స్పెషల్ స్టోరీ: టాలీవుడ్ స్టార్ టూ 'పాన్ ఇండియా స్టార్'...!

Update: 2020-10-23 11:10 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ స్టార్ డమ్ ఖండాలు దాటింది. అప్పటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్ 'పాన్ ఇండియా స్టార్'గా మారిపోయారు. అయితే ప్రభాస్ ఈ స్థాయికి రావడానికి చాలానే కృషి చేశాడు. రెబల్ కృష్ణరాజు వారసుడిగా 'ఈశ్వర్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ప్రభాస్. 'వర్షం' సినిమాలతో అప్పటి స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'ఛత్రపతి' సినిమాతో స్టార్ హీరోల సరసన నిలిచాడు. ఈ క్రమంలో 'పౌర్ణమి' 'మున్నా' 'యోగి' 'బుజ్జిగాడు' 'ఏక్ నిరంజన్' 'బిల్లా'.. ఒకదానికొకటి సంబంధం లేని కథలను పాత్రలను ఎంచుకుంటూ వచ్చాడు. ఇక 'డార్లింగ్' 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. అదే క్రమంలో 'మిర్చి' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

దర్శకధీరుడు రాజమౌళి - డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'బాహుబలి' సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసి ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిపారు. ఈ సినిమాతో ప్రభాస్ ఖ్యాతి దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇప్పుడు సౌత్ హీరోలందరికీ పాన్ ఇండియా మూవీస్ చేస్తే వర్కౌట్ అవుతాయనే ధైర్యం ఇచ్చాడు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ నిలబెట్టుకునే క్రమంలో వరుసపెట్టి ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్.. 'సాహో' సినిమాతో మరోసారి బాలీవుడ్ బాక్సాఫీస్ ని కొల్లగొట్టాడు. దీంతో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ సైతం ప్రభాస్ డేట్స్ కోసం క్యూలు కడుతున్నారంటే అతని రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం 'రాధే శ్యామ్' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కి గ్రీన్ ఇచ్చాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తీయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి. ఇందులో ప్రభాస్ కోసం బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్ - దీపికా పడుకునే ని తీసుకొస్తున్నారు. దీంతో పాటు ''ఆదిపురుష్'' అనే స్ట్రెయిట్ హిందీ మూవీని కూడా అనౌన్స్ చేశాడు ప్రభాస్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని టీ - సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ - క్రిషన్‌ కుమార్‌ నిర్మించనున్నారు. ఇలా వేటికవే ప్రత్యేకమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాడు.

ప్రభాస్‌ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు. సూర్యనారాయణ రాజు - శివ కుమారి కొడుకు ప్రభాస్‌. రెబల్ కృష్ణరాజు అతనికి పెదనాన్న. సినిమాల్లోకి వచ్చి ఈ రేంజ్ లో స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నా కూడా ప్రభాస్ ఎప్పుడూ ఒదిగి ఉంటాడు. అందరినీ 'డార్లింగ్' అంటూ ప్రేమగా పిలుస్తూ.. తోటి నటీనటులతో టెక్నిషియన్స్ తో ఫ్యాన్స్ తో స్నేహితులతో ఒకేలా ప్రవర్తిస్తుంటాడు. అందుకే ప్రభాస్ తో నటించిన వారు.. వర్క్ చేసిన వారు మళ్ళీ మళ్ళీ నటించడానికి ఇష్టపడుతుంటారు. ఇక ఆపదలో ఉన్నవారిని ఆదుకోడానికి సహాయ సహకారాలు అందిస్తూ రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నాడు. నేడు డార్లింగ్‌ ప్రభాస్‌ 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని 'తుపాకీ డాట్ కామ్' కోరుకుంటోంది..!
Tags:    

Similar News