రివైండ్ 2017: తుపాకి స్పెషల్ రివ్యూ

Update: 2017-12-31 18:11 GMT
ఎప్పట్లాగే చూస్తుండగానే పన్నెండు నెలలు గడిచిపోయాయి. ఏడాది చివర్లోకి వచ్చేశాం. సినీ ప్రియులు వెనుదిరిగి చూసుకుంటే ఎన్నెన్నో అనుభవాలు, అనుభూతులు. తెలుగు సినిమా చరిత్రలోనే కాదు.. భారతీయ సినీ చరిత్రలోనే నిలిచిపోయే ఏడాది 2017 అనడంలో సందేహమే లేదు. ఎప్పట్లాగే విజయాల శాతం ఏమంత గొప్పగా లేనప్పటికీ.. గతంతో పోలిస్తే ఈసారి పరిస్థితి ఎంతో మెరుగు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఎన్నడూ చూడని అద్భుతాలు ఈసారి చూశాం. కొన్ని దశాబ్దాల పాటు సినీ చర్చల్లో నిలిచేలా సంచలనం రేపిన ‘బాహుబలి: ది కంక్లూజన్’ వచ్చింది ఈ ఏడాదే. ఐతే తెలుగు సినిమా గొప్పదనం దీని వరకే పరిమితం కాలేదు. ఈ ఏడాది మన ఇండస్ట్రీలో ఇంకొన్ని అద్భుతాలు జరిగాయి. మొత్తంగా ఈ ఏడాది తెలుగు సినిమా గమనం ఎలా ఉందో చూద్దాం పదండి.

భారతీయ సినీ చరిత్రలోనే భాషా భేదం లేకుండా.. ప్రాంతీయ భేదాలు లేకుండా.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ ఆదరించిన సినిమా ఏదైనా ఉందంటే ‘బాహుబలి: ది కంక్లూజన్’యే. ఏకంగా రూ.1750 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రమిది. వసూళ్ల విషయంలోనే కాదు.. కంటెంట్ పరంగానూ ‘బాహుబలి-2’ అందరి ప్రశంసలందుకుంది. ‘బాహుబలి: ది బిగినింగ్’ తరహాలో ‘ది కంక్లూజన్’ చూసి విమర్శకులు పెదవి విరవలేదు. అందులో మాదిరి కేవలం అదనపు హంగులు మాత్రమే ఇందులో హైలైట్ కాలేదు. కథాకథనాలు కూడా బలంగా అనిపించాయి. ఎమోషన్లు గొప్పగా పండాయి. ఇటు నటీనటులు.. అటు సాంకేతిక నిపుణులు అందరూ గొప్పగా తమ ప్రతిభను చాటుకోవడంతో ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. అంచనాల్ని మించిపోయి అసాధారణ విజయం సాధించింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులతో పాటు మొత్తంగా భారతీయ ప్రేక్షకులందరికీ గొప్ప అనుభూతిని పించిన రాజమౌళి బృందానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ‘బాహుబలి’ని దాటి బయటికి వస్తే.. ‘అర్జున్ రెడ్డి’ లాంటి పాత్ బ్రేకింగ్.. సెన్సేషనల్.. ట్రెండ్ సెట్టింగ్ సినిమా వచ్చింది కూడా ఈ ఏడాదే. ‘శివ’ తర్వాత తెలుగు సినిమా నడతను ఆ స్థాయిలో ప్రభావితం చేసిన సినిమాగా ‘అర్జున్ రెడ్డి’ని అభివర్ణించారు కొందరు విశ్లేషకులు. ‘శివ’ లాగా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆమోదం పొందకపోవడం, ఈ సినిమా చుట్టూ వివాదాలు ముసురుకోవడం వల్ల ఈ మాటతో అందరూ ఆమోదించకపోవచ్చు కానీ.. కొత్తదనం - కథాంశం - టేకింగ్ - నరేషన్ - యాక్టింగ్ - టెక్నికల్ వాల్యూస్ విషయంలో చూస్తే ఇది పెద్ద మాటేమీ కాదు. ‘శివ’ తరహాలోనే ఇది కూడా ఒక రెవల్యూషనరీ ఫిలిం అనడంలో.. తెలుగు సినిమాను మరో మెట్టు ఎక్కించి.. భవిష్యత్ సినిమాపై ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. ‘బాహుబలి-2’ లాగే ‘అర్జున్ రెడ్డి’ కూడా తెలుగు రాష్ట్రాల అవతల కూడా పెద్ద చర్చనీయాంశమైంది. వేరే ఇండస్ట్రీల వాళ్లను కూడా మెస్మరైజ్ చేసింది. పెద్దగా పేరులేని విజయ్ దేవరకొండ ఇందులో హీరో. సందీప్ రెడ్డి అనే కొత్తవాడు దర్శకుడు. హీరోయిన్ కొత్తమ్మాయి. ఇంకా మిగతా నటీనటుల్లో - సాంకేతిక నిపుణుల్లో చెప్పుకోదగ్గ పేర్లేమీ లేవు. ఇలాంటి సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యే స్థాయిలో ప్రకంపనలు రేపింది. నిజానికి పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఇదే. కేవలం రూ.5 కోట్ల లోపు బడ్జెట్లో తెరకెక్కి రూ.30 కోట్ల దాకా షేర్ రాబట్టిందీ చిత్రం.

