స్త్రీల‌కు అవ‌మానం.. నోరా ఫ‌తేహీపై మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్!

సినిమా ప్రమోషన్ల కోసం వివాదాస్పద సాహిత్యం లేదా దృశ్యాలను విడుదల చేయడం అనేది నేడు ఒక బాధ్యతారాహిత్యమైన `పబ్లిసిటీ స్టంట్`గా మారుతోంది.;

Update: 2026-04-07 06:14 GMT

సినిమా ప్రమోషన్ల కోసం వివాదాస్పద సాహిత్యం లేదా దృశ్యాలను విడుదల చేయడం అనేది నేడు ఒక బాధ్యతారాహిత్యమైన `పబ్లిసిటీ స్టంట్`గా మారుతోంది. సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సి) నిబంధనలు ప్రధానంగా థియేటర్లలో ప్రదర్శించే వెర్షన్‌కే పరిమితం కావడంతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలయ్యే ప్రమోషనల్ కంటెంట్‌ను నిర్మాతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ గ్రే ఏరియాను అడ్డుకోవడానికి సెన్సార్ బోర్డు తన పరిధిని డిజిటల్ మాధ్యమాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని విశ్లేషిస్తున్నారు. కేవలం క‌ట్స్ చెప్ప‌డ‌మే కాదు.. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై భారీ జరిమానాలు విధించడం ద్వారానే ఇటువంటి ధోరణులకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.

మహిళా కమిషన్ వంటి రాజ్యాంగబద్ధమైన సంస్థల జోక్యం ఇక్కడ అత్యంత కీలకం. సెన్సార్ బోర్డు కేవలం సాంకేతికపరమైన తనిఖీలు చేస్తే.. మహిళా కమిషన్ సమాజంలోని నైతిక విలువలు, మహిళల గౌరవానికి భంగం కలిగే ప్రతి సందర్భంలోనూ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తుంది. `కేడీ - ది డెవిల్` సినిమా విషయంలో నోరా ఫతేహి, సంజయ్ దత్ వంటి అగ్ర తారలను నేరుగా విచారణకు పిలవడం వల్ల సృజనాత్మకత పేరుతో అశ్లీలతను ప్రోత్సహించే మేకర్స్‌కు ఒక బలమైన హెచ్చరిక వెళ్లిన‌ట్ట‌యింది. చట్టపరమైన చర్యల భయం ఉన్నప్పుడే బాధ్యతాయుతమైన సినిమా మేకింగ్ సాధ్యమవుతుంది.

అయితే ఇటువంటి నియంత్రణలు `సృజనాత్మక స్వేచ్ఛ`ను దెబ్బతీస్తాయనే వాదన కూడా వినిపిస్తుంటుంది. కానీ స్వేచ్ఛ అనేది సామాజిక బాధ్యతతో కూడి ఉండాలి. కళాకారులు, దర్శకులు తాము చేసే పని సమాజంపై ముఖ్యంగా యువతపై ఎటువంటి ప్రభావం చూపుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, సెన్సార్ బోర్డు సమన్వయంతో ఒక స్పష్టమైన `డిజిటల్ ప్రమోషన్ పాలసీ`ని తీసుకురావాల్సిఉంద‌ని విశ్లేషిస్తున్నారు. అప్పుడే సినిమా పబ్లిసిటీ అనేది వివాదాల చుట్టూ కాకుండా.. సినిమాలోని ప్రతిభ, కంటెంట్ చుట్టూ తిరుగుతుంది.

నోరా ఫ‌తేహి- సంజ‌య్ ద‌త్‌పై మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్:

కన్నడ చిత్రం `కేడీ - ది డెవిల్`లో నోరా ఫతేహి, సంజయ్ దత్ నటించిన `సర్సే నిన్న సెరగా సర్సే` పాటపై తలెత్తిన వివాదం జాతీయ స్థాయికి చేరింది. ఈ పాటలోని అశ్లీల సాహిత్యం, అసభ్యకర దృశ్యాల పట్ల సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమైన తీవ్ర నిరసనలను జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడ‌బ్ల్యూ) సుమోటోగా స్వీకరించింది. సృజనాత్మకత పేరుతో మహిళల హుందాతనాన్ని దెబ్బతీయడం సహించరానిదని కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ స్పష్టం చేస్తూ.. చిత్ర బృందానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఈ వివాదాస్పద గీతాన్ని యూట్యూబ్ నుండి తొలగించినా.. ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలకు కమిషన్ ఉపక్రమించింది.

ఈ కేసుకు సంబంధించి జరిగిన తొలి విచారణకు చిత్ర దర్శకుడు ప్రేమ్, రచయిత రకీబ్ ఆలం, నిర్మాతలు హాజరై, సమాజంపై ఈ పాట ప్రతికూల ప్రభావం చూపిందని ఒప్పుకుంటూ లిఖితపూర్వక క్షమాపణలు తెలిపారు. అయితే నటి నోరా ఫతేహి ఈ విచారణకు గైర్హాజరు కావడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె తరఫున న్యాయవాది హాజరైనా లాయర్ ప్రాతినిధ్యాన్ని తిరస్కరిస్తూ ఏప్రిల్ 27న నోరా వ్యక్తిగతంగా కమిషన్ ముందుకు రావాలని తుది అవకాశం ఇచ్చింది. అలాగే నటుడు సంజయ్ దత్‌ను కూడా ఏప్రిల్ 8న ప్యానెల్ ముందు హాజరు కావాల్సిందిగా కమిష‌న్ ఆదేశించింది.

కేవలం క్షమాపణలతో సరిపెట్టకుండా, ఈ వివాదం నేపథ్యంలో చిత్ర బృందానికి కమిషన్ కొన్ని కీలక బాధ్యతలను అప్పగించింది. ఒక‌ మూడు నెలల పాటు మహిళా సాధికారతకు సంబంధించి వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టి.. ఆ నివేదికను కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించింది. సినిమాల్లో గ్లామర్ పేరుతో అశ్లీలతను ప్రోత్సహించే ధోరణిని అరికట్టడానికి, కళాకారులు సమాజం విష‌యంలో జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడటానికి మహిళా కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమలో ఒక బలమైన సంకేతాన్ని పంపింది.

Tags:    

Similar News