అమ్మడి దృష్టిలో టాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్స్ లేరా...?

Update: 2020-05-14 23:30 GMT
సీనియర్ హీరోయిన్ త్రిష కోలీవుడ్ లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ టాలీవుడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో దాదాపు 13 ఏళ్ళ సినీ కెరీర్ ఉన్న త్రిష టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది. 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ 'వర్షం' సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులోని సీనియర్ హీరోలు.. కుర్ర హీరోలు అని తేడా లేకుండా అందరితో నటించింది. చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలయ్య మహేష్ బాబు ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ రవితేజ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. అయితే ప్రస్తుతం త్రిషాకు తెలుగులో అవకాశాలు లేవు. కానీ తమిళంలో మాత్రం వరుస బెట్టి సినిమాలు చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న 'ఆచార్య' సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. కానీ అమ్మడు డిఫరెన్సెస్ అంటూ ప్రాజెక్ట్స్ నుండి తప్పుకుంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించిన ఈ భామ దృష్టిలో తెలుగులో బెస్ట్ యాక్టర్స్ ఎవరూ కనిపించలేదట.

లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన అమ్మడు సోషల్ మీడియాలో ఈ మధ్య ఫ్యాన్స్‌ తో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా మీకు నచ్చిన ముగ్గురు బెస్ట్ యాక్టర్ల పేర్లు చెప్పమని అడుగగా ఆమెకు నచ్చిన ముగ్గురు బెస్ట్ హీరోల పేర్లు చెప్పింది. త్రిష చెప్పిన ముగ్గురు హీరోల లిస్ట్ లో ఒక్క తెలుగు హీరో కూడా లేకపోవడం గమనార్హం. త్రిషకు ఆల్ టైం ఫేవరేట్ హీరోల లిస్ట్ లో లోకనాయకుడు కమల్ హాసన్ - కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ - మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఉన్నారు. కోలీవుడ్ నుండి కమల్ హాసన్.. మాలీవుడ్ నుండి మోహన్ లాల్.. బాలీవుడ్ నుండి అమీర్ ఖాన్ లను ఎంచుకున్న త్రిష టాలీవుడ్ హీరో పేరు కూడా చెప్పలేదు. వీరిలో కమల్ మరియు మోహన్ లాల్ సరసన నటించిన త్రిష అమీర్ ఖాన్ పక్కన మాత్రం యాక్ట్ చేయలేదు. యాక్ట్ చేయని హీరోని కూడా బెస్ట్ యాక్టర్ గా భావించిన త్రిష.. ఇన్నేళ్లు తెలుగులో నటించి మన వారిని బెస్ట్ యాక్టర్స్ గుర్తించడం లేదంటూ టాలీవుడ్ సినీ అభిమానులు ఆమెను విమర్శిస్తున్నారు. ఇతర ఇండస్ట్రీలలో టాప్ హీరోల నేమ్స్ చెప్పిన త్రిష మన టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి పేరు అయినా చెప్తే బాగుండేదని టాలీవుడ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అంతేకాకుండా చిరంజీవి - త్రిష కలిసి నటిస్తారంటూ ఈ మధ్య వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో త్రిష ఇలా చేయడం టాలీవుడ్ సినీ అభిమానులకు రుచించడం లేదు.
Tags:    

Similar News