ఆ హీరో ఫ్యామిలీ మొత్తం ప‌వ‌న్ అభిమానులేన‌ట‌!

ప్రజలు చేయాలనుకునే పనులను ఒక నాయకుడు తన కార్యాచరణలో చూపిస్తే అది ఎంతో సంతృప్తినిస్తుందని, పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరుగుతోందని అర్జున్ అన్నారు.;

Update: 2026-02-10 12:45 GMT

ప‌వర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పాలన, ఆలోచనా విధానం, నిజాయితీపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి చ‌ర్చ‌కు దారితీశారు. ‘సీతాపయనం’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన అర్జున్, పవన్ కళ్యాణ్‌ను ఒక హానెస్టీ పొలిటిషియన్‌గా అభివర్ణించారు.

ఆయ‌న వెనుక కళ్లుమూసుకుని వెళ్లొచ్చు

అర్జున్ మాట్లాడుతూ, “మా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్స్. ఆయన చేసే ప్రతి పనిలోనూ నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా చేయాలని అనుకుంటే దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే వ్యక్తి పవన్. అలాంటి నాయకుడిని మనం నమ్మవచ్చు. లీడర్ అంటే ఎవరి వెనుకైనా నడవాలి అంటారు కదా, పవన్ కళ్యాణ్ వెనుక కళ్లుమూసుకుని నడవొచ్చు అనిపిస్తుంది” అని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా పవన్ తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న తీరు తనను బాగా ఆకట్టుకుందని అర్జున్ పేర్కొన్నారు.

ప‌వ‌న్ క‌మిట్‌మెంట్ ను ప్ర‌శంసించాల్సిందే!

ప్రజలు చేయాలనుకునే పనులను ఒక నాయకుడు తన కార్యాచరణలో చూపిస్తే అది ఎంతో సంతృప్తినిస్తుందని, పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరుగుతోందని అర్జున్ అన్నారు. మాటలకే పరిమితం కాకుండా, చేతల్లో చూపించే రాజకీయ నాయకుడు కావడం వల్లే పవన్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. సినీ నేపథ్యం ఉన్నప్పటికీ, రాజకీయాల్లోకి వచ్చాక పవన్ చూపిస్తున్న కమిట్‌మెంట్ ప్రశంసనీయం అని కూడా తెలిపారు.

అర్జున్ భార్య‌, ప‌వ‌న్ కు డై హార్డ్ ఫ్యాన్

ఈ సందర్భంగా అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువేనని, ముఖ్యంగా తన తల్లి అయితే పవన్‌కు డై హార్డ్ ఫ్యాన్ అని ఐశ్వర్య చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ పరిశ్రమకు చెందిన పెద్ద కుటుంబం నుంచి ఇలాంటి ఓపెన్ సపోర్ట్ రావడం పవన్ రాజకీయ ప్రయాణానికి మరింత బలం చేకూర్చే అంశంగా కనిపిస్తోంది.

మొత్తంగా చూస్తే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తన నిజాయితీని, సిద్ధాంతాలను వదలకుండా ముందుకు సాగుతున్న తీరు పలువురు సినీ ప్రముఖులను ఆకర్షిస్తోంది. అర్జున్ వంటి అనుభవజ్ఞుడైన నటుడు, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నుంచి వచ్చిన ఈ ప్రశంసలు పవన్ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత బలపరిచేలా ఉన్నాయి. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, విశ్వసనీయమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేస్తున్నారని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.




Tags:    

Similar News