ని - అమెరికాని వ‌దిలి ఇక్క‌డికి వ‌స్తానంటే త‌న‌కు న‌చ్చ‌లేద‌ని - త‌ను న‌టుడు కావ‌డం కూడా త‌న‌కు న‌చ్చ‌లేద‌ని అందుకే త‌న‌కు దూరంగా వున్నాన‌ని చెప్పుకొచ్చాడు.

త‌న‌కు తానే మంచి క‌థ‌ని ఎంచుకోవాల‌ని - సినీ ప్ర‌పంచంలో ఓ సినిమా చేయ‌డం ఎంత క‌ష్ట‌మో త‌న‌కు తెలియాల‌ని - ఇక్క‌డ ఎలాంటి అవ‌మానాలు - ట్రోలింగ్స్ ఎదుర్కోవాలో త‌న‌కు తెలియాల‌నే వ‌దిలేశాన‌ని - అన్నింటిని భ‌రించి రాటుదేలాల‌ని త‌న‌ని దూరం పెట్టాన‌ని చెప్పుకొచ్చాడు. టీజ‌ర్‌ - ట్రైల‌ర్‌ - ఫ‌స్ట్ లుక్ ఇలా దేన్నీ షేర్ చేయ‌కుండా మౌనంగా చూస్తుండిపోయాన‌ని ఎమోష‌న‌ల్ కావ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. సినిమా బాగుంటేనే ఫంక్ష‌న్‌ కు వ‌స్తాన‌ని - తేదంటే ఇంకొక‌రిని చూసుకోమ‌ని చెప్పాన‌ని - రేపు సినిమా చూసిన త‌రువాత ఆనంద్ గురించి ప్రేక్ష‌కులే చెప్పుకుంటార‌ని త‌న త‌మ్ముడిపై త‌న‌కున్న ప్రేమ‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ‌ వ్య‌క్తం చేయ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంది.

Tags:    

Similar News