అందుకే బాలీవుడ్ సినిమాలకి బై బై చెప్పేశా: తమన్

Update: 2021-12-05 12:30 GMT
టాలీవుడ్ సంగీత దర్శకులలో తమన్ స్థానం ప్రత్యేకం. ప్రతి పాటను తన కెరియర్ అనే నిచ్చెనకు మెట్లుగా చేసుకుంటూ చకచకా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఒక సినిమాకి కథా కథనాల తరువాత ముఖ్యమైనది సంగీతమే. ప్రేక్షకులు కథలో ప్రయాణం చేస్తూ అలసిపోయినప్పుడు, పాట అనేది ఒక ఎనర్జీ డ్రింక్ లా వాళ్లపై పనిచేస్తుంది. అలాంటి పాటతో ప్రేక్షకులను మెప్పించడం అంత తేలికైన విషయమేం కాదు. హీరో బాడీ లాంగ్వేజ్ ..  ఆయనకి గల ఇమేజ్ .. ఆయన సినిమా నుంచి అభిమానులు ఆశించే సాంగ్స్ ను దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది.

టాలీవుడ్ లో ఒక వైపున మణిశర్మ .. మరో వైపున దేవిశ్రీ ప్రసాద్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటూనే, తమన్ తనదైన ముద్రవేస్తూ వెళుతున్నాడు. ఇటీవల కాలంలో ఆయన తన సినిమాలను మ్యూజికల్ హిట్స్ గా నిలబెట్టాడు. దాంతో ఆయనకి బాలీవుడ్ నుంచి కూడా భారీగానే ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్ ఆఫర్ అంటే ఒక రకంగా ప్రమోషన్ మాదిరి అనుకోవాలి. ఎందుకంటే ఆ సినిమాల పరిధి ..   విస్తరణ ఎక్కువ. ఆ స్థాయిలో లభించే గుర్తింపుకు విలువ ఎక్కువ. అందువలన తమన్ కూడా ఆ దిశగా అడుగులు వేశాడు.

హిందీలో 'గోల్ మాల్' .. 'సింబా' వంటి కొన్ని సినిమాలకు ఆయన పనిచేశాడు. ఆ తరువాత ఎక్కువ కాలం పాటు ఆయన తన సమయాన్ని హిందీ సినిమాలకు కేటాయించకుండా తిరిగి హైదరాబాద్ లో వాలిపోయాడు. అందుకు కారణం ఏమిటని అడిగితే, ఒక రకంగా పారిపోయి వచ్చేశానని ఆయన నవ్వుతూ చెప్పాడు. ఆ తరువాత ఆ ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ. " హిందీలో ఒక సినిమాకి ఐదారుగురు సంగీత దర్శకులు పని చేస్తున్నారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా. ఆ  పద్ధతే నాకు నచ్చలేదు.

ఒక సినిమాకి ఒక సంగీత దర్శకుడు పని చేసినప్పుడే ఆ సినిమాపై అతనికి పూర్తి అవగాహన ఉంటుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా. ఒక కంటెంట్ పై ఐదారుమంది పనిచేయడమనేది నాకు సంతృప్తిని కలిగించలేదు. అందువల్లనే అక్కడ నేను ఇమడలేనని అనిపించింది. అందుకే వెంటనే బై బై చెప్పేసి వచ్చేశాను" అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న చాలా సినిమాలకు సంగీత దర్శకుడిగా తమన్ ఉన్నాడు. వచ్చే ఏడాది ఆ సినిమాలన్నీ థియేటర్లకు వస్తాయి. 'అఖండ' మాదిరిగానే తమన్ కి మరింత మంచి పేరు తీసుకొస్థాయి.  
Tags:    

Similar News