తమిళ హీరో తెలుగు ట్వీట్‌ తో పడేశాడు

Update: 2020-09-04 07:30 GMT
తమిళ పాపులర్‌ స్టార్‌ విజయ్ ఆంటోనీ తెలుగులో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఆయన నటించిన బిచ్చగాడు సినిమా తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాతో విజయ్‌ ఆంటోనీ తెలుగులో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయ్యాడు. ఆ సినిమా తర్వాత నుండి ఆయన ఏ తమిళ సినిమా చేసినా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకుంటూ వస్తున్నాడు. తెలుగులో ఆయనకు బిచ్చగాడు సినిమా తర్వాత ఆ స్థాయి విజయం కాని.. కనీసం యావరేజ్‌ హిట్‌ కాని దక్కలేదు. అందుకే మళ్లీ బిచ్చగాడితోనే ప్రయత్నించబోతున్నాడు.

బిచ్చగాడు సీక్వెల్‌ ను చేసేందుకు విజయ్‌ ఆంటోనీ సిద్దం అయ్యాడు. ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కూడా విడుదల చేశాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తారట. తెలుగు వర్షన్‌ కోసం కొన్ని ప్రత్యేకమైన సీన్స్‌ ను షూట్‌ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే  బిచ్చగాడు 2 సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా ప్లాన్‌ మొత్తం రివర్స్‌ అయ్యింది. గత ఆరు నెలలుగా విజయ్‌ ఆంటోనీ సినిమాలకు దూరంగా ఉన్నాడు. నేటి నుండి షూటింగ్‌ ను ప్రారంభించబోతున్నట్లుగా విజయ్‌ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతడు తెలుగులో ట్వీట్‌ చేయడంతో తెలుగు వారు అంతా కూడా ఫిదా అవుతున్నారు.

తెలుగు హీరోలు తెలుగులో ట్వీట్స్‌ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అలాంటిది ఒక తమిళ హీరో అయ్యి ఉండి తెలుగులో ట్వీట్‌ చేయడం నిజంగా అభినందనీయం. ఆయన్ను చూసి అయినా మన తెలుగు హీరోలు నేర్చకోవాల్సి ఉందనిపిస్తుంది. విజయ్‌ తన ట్వీట్‌ లో...  'నన్ను నమ్ముకున్న  నిర్మాత దర్శక మరియు సినీ కార్మిక సోదరుల శ్రేయస్సున్ని ఆకాంక్షిస్తూ ...నేను  రేపటి నుండి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్స్ లో పాలుగొనబోతున్నాను. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తూ నేను మీ విజయ ఆంటోని' అంటూ పేర్కొన్నాడు. తెలుగు ప్రేక్షకులు బిచ్చగాడు 2 సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News