విక్ర‌మ్.. ఆ మెరుపులు ఏమ‌య్యాయి?

త‌మిళ మూవీ ఎన్ కాద‌ల్ క‌న్మ‌ణి మూవీతో క‌థానాయ‌కుడిగా కెరీర్ ప్రారంభించిన విక్ర‌మ్ `చిరున‌వ్వుల వ‌ర‌మిస్తావా` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించారు.;

Update: 2026-04-17 09:30 GMT

ఇండియ‌న్ సినిమాల్లో ప్ర‌యోగాల‌కు, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన లెజెండ‌రీ హీరో క‌మ‌ల్ హాస‌న్‌. ఆయ‌న చేసిన‌న్ని ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లు, చిత్రాలు ఇంత వ‌రకు ఎవ‌రూ చేయ‌లేదు. అలాంటి క్యారెక్ట‌ర్ల‌ని ఎవ‌రూ ట‌చ్ చేయ‌లేదు కూడా. ఆ త‌రువాత ఆ స్థాయిలో కాక‌పోయినా స‌రికొత్త పాత్ర‌లు, సినిమాల‌తో ప్ర‌యోగాల‌కు శ్రీ‌కారం చుట్టిన హీరో చియాన్ విక్ర‌మ్‌. త‌మిళ మూవీ ఎన్ కాద‌ల్ క‌న్మ‌ణి మూవీతో క‌థానాయ‌కుడిగా కెరీర్ ప్రారంభించిన విక్ర‌మ్ `చిరున‌వ్వుల వ‌ర‌మిస్తావా` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించారు.

ఆ త‌రువాత ఆడాళ్లా మ‌జాకా, బంగారు కుటుంబం, ఊహ‌, అక్కా బాగున్నావా?, మెరుపు వంటి సినిమాల్లో న‌టించారు. కానీ నో యూజ్‌.. అక్క‌డి నుంచే ప్ర‌యోగాల బాట ప‌ట్టారు. ఛాలెంజింగ్‌గా ఉండే క్యారెక్ట‌ర్ల‌కు, మూవీస్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారారు. డైరెక్ట‌ర్ బాల‌తో క‌లిసి విక్ర‌మ్ చేసిన తొలి ప్ర‌యోగాత్మ‌క చిత్రం `సేతు`. మాన‌సిక రోగిగా క‌నిపించ‌డం కోసం 21 కేజీల బ‌రువు త‌గ్గి న‌టించారు. 1999లో విడుద‌లైన ఈ సినిమా త‌మిళ నాట సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుని న‌టుడిగా విక్ర‌మ్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది.

మ‌రిన్ని ప్ర‌యోగాల‌కు ధైర్యాన్నిచ్చింది. ఈ సినిమా అందించిన ప్రోత్సాహంతో విక్ర‌మ్ అప్ప‌టి నుంచి ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌కు, పాత్ర‌ల‌కే ప్రాధాన్య‌త ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు. అలా 2001లో విన‌య‌న్ డైరెక్ష‌న్‌లో అంధుడిగా `కాశి`లో న‌టించి ప్ర‌శంస‌లు అందుకున్నారు. అయితే రెండు నెల‌ల పాటు ఈ సినిమా కార‌ణంగా విక్ర‌మ్ చూపుకు సంబంధించిన స‌మ‌స్య‌ల్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

ఆ త‌రువాత రెండేళ్ల‌కు మ‌ళ్లీ బాల డైరెక్ష‌న్‌లో `పితామ‌గ‌న్‌`లో న‌టించాడు. శ్మ‌శానంలో పెరిగిన వ్య‌క్తిగా, డైలాగ్‌లు లేకుండా కేవ‌లం హావ భావాల‌తో విక్ర‌మ్ నటించిన తీరు ప్ర‌శంస‌ల‌తో పాటు అవార్డుల్ని తెచ్చి పెట్టింది. న‌టుడిగా విక్ర‌మ్‌ని మ‌రో మెట్టు పైకి ఎక్కించింది. జాతీయ పుర‌స్కారాన్ని అందించింది. ఓ ప‌క్క ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేస్తూనే మ‌రో ప‌క్క స్వామి, ఢిల్లీ, జెమిని, స‌మురాయ్‌, కింగ్‌, ధూల్‌, కాద‌ల్ స‌డుగుడు, అరుళ్ వంటి క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ సినిమాలు చేశారు.

విక్ర‌మ్‌లోని న‌ట విశ్వ‌రూపానికి నిద‌ర్శ‌నంగా నిలిచిన మూవీ `అప‌రిచితుడు`. ఇందులో సెక‌న్‌కి హావ‌భావాలు మార్చే వ్య‌క్తిగా విక్ర‌మ్ న‌ట‌న అంద‌రిని అబ్బుర ప‌రిచింది. ఆ త‌రువాత మేధో వైక‌ల్యం ఉన్న వ్య‌క్తిగా `నాన్న`, కురూపిగా `ఐ`..ఏడు విభిన్న‌మైన గెట‌ప్‌ల‌లో కోబ్రా`, గిరిజ‌న నాయ‌కుడిగా `తంగ‌లాన్‌` వంటి సినిమాల్లో న‌టించాడు. అయితే విక్ర‌మ్ త‌న‌దైన మార్కు సినిమాల‌ని చేయ‌లేక‌పోతున్నాడు. గ‌త మెరుపులు క‌నిపించ‌డం లేదు. దీంతో కెరీర్ ప‌రంగా చాలా వ‌ర‌కు విక్ర‌మ్ డౌన్ అయ్యాడు. ప్ర‌స్తుతం మూడు సినిమాల్లో న‌టిస్తున్న విక్ర‌మ్ మ‌ళ్లీ గ‌త‌న‌దైన మార్కు క్యారెక్ట‌ర్ల‌తో మెరుపులు మెరిపించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News