ఇక దేశవ్యాప్తంగా చర్చీనీయాంశమై.. ప్రశంసలందుకున్న మరో సినిమా ‘ఘాజీ’. సంకల్ప్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని అబ్బురపరిచే రీతిలో తెరకెక్కించాడు. నీటి లోపల సబ్ మెరైన్ నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ.. ఉర్రూతలూగిస్తూ సాగుతుందీ సినిమా. తక్కువ బడ్జెట్లో గొప్ప క్వాలిటీతో ఈ సినిమాను చిత్రీకరించాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ‘బాహుబలి’ తర్వాత తెలుగు వాళ్లు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమాల్లో ఇది ఒకటి. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి సాహోసేపేత చిత్రాన్ని అద్భుతంగా మలిచాడు క్రిష్. ఓ మోస్తరు ఖర్చుతో.. కేవలం 79 రోజుల్లో ఈ చిత్రాన్ని అతను మంచి క్వాలిటీతో రూపొందించడం విశేషం. తెలుగు సినిమా చరిత్రలో ఇది కూడా ఒక ప్రత్యేకమైన చిత్రమే. బాలయ్య అసమాన నటన.. క్రిష్ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి. పరిమిత వనరులతోనే గొప్పగా యుద్ధ సన్నివేశాలు తీసి అబ్బుర పరిచాడు క్రిష్. ఈ చిత్రం కమర్షియల్‌గా కూడా మంచి విజయం సాధించి తెలుగు సినిమాలకు స్ఫూర్తిగా నిలిచింది.

ఇక ‘అర్జున్ రెడ్డి’ మాత్రమే కాక తక్కువ బడ్జెట్లో తెరకెక్కి మంచి విజయం సాధించిన సినిమాలు మరికొన్ని వచ్చాయి. అందులో ‘ఫిదా’ ఒకటి. కథానాయిక ప్రాధాన్యమున్న కథతో శేఖర్ కమ్ముల గొప్ప మ్యాజిక్కే చేశాడు ఈ చిత్రంతో. ఇప్పటిదాకా తెలంగాణ భాష - యాసను ఎక్కువగా కామెడీకి - విలనీకి మాత్రమే ఉపయోగించేవాళ్లు మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాల్లో. ఐతే ఆ భాషలోని అందాన్ని చూపించిన సినిమా ఇది. తెలంగాణ అమ్మాయిగా సాయిపల్లవి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్ది.. గొప్పగా మాటలు రాసి ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా మలిచాడు కమ్ముల. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తోడవడం.. కామెడీ బాగా పండటంతో ఈ సినిమా సెన్సేషనల్ హిట్టయింది. రూ.50 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి అబ్బురపరిచిందీ చిత్రం.

ఇక సంక్రాంతికి భారీ సినిమాలతో పోటీ పడిన ‘శతమానం భవతి’ అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరిస్తూ చాలా పెద్ద విజయమే సాధించింది. ఈ ఏడాది కుటుంబ సమేతంగా చూడదగ్గ అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటి. ఇక నాని-ఆది పినిశెట్టి-నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు శివ నిర్వాణ ‘నిన్నుకోరి’ లాంటి ఆహ్లాదకరమైన సినిమాను అందించాడు. ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది. ఇక రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు రూపొందించిన ‘గరుడవేగ’ హాలీవుడ్ థ్రిల్లర్లకు ఏమాత్రం తీసిపోని సినిమానే. ఇది కమర్షియల్‌ గా ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోనప్పటికీ.. ఈ ఏడాది అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ.. ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతూ సాగిందీ చిత్రం.

