మూవీ రివ్యూ: 'యూ టర్న్'

Update: 2018-09-13 14:53 GMT
చిత్రం : 'యూ టర్న్'

నటీనటులు: సమంత - ఆది పినిశెట్టి - రాహుల్ రవీంద్రన్ - భూమిక చావ్లా - నరేన్ - రవిప్రకాష్ తదితరులు
సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి
ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మిరెడ్డి
నిర్మాతలు: శ్రీనివాస చిట్టూరి - రాంబాబు బండారు
రచన - దర్శకత్వం: పవన్ కుమార్

కథానాయికగా తిరుగులేని స్థాయిని అందుకున్న సమంత తొలిసారిగా నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘యూ టర్న్’. కన్నడలో ఇదే పేరుతో విజయవంతమైన చిత్రం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ థ్రిల్లర్ మూవీ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రచన (సమంత) ఒక పత్రికలో విలేకరిగా పని చేస్తుంటుంది. ఆమెకు అదే ఆఫీసులో పని చేసే రాహుల్ (రాహుల్ రవీంద్రన్) అంటే ఇష్టం. అతడికీ ఆమె మీద ఆసక్తి ఉంటుంది. రచన తన వృత్తిలో భాగంగా ఒక ఫ్లై ఓవర్ మీద డివైడర్ ను జరిపి ట్రాఫిక్ నిబంధనల్ని అతిక్రమిస్తున్న వారి వివరాలు సేకరించి.. వారి మీద ఒక స్టోరీ చేయాలనుకుంటుంది. ఐతే ఆమె అలా వివరాలు రాబట్టిన ఒక వ్యక్తి హఠాత్తుగా చనిపోతాడు. దీంత రచనను పోలీసులు విచారించడం మొదలుపెడతారు. ఈ క్రమంలో వారికి విస్మయపరిచే విషయాలు తెలుస్తాయి. రచన వివరాలు సేకరించిన వాళ్లందరూ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడవుతుంది. మరి వాళ్లందరివీ సహజ మరణాలేనా.. లేక హత్యలా.. వీటికి రచనకు ఏమైనా సంబంధం ఉందా.. అన్న విషయాలు తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

‘యూ టర్న్’ సందేశంతో ముడిపడ్డ ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్. సూపర్ నేచురల్ అనగానే లాజిక్ అనే మాట పక్కకు వెళ్లిపోతుంది. ఈ అడ్వాంటేజీని ఉపయోగించుకుని దర్శకుడు పవన్ కుమార్ ‘యూ టర్న్’ను ఒక ఆసక్తికర థ్రిల్లర్ గా మలిచాడు. తొలి సినిమా ‘లూసియా’తోనే తాను విలక్షణమైన దర్శకుడినని చాటుకున్న పవన్ కుమార్.. రెండో ప్రయత్నంలోనూ భిన్నమైన సినిమానే అందించాడు. కొత్తగా అనిపించే కథ.. ఎక్కడా పక్కదారి పట్టకుండా ఆసక్తికరంగా.. కథతో పాటే సాగే కథనం.. ప్రధాన పాత్రధారుల అభినయం.. ‘యూ టర్న్’కు ప్రధాన ఆకర్షణలు. థ్రిల్లర్ సినిమాల్లో సస్పెన్స్ ఫ్యాక్టర్ ను డీల్ చేయడం.. చివరి దాకా ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేయడం అత్యంత కీలకమైన విషయాలు. ఈ రెండు విషయాల్లో పవన్ కుమార్ విజయవంతమయ్యాడు. థ్రిల్లర్ సినిమాల ప్రేమికుల్ని ‘యూ టర్న్’ నిరాశ పరచదు.

పాత్రల్ని పరిచయం చేసి.. కథతో సంబంధం లేకుండా ఊరికే కొన్ని సన్నివేశాల్ని పేర్చి.. ఏ ఇంటర్వెల్ దగ్గరో అసలు కథలోకి వెళ్లడం లాంటిదేమీ చేయకుండా.. నేరుగా మొదట్లోనే కథను ఆరంభించాడు దర్శకుడు పవన్ కుమార్. కథనం ఊపందుకోవడానికి కొంచెం సమయం పట్టినప్పటికీ.. కథలోని తొలి మలుపు దగ్గర్నుంచి ఉత్కంఠ మొదలవుతుంది. సన్నివేశాలు ప్రేక్షకుడి ఊహకు అందకుండా సాగుతూ ఆసక్తి రేకెత్తిస్తాయి. రిపోర్టర్ అయిన కథానాయిక తన స్టోరీ కోసం వివరాలు సేకరించిన వాళ్లందరూ చనిపోయినట్లు వెల్లడి కావడంతో అక్కడి నుంచి తర్వాత ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్ని వెంటాడుతుంది. సమంతను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించే దగ్గర్నుంచి కథనం మంచి ఫ్లోలో సాగుతుంది. ద్వితీయార్ధంలో కొంచెం వేగం తగ్గినా.. సస్పెన్స్ కొనసాగిస్తూ ఆసక్తి సన్నగిల్లిపోకుండా చూసుకోవడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
4

