‘ఫైటర్’ పోతే సుక్కు పరిస్థితేంటి?

Update: 2020-11-06 04:15 GMT
కరోనా కారణంగా సినీ పరిశ్రమలో వచ్చిన విరామంలో చాలా కొత్త ప్రాజెక్టులు అనౌన్స్ అయ్యాయి. అందులో అత్యంత ఆసక్తి రేకెత్తించిన వాటిలో సుకుమార్-విజయ్ దేవరకొండ ప్రాజెక్టు ఒకటి. అల్లు అర్జున్ మిత్రుడైన కేదార్ ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం కావాల్సి ఉంది. సుకుమార్ స్థాయి పెద్ద దర్శకులు.. ఎక్కువగా బడా హీరోలతోనే సినిమాలు చేస్తుంటారు. అలాంటిది ‘రంగస్థలం’ లాంటి నాన్ బాహుబలి హిట్ ఇచ్చి, అల్లు అర్జున్‌ తో ‘పుష్ప’ లాంటి క్రేజీ మూవీని లైన్లో పెట్టిన సుకుమార్.. దాని తర్వాత విజయ్ లాంటి అప్ కమింగ్ స్టార్‌ తో సినిమా ను ఓకే చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇప్పుడున్న స్థాయి లోనే సుకుమార్.. విజయ్‌ ను డైరెక్ట్ చేయడమన్నది ఊహకందని విషయం. అలాంటిది ‘పుష్ప’ తర్వాత సుక్కు స్థాయి ఇంకా పెరుగుతుందన్న అంచనాలున్నాయి.

రెండేళ్ల సమయం తీసుకుని ఎంతో కసరత్తు చేసి ఓ విభిన్నమైన కథతో సుక్కు ‘పుష్ప’ తీస్తున్నాడు. పైగా ఇందులో నటిస్తున్న అల్లు అర్జున్ ‘రంగస్థలం’ రికార్డును కొట్టి ఊపుమీదున్నాడు. అతడి సినిమాలకు దక్షిణాదిన అంతటా, అలాగే ఉత్తరాదిన కూడా ఆదరణ ఉంటుంది. అంటే ‘పుష్ప’కు పాజిటివ్ టాక్ వస్తే.. ‘రంగస్థలం’ కంటే పెద్ద విజయం సాధించి సుక్కు రేంజే మారిపోయే అవకాశముంది. మరి ఆ స్థితిలో ఒకవేళ విజయ్ కొత్త సినిమా ‘ఫైటర్’ ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. సుక్కు, విజయ్‌లకు అస్సలు మ్యాచ్ కాదు అప్పుడు.

ఆ స్థితిలో తన స్థాయిని అమాంతం తగ్గించుకుని విజయ్‌ తో సుక్కు సినిమా చేయగలడా? సుక్కు మిగతా దర్శకుల్లా ఆరు నెలలకో సినిమా లాగించేసే టైపు కాదు. ఒక సినిమాకు కనీసం రెండేళ్లు సమయం పడుతుంది. అలాంటిది విజయ్ కోసం నిజంగా అంత సమయం పెడతాడా అన్నది చూడాలి. అలాగే ఈ సినిమా స్థాయికి తగ్గట్లు పారితోషకం కూడా తగ్గించుకోవాల్సి రావడం మరో సమస్య. కాబట్టి ‘పుష్ప’ ఫ్లాప్ అయి సుక్కు స్థాయి తగ్గి.. ‘ఫైటర్’ హిట్టయి విజయ్ రేంజ్ పెరిగే పరిస్థితుల్లో తప్ప సుక్కు-విజయ్ కాంబినేషన్ వర్కవుట్ కావడం కష్టమే అంటున్నారు. ఆ సమయానికి ఏమైనా జరగొచ్చన్నది ఇండస్ట్రీ టాక్.
Tags:    

Similar News