RC15 లో ట్రైన్ యాక్ష‌న్ ఎపిసోడ్ హైలైట్

Update: 2021-11-05 06:30 GMT
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ -శంక‌ర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న ఆర్.సి 15 తొలి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఎత్తైన ప‌ర్వ‌తాల్లో కొండ కోన‌ల్లో శంక‌ర్ భారీ యాక్ష‌న్ స‌న్నివేశాన్ని తెర‌కెక్కించార‌ని తాజాగా రివీలైంది.

ఇప్ప‌టికే బ‌జ్ క్రియేట్ చేసిన ట్రైన్ యాక్ష‌న్ ఎపిసోడ్ నే శంక‌ర్ తెర‌కెక్కించార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ప‌ర్వ‌త సానువును ఆనుకుని ఉన్న రైల్వే ట్రాక్ పై డైరెక్ట‌ర్ శంక‌ర్ చైర్ లో కూచున్న ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. దీంతో ట్రైన్ యాక్ష‌న్ ఎపిసోడ్ ని శంక‌ర్ ప్లాన్ చేశార‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా ఉంటుంద‌ని కూడా ఊహిస్తున్నారు. కేజీయఫ్ ఫేమ్ స్టంట్ మాస్టర్స్ అన్బిరవి సారథ్యంలో ఈ యాక్ష‌న్ స‌న్నివేశాన్ని పూర్తి చేసారు.

శంక‌ర్ సినిమాల్లో ట్రైన్ ఎపిసోడ్ అంటే సంథింగ్ స్పెష‌ల్ గా ఉంటుంద‌ని ఇంత‌కుముందు అత‌డు తెర‌కెక్కించిన‌ ప‌లు చిత్రాల్లో ప్రూవైంది. రోబో చిత్రంలో ట్రైన్ లో యాక్ష‌న్ ఎపిసోడ్ ని అభిమానులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఇప్పుడు మ‌ళ్లీ అలాంటి గ్రాండియర్ ట్రైన్ యాక్ష‌న్ ఎపిసోడ్ ని చ‌ర‌ణ్ అభిమానులు ఊహించుకుంటున్నారు.

అడుగ‌డుగునా ఊహించ‌ని స‌ర్ ప్రైజ్ లు

RC15 ఇటీవ‌ల హైదరాబాద్ లో ర‌ణ్ వీర్ సింగ్ - మెగాస్టార్ చిరంజీవి-ఎస్.ఎస్.రాజ‌మౌళి ముఖ్య అతిథులుగా ఘ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అంత‌కుముందు చ‌ర‌ణ్‌-కియ‌రా స‌హా సునీల్ త‌దిత‌ర కాస్టింగ్ పై ఫోటోషూట్ ని నిర్వ‌హించ‌గా అందుకు సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. లాంచింగ్ డే రోజున రిలీజ్ చేసిన పోస్ట‌ర్ స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ను పెంచింది. ఇందులో న‌టీన‌టులు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అంతా ఖ‌రీదైన సూట్స్ బ్లేజ‌ర్స్ ధ‌రించి ఫైల్స్ ప‌ట్టుకుని సీరియ‌స్ గా వెళుతున్న దృశ్యం క‌నిపించింది. శంక‌ర్ మ‌రోసారి ఒకే ఒక్క‌డు ఫీట్ ని రిపీట్ చేస్తున్నారా? ఆ సినిమాకి సీక్వెల్ ని తీస్తున్నారా? అంటూ ఆర్.సి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ పోస్ట‌ర్ లో అందాల కియ‌రా అద్వాణీ సీరియ‌స్ అధికారిలా క‌నిపిస్తున్న చెర్రీ ప‌క్క‌నే క‌నిపించింది. బ‌హుశా త‌న పాత్ర ఐఏఎస్ అధికారి అయిన చ‌ర‌ణ్ కి పీఏగా క‌నిపిస్తుందని ఊహించారు. అంతేకాదు కియ‌రా పాత్ర క‌థ‌నే మ‌లుపు తిప్పే విధంగా ఉంటుంద‌ని కూడా లీకులు తాజాగా అందాయి. RC15 లో కీలక మలుపు తీసుకురావడానికి ఈ పాత్రను శంక‌ర్ డిజైన్ చేశార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రంలో సునీల్ కి అవ‌కాశం ద‌క్కింది. లాంచింగ్ డే రిలీజ్ చేసిన పోస్టర్ లో హాస్యనటుడు సునీల్ కూడా ఈ చిత్రంలో భాగం అవుతారని స్పష్టమైంది. మంచి రన్ టైమ్ తో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో సునీల్ క‌నిపిస్తార‌ని గుస‌గుస‌లు వినిపించాయి. ఇందులో న‌టించే బాలీవుడ్ హీరో ఎవ‌రు? అన్నదానిపై శంక‌ర్ టీమ్ క్లారిటీనివ్వాల్సి ఉంది. ఇక ఈ మూవీలో ప్ర‌తి పాత్రా దేనిక‌దే ప్ర‌త్యేకం అన్న తీరుగా శంక‌ర్ తీర్చి దిద్దార‌ని తెలుస్తోంది. ఒక యువ ఐఏఎస్ రాజ‌కీయ‌నాయ‌కుడిగా మారాక ఏం జ‌రిగింది? అన్న‌దే ఈ సినిమా. ఆద్యంతం భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్ తో ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని రాజీ అన్న‌దే లేకుండా నిర్మిస్తున్నారు. దాదాపు 350-400 కోట్ల మ‌ధ్య బ‌డ్జెట్ ని వెచ్చిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. శంక‌ర్ తో త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం రాజీ అన్న‌దే లేకుండా దిల్ రాజు పెట్టుబ‌డుల‌ని స‌మ‌కూరుస్తున్నార‌ని తెలుస్తోంది.




Tags:    

Similar News