ముందే అన్నట్లు ఇది సూపర్ నేచురల్ సినిమా కాబట్టి లాజిక్కుల గురించి పట్టించుకోకూడదు. అయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం దర్శకుడు మరీ ఎక్కువ లిబర్టీ తీసుకున్నాడనిపిస్తుంది. థ్రిల్లర్ సినిమా కాస్తా చివర్లో హార్రర్ టర్న్ తీసుకోవడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు. అలాగే సగటు థ్రిల్లర్ చిత్రాలతో పోలిస్తే కొంచెం నిడివి ఎక్కువైంది. కొన్ని అనవసర సన్నివేశాలు అక్కడక్కడా కథనంలో వేగం తగ్గించేశాయి. తక్కువ సన్నివేశాల్లోనే లాగించినప్పటికీ రొమాంటిక్ ట్రాక్ బోర్ కొట్టిస్తుంది. ప్రి క్లైమాక్స్ ముంగిట కథలో బిగి మిస్ అయింది. అంతకుముందున్న ఇంటెన్సిటీ ఇక్కడ కనిపించలేదు. ఈ ప్రతికూలతల సంగతి పక్కన పెడితే.. కొత్తదనంతో కూడిన థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడే వాళ్లకు ‘యూ టర్న్’ నచ్చుతుంది. ఆ వర్గం ప్రేక్షకుల్ని దాటి ఇది ఎక్కువమందికి రీచ్ అవుతుందా అన్నది మాత్రం సందేహమే.

నటీనటులు:

కథాకథనాలే బలంగా సాగే ‘యూ టర్న్’లో సమంత తన ప్రత్యేకతను చాటుకుంది. ఆమె స్టార్ పవర్ సినిమాకు ప్లస్ అయింది. సమంత ఈ తరహా సినిమా కొత్త కావడంతో ఆమె కొత్తగానే కనిపిస్తుంది. లుక్.. బాడీ లాంగ్వేజ్.. నటన కొంచెం భిన్నంగా ఉండేలా చూసుకుంది సమంత. ఆమె కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన సినిమా అవుతుందనడంలో సందేహం లేదు. ఆది పినిశెట్టి పోలీస్ పాత్రలో సులువుగా ఒదిగిపోయాడు. అతను సిన్సియర్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆది పాత్రలో.. నటనలో ఆద్యంతం ఒక ఇంటెన్సిటీ కనిపిస్తుంది. రాహుల్ రవీంద్రన్ కు స్కోప్ తక్కువే కానీ.. ఉన్నంతలో బాగానే చేశాడు. భూమిక చాలా తక్కువ సన్నివేశాల్లోనే తన ముద్ర చూపించింది. మిగతా నటీనటులు ఓకే.

సాంకేతికవర్గం:

‘యూ టర్న్’ సాంకేతికంగా ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది. పూర్ణచంద్ర తేజస్వి నేపథ్య సంగీతం.. నికేత్ బొమ్మిరెడ్డి ఛాయాగ్రహణం.. థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన మూడ్ క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించాయి. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో బాగున్నాయి. ఇక రచయిత.. దర్శకుడు పవన్ కుమార్ థ్రిల్లర్ జానర్ మీద తనకున్న గ్రిప్ ను చూపించాడు. కథతో పాటు స్క్రీన్ ప్లే విషయంలోనూ కొత్తదనం చూపించాడు. ఇది దర్శకుడి సినిమా అనే విషయం సినిమా అంతటా కనిపిస్తుంది. ఐతే ముగింపు విషయంలో అతను ఇంకొంచెం భిన్నంగా ఆలోచించి ఉంటే బాగుండేదనిపిస్తుంది.

చివరగా: యూ టర్న్.. థ్రిల్ చేస్తుంది

రేటింగ్-2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News