శంకరాభరణం అవార్డ్స్.. చాలా స్పెషలే

Update: 2017-06-14 13:21 GMT
దాదాపు సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.. కళాతపస్వి కె.విశ్వనాథ్ కు ఘనమైన గురుదక్షిణ ఇవ్వడానికి సిద్ధమయ్యారు సీనియర్ నటి తులసి. తనకు నటిగా జన్మనిచ్చిన విశ్వనాథ్ ను గౌరవిస్తూ.. ఆయన దర్శకత్వంలో తాను నటించిన ఆల్ టైం క్లాసిక్ ‘శంకరాభరణం’ సినిమా పేరిటే తులసి అవార్డులు ఇవ్వబోతున్నారు. జూన్ 20న జరగబోయే అవార్డుల వేడుక గురించి ఆమె మరిన్ని విశేషాలు మీడియాతో పంచుకున్నారు.

మామూలుగా సినిమా వేడుకల తరహాలో హంగామా ఉండదట ఈ వేడుకలో. రెగ్యులర్ డ్యాన్సులు.. ఐటెం పాటలు.. లాంటివేమీ లేకుండా సాంస్కృతిక కార్యక్రమాల్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారట. వికలాంగులు.. అనాథలు ఈ వేడుకలో నృత్యం చేస్తారట. అలాగే ఈ ఈవెంట్ మొత్తాన్ని మహిళలే నడిపించబోతున్నారట. తన ఆధ్వర్యంలో నడిచే మహిళా సంఘాల సభ్యులే ఈ ఈవెంట్ చేస్తారని తులసి తెలిపారు. దాదాపు ఐదు వేల మంది దాకా మహిళల్ని ఈ ఈవెంట్లో భాగస్వాముల్ని చేస్తున్నట్లు తులసి వెల్లడించారు.

విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన నటీనటులు.. ఆయనతో కలిసి పని చేసిన టెక్నీషియన్లు అందరూ ఈ వేడుకకు హాజరై ఆ లివింగ్ లెజెండ్ ను మరింత సంతోషపెట్టాలని తులసి పిలుపునిచ్చారు. ‘శంకరాభరణం’ అవార్డు అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారికి దక్కుతాయని.. వాళ్లందరూ స్వయంగా విశ్వనాథ్ చేతుల మీదుగానే అవార్డులు అందుకుంటారని.. ఇకపై ఏటా ఈ అవార్డుల వేడుక జరుగుతుందని తులసి తెలిపారు. సినిమాల్లో తనకు జీవితం ఇవ్వడమే కాక.. తన వ్యక్తిగత జీవితంపైనా విశ్వనాథ్ ఎంతో ప్రభావం చూపారని..ఒక గైడ్ లాగా తనను నడిపించారని.. అందుకే ఆయనపై తన గౌరవ భావాన్ని ఈరకంగా తెలియజేస్తున్నానని తులసి తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News