డెకాయిట్ మామూలు ల‌వ్‌స్టోరీ కాదు!

ఈ సినిమాకు షానియెల్ డియో ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డెకాయిట్ కథను షానియెల్ ప్రేమ, యాక్షన్, ఎమోషన్‌ల సమ్మేళనంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.;

Update: 2026-04-07 06:16 GMT

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో అడివి శేష్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన న‌టించిన తాజా సినిమా డెకాయిట్ పై ఇప్పటికే ఆడియ‌న్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రేమకథ ప్రధానాంశంగా తెర‌కెక్క‌డం విశేషం. గతంలో తన సినిమాల్లో ప్రేమ అంశం పరిమితంగానే ఉండేదని, కానీ డెకాయిట్ లో మాత్రం పూర్తిగా ప్రేమ కథే కథనాన్ని ముందుకు నడిపిస్తుందని అడివి శేష్ వెల్లడించారు.

డెకాయిట్ లో ఎమోష‌న్స్ చాలా స‌హ‌జంగా ఉంటాయి

నా గ‌త సినిమాల్లో లవ్ స్టోరీ కేవ‌లం ఒక భాగం మాత్రమేన‌ని, కానీ డెకాయిట్ లో ప్రేమకథే ప్రధానంగా ఉంటుంద‌ని, ఈ ల‌వ్ స్టోరీలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయ‌ని, అవి ఆడియ‌న్స్ ను ఆశ్చర్యానికి గురిచేస్తుంద‌ని, ముఖ్యంగా సినిమాలోని భావోద్వేగాలు చాలా సహజంగా, నిజాయితీగా అనిపిస్తాయ‌ని శేష్ చెప్పిన మాటలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీగా వ‌స్తోన్న డెకాయిట్

ఈ సినిమాకు షానియెల్ డియో ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డెకాయిట్ కథను షానియెల్ ప్రేమ, యాక్షన్, ఎమోషన్‌ల సమ్మేళనంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్‌తో కూడిన ల‌వ్ స్టోరీగా ఇది కొత్త అనుభూతిని ఇవ్వనుందని చిత్ర యూనిట్ చాలా న‌మ్మ‌కంగా చెబుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ న‌టిస్తున్నారు. ఇప్పటికే తన నటనతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మృణాల్, ఈ సినిమాలో కీలకమైన భావోద్వేగ పాత్రలో కనిపించనున్నారు. అదే విధంగా ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ క‌శ్య‌ప్ ఈ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుండ‌గా, బాలీవుడ్ న‌టి జైన్ మేరీ ఖాన్ మ‌రో కీల‌క పాత్రలో నటించడం సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.

ఏప్రిల్ 10న డెకాయిట్ రిలీజ్

ఈ సినిమాను అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్ల‌గడ్డ నిర్మించ‌గా, ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్, టెక్నిక‌ల్ స్టాండ‌ర్డ్స్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సినిమాను రూపొందించిన‌ట్లు సమాచారం. డెకాయిట్ సినిమా ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించగా, అడివి శేష్ వ్యాఖ్యలతో సినిమాపై ఉన్న హైప్ మ‌రింత పెరిగింది. ప్రేమకథకు యాక్షన్ మేళవింపుతో కొత్త అనుభూతిని అందించే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా నిలుస్తుందో చూడాలి.

Tags:    

Similar News