పిక్ టాక్: వావ్ అనిపిస్తున్న వరుణ్ తేజ్ మేకోవర్..!

Update: 2021-11-03 13:30 GMT
యువ హీరో వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ.. విభిన్నమైన కథలు విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ హిట్స్ అందుకొని మెగా ప్రిన్స్ గా మారిపోయాడు. అయితే ఇప్పటి వరకు గెటప్ వైజ్ వెరీయేషన్ చూపించిన వరుణ్.. ఫిజిక్ పరంగా పెద్దగా మార్పు చూపించలేదు. కానీ ఇప్పుడు ''గని'' సినిమా కోసం కంప్లీట్ మేకోవర్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు వరుణ్.

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ''గని''. బాక్సింగ్ క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కిరణ్ కొరపాటి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇందులో వరుణ్ ఓ బాక్సర్ గా కనిపించనున్నారు. ప్రొఫెషనల్ బాక్సర్ గా రెడీ అవడానికి వరుణ్ తేజ్ తీవ్రంగా శ్రమించాడని తెలుస్తోంది. దీని కోసం శిక్షణ తీసుకోవడమే కాకుండా.. జిమ్ లో రెగ్యులర్ గా హార్డ్ వర్కౌట్స్ చేశారు.

తాజాగా వరుణ్ తేజ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో షర్ట్ లేకుండా ఉన్న పిక్ లో మెగా ప్రిన్స్ ని చూస్తే వావ్ అనాల్సిందే. కండలు తిరిగిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కి అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్న ''గని'' చిత్రాన్ని డిసెంబర్ 3న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన 'గని' ఫస్ట్ లుక్ - ఫస్ట్ సింగిల్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఉపేంద్ర - సునీల్ శెట్టి - జగపతిబాబు - నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రెనసాన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీ పతాకాలపై అల్లు బాబీ - సిద్ధు ముద్ద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించగా.. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అబ్బూరి రవి ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవల్ మరియు దిలీప్ సుబ్బరాయన్ ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.
Tags:    

Similar News