టాలీవుడ్ నోట ఒకే ఒక్క మాట....?

Update: 2021-11-28 11:30 GMT
టాలీవుడ్ ఇపుడు ఒక్క మాట మీద ఉంది. ఏకత్రాటి మీదకు వచ్చింది. మరి ఇన్నాళ్ళూ లేదా అంటే ఉండేది కానీ అక్కడక్కడ‌ అయినా వేరే మాట వినిపించేది. ఇపుడు అలా కాదు పెద్ద నుంచి చిన్న వరకూ వారి నుంచి వీరు వరకూ అందరూ ఒక్కటే అంటున్నారు. అదే సినిమా గెలవాలి. సినిమా బతకాలి. నిజంగా ఇది గొప్ప విషయం. ఇప్పటిదాకా ఎవరైనా అనుకునేది ఒక్కటే. మా సినిమా బాగా అడాలి. మేమే గొప్ప అని. మా కలెక్షన్లే కుమ్మేయాలి అని. అయితే కరోనా అనంతరం పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఒక దశలో సినిమా అన్నది పూర్తిగా అదృశ్యం అయిపోతుంది అన్న బెంగ కూడా అందరిలో ఏర్పడింది.

దాంట్లో నుంచి వచ్చినదే ఈ ఐకమత్యం. అందుకే ఎన్నడూ కనబడని కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి. ఎన్నడూ ఒకే ఫ్రేమ్  లో కనబడని వారు వస్తున్నారు. అందరి సినిమాలు బాగా ఆడాలి అనుకుంటున్నారు. ఒకరిని ఒకరు దీవిస్తున్నారు. అభినందనలు తెలియచేస్తున్నారు. అల్లు అర్జున్ వచ్చి బాలయ్య సినిమా ఫంక్షన్లో మాట్లాడడం అంటే ఒక విధంగా విశేషంగానే చూడాలి.

ఆయన సీనియర్ హీరోగా బాలయ్యను ఎంతో విలువ ఇస్తూనే అఖండమైన విజయాన్ని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు చాలా వివేకవంతంగా ఉన్నాయి. కరోనా తరువాత టాలీవుడ్ దారుణంగా ఉంది. ఒకపుడు చిన్న సినిమాల మీద సానుభూతి చూపించేవాళ్ళం. ఇపుడు అలా కాదు, ప్రతీ సినిమా విలువైనదే. ప్రతీ సినిమా గెలవాలి. బరిలో నెగ్గాలి అంటూ అఖండ టీమ్ కి ఆయన ఇచ్చిన బూస్టప్ చాలా ఎక్కువే అనాలి.

బాలయ్య కూడా అదే మాట అన్నారు. తన సినిమాతో పాటు బన్నీ పుష్ప మూవీ, ఇంకా చిరంజీవి ఆచార్య, అబ్బాయి జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్, భీమ్లా నాయక్ ఇలా అన్ని సినిమాలు సూపర్ హిట్ కావాలని కోరుకున్నాడు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా సినిమా గెలవాలి అంతే అంటూ చెప్పడం బట్టి చూస్తూంటే టాలీవుడ్ అంతా ఒక్కటైంది అని అనిపించకమానదు.

ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. కరోనా అనంతర పరిస్థితులతో టాలీవుడ్ ఇబ్బంది పడుతూంటే ఏపీ సర్కార్ బెనిఫిట్ షోలను ర‌ద్దు చేయడం, టికెట్ల రేట్లను అలాగే ఉంచడం వంటి ఆంక్షల వల్ల కూడా తెలుగు చిత్ర సీమ మధనపడుతోంది. ఈ విషయంలో కూడా వారూ వీరూ తేడా లేకుండా స్పందిస్తున్నారు. చిరంజీవి ట్విట్టర్ ద్వారా జగన్ సర్కార్ కి అప్పీల్ చేసుకుంటే అఖండ వేదిక మీద బాలయ్య రెండు రాష్ట్ర ప్రభుత్వాలు టాలీవుడ్ కి సహకరించాలి అని కోరుకున్నారు. ఇదే మాటను మిగిలిన పెద్దలూ చెబుతున్నారు. మొత్తానికి టాలీవుడ్ లో వచ్చిన ఈ ఐక్యత చూస్తూంటే మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని అంతా అంటున్నారు. ఇదే విధానంలో ముందుకు వెళ్తే తెలుగు సినిమా ఎక్కడైనా జయిస్తుంది, నిలుస్తుంది అని చెబుతున్నారు.
Tags:    

Similar News