వెంకటేష్.. రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన రీమేక్ మూవీ ‘గురు’ ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా. ఇది విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లూ అందుకుంది. తాప్సి - శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రల్లో మహి వి.రాఘవ్ తీర్చిదిద్దిన హార్రర్ కామెడీ ‘ఆనందో బ్రహ్మ’ కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఇప్పటిదాకా వచ్చిన హార్రర్ కామెడీలకు ఇది భిన్నంగా అనిపించింది. అలాగే వివేక్ ఆత్రేయ అనే కొత్త దర్శకుడు శ్రీవిష్ణు హీరోగా రూపొందించిన ‘మెంటల్ మదిలో’ కూడా న్యూ వేవ్ మూవీనే. ‘పెళ్ళీచూపులు’ తరహాలోనే అర్బన్ ఆడియన్స్‌ను ఈ చిత్రం బాగా ఆకట్టుకుంది. అలాగే అల్లు శిరీష్ కథానాయకుడిగా వీఐ ఆనంద్ రూపొందించిన ‘ఒక్క క్షణం’.. ప్యారలల్ లైఫ్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కి ప్రత్యేకతను చాటుకుంది.

దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమాకు మకుటం లేని మహారాజుగా మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ఏడాదిగా కూడా 2017ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 9 ఏళ్ల విరామం తర్వాత ఆయన హీరోగా నటించిన ‘ఖైదీ నంబర్ 150’ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. ఈ చిత్రం నాన్-బాహుబలి కలెక్షన్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేయడం విశేషం. మెగాస్టార్ తనదైన శైలిలో అభిమానుల్ని అలరించాడు ఈ చిత్రంలో. ఇక చిన్న సినిమాల్లో నాని నటించిన ‘నేను లోకల్’ యావరేజ్ కంటెంట్ తోనే బ్లాక్ బస్టర్ అయింది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’.. ‘నేనే రాజు నేనే మంత్రి’.. ‘మహానుభావుడు’.. ‘అమీతుమీ’ సినిమాలు కొంచెం కొత్తగా ఉంటూనే ప్రేక్షకుల్ని అలరిస్తూ కమర్షియల్‌గా కూడా మంచి విజయం సాధించాయి.

ఇటు క్రిటికల్ అక్లైమ్.. అటు కమర్షియల్‌ సక్సెస్.. రెంటినీ బేరీజు వేసుకుని ఈ ఏడాది టాప్-10 సినిమాల జాబితా తీస్తే..

1. బాహుబలి: ది కంక్లూజన్
2. అర్జున్ రెడ్డి
3. ఫిదా
4. శతమానం భవతి
5. ఖైదీ నంబర్ 150
6. గౌతమీపుత్ర శాతకర్ణి
7. ఘాజి
8. నేను లోకల్
9. నిన్ను కోరి
10. రారండోయ్ వేడుక చూద్దాం

అటు ఇటు కాని సినిమాలు

2017 అటు ఇటు కాని సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. సినిమా భాషలో చెప్పాలంటే ‘యావరేజ్’లు అన్నమాట. ఈ జాబితా కొంచెం పెద్దగానే ఉంది. ఇందులో ఇద్దరు పెద్ద స్టార్ల సినిమాలు కూడా ఉన్నాయి. అందులో ముందు చెప్పుకోవాల్సింది ‘జై లవకుశ’ గురించే. ఈ చిత్ర కథాకథనాల పరంగా చూస్తే ఇది అంచనాల్ని మించి ఆడినట్లే. ఈ తరహా సినిమా రూ.75 కోట్లకు పైగా షేర్ రాబట్టమంటే చిన్న విషయం కాదు. ఐతే ‘జై లవకుశ’ను భారీ రేట్లకు అమ్మడంతో.. ఆ స్థాయిలో వసూళ్లు లేకపోవడంతో దీన్ని యావరేజ్ కేటగిరిలోకి వెయ్యాల్సి వచ్చింది. అల్లు అర్జున్ సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ కూడా ఈ కేటగిరిలోకే వస్తుంది. ఈ సినిమాకు డివైడ్ టాక్ బాగా వచ్చినా తట్టుకుని ఓపెనింగ్స్ బాగానే రాబట్టింది. దీంతో సినిమా చివరికి యావరేజ్ అయింది. ‘జై లవకుశ’.. ‘డీజే’ రెండు సినిమాల్లోనూ కథాకథనాలు వీక్. అయితే ప్రధానంగా ఇవి హీరోల ఆకర్షణ మీదే నడిచాయి. ఇక మాస్ రాజా రవితేజ కమ్ బ్యాక్ మూవీ ‘రాజా ది గ్రేట్’ కూడా పెట్టుబడిలో 80-90 శాతం మధ్య రికవర్ చేసి యావరేజ్ అనిపించుకుంది. బోయపాటి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బడ్జెట్ ఎక్కువ కావడం వల్ల హిట్ కాలేకపోయింది. ఓ మోస్తరు వసూళ్లతో యావరేజ్ కేటగిరిలోకి చేరింది. నిఖిల్-సుధీర్ వర్మల ‘కేశవ’.. రాజ్ తరుణ్-వంశీకృష్ణల ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’.. అక్కినేని నాగార్జున-ఓంకార్‌ ల హార్రర్ కామెడీ ‘రాజు గారి గది-2’.. రామ్ సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’ యావరేజ్ అనిపించుకున్నాయి.

