షూటింగులు షురూ చేయాలని చూస్తున్న టాలీవుడ్ మేకర్స్..!

Update: 2021-06-03 03:30 GMT
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో సినిమాల షూటింగ్స్ అన్నీ ముందుగానే నిలిపివేశారు. తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెట్టడంతో తిరిగి చిత్రీకరణ ప్రారంభించలేకపోయారు. అయితే గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. రాబోయే వారం రోజుల్లో ఇంకాస్త తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరో పది రోజులు లాక్ డౌన్ పొడిగించినప్పటికీ సడలింపులు ఇచ్చారు. దీనిని బట్టి మరో రెండు వారాల్లో ప్రభుత్వాలు షూటింగులకు అనుమతినిచ్చనే హోప్ తో ఉన్నారు టాలీవుడ్ మూవీ మేకర్స్. అందుకే చాలా మంది నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి - చరణ్ కలిసి నటిస్తున్న 'ఆచార్య' షూటింగ్ కేవలం 10 - 12 రోజులు మాత్రమే పెండింగ్ ఉంది. సెట్ రెడీగా ఉండటంతో షూటింగ్ కి అనుమతి వచ్చిన వెంటనే పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయాలని ఎదురుచూస్తునన్నారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ ని రీ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వారం రోజుల షూటింగ్ తో టాకీ పూర్తయితే.. కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంటుందని తెలుస్తోంది.

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న 'శాకుంతలం' షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఓ భారీ సెట్ ని సిద్ధం చేస్తున్నారు. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న 'అఖండ' షూటింగ్ కూడా పర్మిషన్ వచ్చిన వెంటనే స్టార్ట్ కానుంది. ఇప్పటికే దీనికి తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' 10 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. సెట్ కూడా సిద్ధంగా ఉండటంతో ఎప్పుడు మొదలైతే అప్పుడు పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తోంది.

పవన్ కళ్యాణ్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' 'హరి హర వీరమల్లు' సినిమాలు కూడా త్వరలోనే తిరిగి సెట్స్ పైకి వెళ్లనున్నాయి. అలానే అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వస్తున్న 'పుష్ప'.. నాని నటిస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలు కూడా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాయి. 'ఆదిపురుష్' సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో సన్నాహాలు జరుగుతున్నాయి. 'సర్కారు వారి పాట' 'థాంక్యూ' వంటి సినిమాలు కూడా తదుపరి షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటున్నాయి. అక్కినేని నాగార్జున - ప్రవీణ్ సత్తారు కలయికలో రూపొందే సినిమా కోసం హైదరాబాద్ లో సెట్ రెడీ చేస్తున్నారు. ఇలా క్రేజీ మూవీస్ అన్నీ షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
Tags:    

Similar News