గుండెల్లో గునపాలు దించేశాయ్

2017లో అద్భుత విజయాలే కాదు.. దారుణమైన డిజాస్టర్లు కూడా ఉన్నాయి. అందులో ముందు చెప్పాల్సింది ‘స్పైడర్’ గురించే. సౌత్ ఇండియాలో ఇప్పటిదాకా ఏ సినిమాకూ రానంత నష్టం ఈ సినిమాకు వచ్చింది. ఆ మొత్తం రూ.60 కోట్లని ట్రేడ్ వర్గాల అంచనా. గత ఏడాది ‘బ్రహ్మోత్సవం’తో దారుణమైన ఫలితాన్నందుకున్న మహేష్ బాబుకు.. ‘స్పైడర్’ మరో గట్టి ఎదురు దెబ్బే. మహేష్-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా కావడంతో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ఆశించారు అభిమానులు. కనీసం వీరి నుంచి మినిమం గ్యారెంటీ మూవీ వస్తుందని ఆశించారు. ఐతే ‘స్పైడర్’ అంచనాల్ని అందుకోలేకపోయింది. సినిమా మరీ చెత్త కాకపోయినప్పటికీ.. అపరిమిత బడ్జెట్లో తెరకెక్కడం, అమ్మకాలు కూడా అదే స్థాయిలో జరగడంతో భారీ నష్టాలు తప్పలేదు. మరోవైపు మహేష్ లాగే బడా స్టార్ అయిన పవన్ కళ్యాణ్ కూడా మహేష్ బాటలోనే వరుసగా రెండో ఏడాది కూడా డిజాస్టర్ ఇచ్చాడు. వేసవిలో వచ్చిన పవన్ సినిమా ‘కాటమరాయుడు’ బోల్తా కొట్టింది. పవన్ గత సినిమా ఫలితంతో సంబంధం లేకుండా దీన్ని కూడా భారీ రేట్లకు అమ్మారు. ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ బాగున్నా తర్వాత సినిమా నిలవలేదు. దాదాపు రూ.25 కోట్ల దాకా నష్టం తెచ్చిపెట్టిందీ చిత్రం. మరోవైపు అక్కినేని నాగార్జున-రాఘవేంద్రరావుల ‘ఓం నమో వేంకటేశాయ’ కూడా బయ్యర్లను నిలువునా ముంచేసింది. రూ.35 కోట్ల దాకా బిజినెస్ చేసిన ఈ చిత్రం రూ.10 కోట్లు మాత్రమే వెనక్కి తెచ్చినట్లు అంచనా. ఇక ఏడాది ఆరంభంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో హిట్టు కొట్టిన బాలయ్యకు ‘పైసా వసూల్’ చేదు అనుభవం మిగిల్చింది. నాగచైతన్య ‘యుద్ధం శరణం’.. శ్రీను వైట్ల-వరుణ్ ల మిస్టర్.. కృష్ణవంశీ ‘నక్షత్రం’.. గోపీచంద్ సినిమాలు ‘గౌతమ్ నంద’.. ‘ఆక్సిజన్’.. సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’.. సునీల్ ‘ఉంగరాల రాంబాబు’.. మంచు హీరోల ‘ఒక్కడు మిగిలాడు’.. ‘గుంటూరోడు’.. ‘లక్కున్నోడు’.. ఇలా ఇంకా డిజాస్టర్ల జాబితాలో చాలా సినిమాలే ఉన్నాయి.

టాప్-10 డిజాస్టర్లు

1. స్పైడర్
2. ఓం నమో వేంకటేశాయ
3. కాటమరాయుడు
4. మిస్టర్
5. నక్షత్రం
6. పైసా వసూల్
7. గౌతమ్ నంద
8. యుద్ధం శరణం
9. ఉంగరాల రాంబాబు
10. ఒక్కడు మిగిలాడు

అనువాదాల్లో ఆ ఐదు

గత కొన్నేళ్ల నుంచి తమిళ అనువాదాల ప్రభావం టాలీవుడ్ మీద తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది తొలి పది నెలల్లో డబ్బింగ్ సినిమాల పరిస్థితి దయనీయంగా కనిపించింది. కానీ నవంబరు నెలలో మూడు అనువాద చిత్రాలు మంచి వసూళ్లు సాధించి డబ్బింగ్ సినిమాల మార్కెట్ ను కొంచెం నిలబెట్టాయి. ఏడాది ఆరంభంలో వచ్చిన సూర్య సినిమా ‘సింగం-3’ ఈ ఏడాదికి అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమా. కానీ పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే మాత్రం అది ఫ్లాపే. లారెన్స్ నటించిన హార్రర్ కామెడీ సినిమా ‘శివలంగ’ ఓ మోస్తరు వసూళ్లతో పర్వాలేదనిపించింది. అలాగే కార్తీక్ నరేన్ అనే యువ దర్శకుడు రూపొందించిన థ్రిల్లర్ మూవీ ‘16’ పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై ఆదరణ పొందింది. తొలి పది నెలల్లో ఓ మోస్తరు విజయాలు సాధించినవి ఈ రెండు సినిమాలే. ఐతే నవంబరు నెలలో ఒకటికి మూడు తమిళ సినిమాలు మంచి వసూళ్లతో ఆకట్టుకున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది కార్తి సినిమా ‘ఖాకి’ గురించే. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మంచి వసూళ్లూ వచ్చాయి. గత కొన్నేళ్లలో సౌత్ ఇండియాలో వచ్చిన ఉత్తమ కాప్ థ్రిలర్ ఇదే అని చెప్పొచ్చు. అలాగే సిద్ధార్థ్ హాలీవుడ్ స్థాయి హార్రర్ థ్రిల్లర్ ‘గృహం’తో టాలీవుడ్లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కూడా క్రిటికల్ అక్లైమ్ తో పాటుగా మంచి కలెక్షన్లు రాబట్టింది. విజయ్ సినిమా ‘అదిరింది’కి వివాదాలు కలిసొచ్చి మంచి వసూళ్లు రాబట్టింది. అనువాదాల్లో చెప్పుకోదగ్గ సినిమాలు ఈ ఐదే. ధనుష్ మూవీ ‘వీఐపీ-2’.. అజిత్ హీరోగా నటించిన ‘వివేకం’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు.

దర్శక ధీరుడికి దీటుగా అతను

‘బాహుబలి: ది కంక్లూజన్’ లాంటి సినిమా ఉండగా.. ఈ ఏడాది తెలుగులో ఉత్తమ దర్శకుడు ఎవరు అనే విషయంలో చర్చే ఉండకూడదు. ఎందుకంటే ‘బాహుబలి: ది బిగినింగ్’తోనే తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ స్థాయికి చేర్చిన రాజమౌళి.. ‘బాహుబలి: ది కంక్లూజన్’తో మన సినిమాను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. భారతీయ సినిమాను ‘బాహుబలి’కి ముందు.. ‘బాహుబలి’కి తర్వాత అని విభజించి చెప్పుకునే స్థాయిలో జక్కన్న చరిత్ర సృష్టించాడు. కాబట్టి ఉత్తమ దర్శకుడి స్థానం రాజమౌళిదే. ఐతే తీసింది చిన్న సినిమానే అయినా కంటెంట్ పరంగా చూస్తే ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. రాజమౌళికి గట్టి పోటీ ఇచ్చాడనే చెప్పాలి.  ఫిలిం మేకింగ్ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త పాఠాలు నేర్పిస్తూ.. సంచలన రీతిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు సందీప్. ఇక ‘ఫిదా’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీని అత్యంత జనరంజకంగా మలిచి.. తెలంగాణ మాండలికానికి తెలుగు సినిమాల్లో ఒక గౌరవం కల్పించి.. దాన్ని అన్ని ప్రాంతాల వారికీ చేరువ చేసిన ఘనుడు శేఖర్ కమ్ముల. వరుస ఫ్లాపుల నుంచి బయటపడి తన ఉనికిని ఘనంగా చాటుకున్నాడు కమ్ముల. ఇక ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో గొప్ప సాహసం చేసి విజయవంతమయ్యాడు క్రిష్. దర్శకుడిగా అతడి స్థాయిని ఎంతో పెంచిన సినిమా ఇది. అలాగే ‘ఘాజీ’తో పరిచయమైన సంకల్ప్ రెడ్డి ఆశ్చర్యపరిచాడు. ఓ కొత్త దర్శకుడు ఇలాంటి సాహసోపేత సినిమాను అంత పకడ్బందీగా తీయడం గొప్ప విషయమే. ‘నిన్ను కోరి’ లాంటి మెచ్యూర్డ్ లవ్ స్టోరీని బాగా డీల్ చేసిన మరో కొత్త దర్శకుడు శివ నిర్వాణ కూడా సత్తా చాటాడు. ‘గరుడవేగ’తో ప్రవీణ్ సత్తారు తన స్థాయి ఏంటో చాటి చెప్పాడు. ఈ సినిమాతో అతడి రేంజే మారిపోయింది. ‘మెంటల్ మదిలో’తో వివేక్ ఆత్రేయ.. ‘ఒక్క క్షణం’తో వీఐ ఆనంద్.. ‘ఆనందో బ్రహ్మ’తో మహి వి.రాఘవ్ కూడా దర్శకులుగా తమదైన ముద్ర వేశారు. సీనియర్ దర్శకుడు తేజ ‘నేనే రాజు నేనే మంత్రి’తో దశాబ్దంన్నర తర్వాత హిట్టు కొట్టి ఉపశమనం పొందాడు. మారుతి ‘మహానుభావుడు’ లాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మళ్లీ ఫామ్ చాటుకున్నాడు. సతీశ్ వేగేశ్న ‘శతమానం భవతి’తో దర్శకుడిగా తనేంటో రుజువు చేసుకున్నాడు. ‘గురు’తో సుధ కొంగర .. ‘రారండోయ్ వేడుక చూద్దాం’తో కళ్యాణ్ కృష్ణ కూడా తమ ప్రతిభను చాటుకున్నారు.

ఆ కుర్రాడి తర్వాతే అందరూ

ఈ ఏడాది నటుడిగా గొప్ప ప్రతిభ చూపించిన నటులు చాలామంది ఉన్నారు. ఐతే అందర్లోకి స్టాండ్ ఔట్‌గా నిలిచేది ‘అర్జున్ రెడ్డి’గా విజయ్ దేవరకొండ అభినయమే. అంతలా ఒక క్యారెక్టర్‌ను ఓన్ చేసుకుని ఒదిగిపోవడం అందరి వల్లా సాధ్యమయ్యే పనేమీ కాదు. విజయ్ మున్ముందు ఏ పాత్రలో ఎలా నటిస్తాడో కానీ.. ‘అర్జున్ రెడ్డి’ అనే సినిమా వరకు అతడి పెర్పామెన్స్ ఔట్ స్టాండింగ్. ఇక ‘జై లవకుశ’లో మూడు పాత్రల్లో వైవిధ్యం చూపిస్తూ.. ముఖ్యంగా రావణ పాత్రలో చెలరేగిపోయిన ఎన్టీఆర్ 2017ను చిరస్మరణీయం చేసుకున్నాడు. ఇక నాని ‘నేను లోకల్’.. ‘నిన్ను కోరి’.. ‘ఎంసీఏ’.. ఈ మూడు సినిమాల్లోనూ అదగరొట్టేశాడు. అతడు చేసినవి మామూలు పాత్రలే కానీ.. వాటిలోనే తన ప్రతిభ చాటుకున్నాడు. నందమూరి బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో గొప్పగా నటించాడు. ‘బాహుబలి: ది కంక్లూజన్’లో ప్రభాస్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇదే సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టిన రానా దగ్గుబాటి.. ‘ఘాజీ’.. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాల్లో తిరుగులేని పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ‘ఖైదీ నంబర్ 150’లో చిరు తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. తన బాక్సాఫీస్ స్టామినా ఇంకా తగ్గలేదని చిరు నిరూపించాడు. ఈ సినిమా అంత పెద్ద హిట్టయిందంటే అందుకు చిరనే కారణం. ఇన్నేళ్ల విరామం తర్వాత కూడా చిరు చక్కటి లుక్ తో కనిపించాడు. డ్యాన్సులు, ఫైట్లలో గ్రేస్ చూపించాడు. శర్వానంద్ ‘శతమానం భవతి’.. ‘మహానుభావుడు’ సినిమాల్లో చక్కటి అభినయం ప్రదర్శించాడు. ‘గురు’లో వెంకీ చక్కటి అభినయంతో ఆకట్టుకున్నాడు. ‘దువ్వాడ జగన్నాథం’లో అల్లు అర్జున్ మంచి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అక్కినేని కుర్రాళ్లు నాగచైతన్య.. అఖిల్.. ‘రారండోయ్ వేడుక చూద్దాం’.. ‘హలో’ సినిమాలతో మెప్పించారు. నిఖిల్ ‘కేశవ’గా మెప్పించాడు. ‘స్పైడర్’లో మహేష్ బాబు.. ‘కాటమరాయుడు’లో పవన్ కళ్యాణ్.. ‘రాజు గారి గది-2’లో నాగార్జున జస్ట్ ఓకే అనిపించారు.

హైబ్రిడ్ పిల్ల కొల్లగొట్టేసింది

హీరోయిన్లలో ఈ ఏడాది బెస్ట్ పెర్ఫామెన్స్ విషయంలో శషబిషలేమీ లేవు. ‘ఫిదా’ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకుల మనసు దోచేసిన సాయి పల్లవి తిరుగులేని స్థాయిలో నిలబడింది. ఆమె తర్వాత ‘నిన్ను కోరి’తో మెస్మరైజ్ చేసిన నివేదా థామస్ నిలుస్తుంది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’లో భ్రమరాంభగా రకుల్ ప్రీత్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ‘శతమానం భవతి’.. ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలతో అనుపమ పరమేశ్వరన్ బాగా ఆకట్టుకుంది. ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలిని పాండే.. ‘అమీతుమీ’ కథానాయిక ఈషా రెబ్బా కూడా తమ ప్రత్యేకత చాటుకున్నారు. కాజల్ చాన్నాళ్ల తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్ తో ఆకట్టుకుంది. సమంత ‘రాజు గారి గది-2’లో సాహసోపేత పాత్రతో మెప్పించింది. ‘బాహుబలి-2’లో శివగామిగా రమ్యకృష్ణ.. దేవసేనగా అనుష్క బలమైన ముద్ర వేశారు.

రాజు గారే నంబర్ వన్ కానీ..

ఈ ఏడాది నిర్మాతల్లో దిల్ రాజే నంబర్ వన్ అనడంలో ఎవరికీ సందేహాల్లేవు. ఆయన తన బేనర్లో ఈ ఏడాది ఏకంగా ఆరు సినిమాలు అందించారు. ఇది అరుదైన ఘనతే. ఆ ఆరు సినిమాలూ బ్లాక్ బస్టర్లే అని.. ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టేశానని దిల్ రాజు మళ్లీ మళ్లీ చెప్పుకున్నారు. పెద్ద వేడుక కూడా చేసుకున్నారు. కానీ ఈ ఆరు సినిమాల్లో ప్రేక్షకుల ఆమోదం పూర్తి స్థాయిలో పొందింది మూడు సినిమాలే. అందులో మొదటిది ‘ఫిదా’ అయితే.. రెండోది ‘శతమానం భవతి’. ఈ రెండు సినిమాలకూ అన్ని రకాలుగా ప్రశంసలు దక్కాయి. వసూళ్ల వర్షమూ కురిసింది. ‘నేను లోకల్’ కంటెంట్ పరంగా జస్ట్ ఓకే అనిపించుకున్నప్పటికీ అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. మిగతా మూడు సినిమాలు మాత్రం విమర్శలెదుర్కొన్నాయి. ముఖ్యంగా ‘దువ్వాడ జగన్నాథం’ బాగా వివాదాస్పదమైంది. కంటెంట్ పరంగా ఇందులో ఏ విశేషం లేదు. కానీ ఓపెనింగ్స్ వచ్చాయి. చివరికీ చిత్రం కొంత మేర నష్టాలు మిగిల్చింది. దాన్ని ‘ఫిదా’తో కవర్ చేశామనడం ద్వారా ఆ చిత్రం హిట్ కాదని చెప్పకనే చెప్పాడు రాజు. ఇక ‘రాజా ది గ్రేట్’ కూడా ఏదో బొటాబొటిగా నడిచింది. ‘ఎంసీఏ’ కూడా బాగా విమర్శల పాలైంది. రాజు నుంచి రావాల్సిన స్థాయి సినిమా కాదిది. ఐతే దీనికి కూడా కాలం కలిసొచ్చి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఓవరాల్ గా చూస్తే దిల్ రాజు మరే నిర్మాతకూ అందని స్థాయిలో నిలిచాడు కానీ.. ఆయన ప్రకటించుకున్నట్లు ఆరు బంతులకు ఆరు సిక్సర్లు అనే మాట మాత్రం అందరి అంగీకారం పొందలేదు.

దేవిశ్రీ గెలిచాడు సరే..

‘ఖైదీ నంబర్ 150’.. ‘నేను లోకల్’.. ‘దువ్వాడ జగన్నాథం’.. ‘జై లవకుశ’.. ‘ఉన్నది ఒకటే జిందగీ’.. ‘ఎంసీఏ’.. ఇలా పెద్ద పెద్ద సినిమాలు చాలానే చేశాడు దేవిశ్రీ ప్రసాద్. వీటిలో ‘ఎంసీఏ’ మినహా అన్నీ మ్యూజికల్ హిట్లయ్యాయి. కాకపోతే దేవిశ్రీ సంగీతం రొటీన్ అయిపోతోందని.. ఒకట్రెండు మినహాయిస్తే ఆల్బంలో అతడి పాటలు ప్రత్యేకంగా ఉండట్లేదన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాదికి నంబర్ వన్ అతడే అయినా.. ఇలాగే కొనసాగితే ఈ స్థానం నిలవడం కష్టమే అవుతుంది. ఏడాది చివర్లో ‘హలో’తో అనూప్ రూబెన్స్.. ‘అజ్ఞాతవాసి’తో అనిరుధ్.. దేవిశ్రీకి గట్టి సవాలే విసిరారు. మరోవైపు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా తమన్.. ‘విన్నర్’.. మహానుభావుడు’.. ‘జవాన్’ ఆల్బంలతో ఆకట్టుకున్నాడు. మిక్కీ జే మేయర్ ‘శతమానం భవతి’తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. చిరంతన్ భట్ (గౌతమీపుత్ర శాతకర్ణి).. శక్తి కాంత్ (ఫిదా) మంచి సంగీతంతో ఆకట్టుకున్నారు.

వీళ్లు పైకి లేచారు

2017 కొందరు హీరోలకు కమ్ బ్యాక్ ఇయర్ అయింది. తమ చివరి సినిమాలు దారుణమైన ఫలితాలనందుకోవడంతో వెనుకబడిపోయిన ఈ ఏడాది మంచి విజయాలతో పుంజుకున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది సీనియర్ హీరో రాజశేఖర్ గురించే. గత దశాబ్ద కాలంలో ఆయన సినిమాల పరిస్థితేంటో.. ఆయన మార్కెట్ ఎంతగా దెబ్బ తిందో అందరికీ తెలిసిందే. రాజశేఖర్ సినిమా వస్తుంటే పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. అలాంటిది ఆయన కొత్త సినిమా ‘పీఎస్వీ గరుడవేగ’ ఒక నెల పాటు చర్చనీయాంశమైంది. ఈ సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. బడ్జెట్ బాగా ఎక్కువ కావడం వల్ల కమర్షియల్ సక్సెస్ కాలేదు కానీ.. ఈ సినిమాకు ఆదరణ బాగానే కనిపించింది. రాజశేఖర్ మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చాడు. ఈ సినిమా ఊపులో రాజశేఖర్ తన కెరీర్ ను ఎలా పొడిగించుకుంటాడో చూడాలి. మరోవైపు హీరో అయ్యాక ఎన్నడూ లేని విధంగా రెండేళ్ల పాటు సినిమా రిలీజ్ లేకుండా ఉండిపోయిన మాస్ రాజా రవితేజ.. దీపావళికి ‘రాజా ది గ్రేట్’తో పలకరించాడు. ఆ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ అది కమర్షియల్ గా ఓకే అనిపించింది. ఈ చిత్రం రవితేజ నటన.. అతడి ఎనర్జీ తన అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ఇక హీరోగా నిలదొక్కుకోవడానికి రెండు దశాబ్దాల నుంచి ప్రయత్నిస్తున్న నాగార్జున మేనల్లుడు సుమంత్ కు ‘మళ్ళీ రావా’ ఊరటనిచ్చింది. వరుస ఫ్లాపుల నుంచి సుమంత్ ను ఈ సినిమా బయట పడేసింది. ఇది కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయిపోలేదు కానీ.. పెట్టుబడిని వెనక్కి తీసుకురాగలిగింది. మంచి సినిమాగా గుర్తింపు సంపాదించింది. ఇక ఏడాది చివర్లో వచ్చిన ‘హలో’ అఖిల్ కు కమ్ బ్యాక్ ఫిలిం అయింది. తొలి సినిమా ‘అఖిల్’తో చేదు అనుభవాన్నెదుర్కొన్న అఖిల్ కు ‘హలో’ ఊరటనిచ్చింది. ఈ సినిమాలో అతడి కష్టానికి గుర్తింపు లభించింది. సినిమా కూడా విమర్శకుల ప్రశంసలందుకుంది. కమర్షియల్ గా పర్వాలేదనిపించింది.

-చంద్ర
Tags:    

Similar News