మ‌రో కీల‌క మైలురాయిని అందుకున్న అన్న‌పూర్ణ ఫిల్మ్ కాలేజ్

అన్నపూర్ణ కాలేజ్‌లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 7.1.4 మిక్స్ ఫెసిలిటీ ప్రారంభించటం త‌న‌కు చాలా ఆనందంగా ఉందన్నారు.;

Update: 2026-02-10 13:00 GMT

అక్కినేని నాగార్జున‌ నేతృత్వంలోని అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా మరో కీలక మైలురాయిని అందుకుంది. సినీ విద్యా రంగంలో సౌండ్ డిజైన్, ఆడియో టెక్నాలజీకి ప్రాధాన్యం పెరుగుతున్న రోజుల్లో అత్యాధునిక Dolby Atmos 7.1.4 HE మిక్స్ ఫెసిలిటీని కాలేజీలో ప్రారంభించారు. ఈ స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ సౌండ్ స్టూడియోను ప్రముఖ నటుడు, నిర్మాత, అన్నపూర్ణ కాలేజ్ ఛైర్మన్ నాగార్జునతో పాటు ఆస్కార్ అవార్డు విజేత, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఘనంగా ప్రారంభించారు.

ఈ కొత్త సౌండ్ మిక్సింగ్ ఫెసిలిటీ ద్వారా విద్యార్థులు, అలుమ్ని, అలాగే ప్రొఫెషనల్ సౌండ్ డిజైనర్లు ప్రపంచ స్థాయి ఇమ్మెర్సివ్ ఆడియో మిక్సింగ్, మాస్టరింగ్‌ను నేర్చుకునే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేకంగా Dolby Atmos 7.1.4 HE సిస్టమ్ తో రూపొందించిన ఈ స్టూడియో, స్పేషియల్ ఆడియోలో ఉన్న అపార అవకాశాలను అన్వేషించేందుకు సహాయపడనుంది. ఆధునిక సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డిజిటల్ కంటెంట్‌లో సౌండ్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, ఈ ఫెసిలిటీ విద్యార్థులకు ఒక గొప్ప లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌గా నిలవనుంది.

అన్నపూర్ణ కాలేజ్‌లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 7.1.4 మిక్స్ ఫెసిలిటీ ప్రారంభించటం త‌న‌కు చాలా ఆనందంగా ఉందన్నారు. సౌండ్ అనేది సినిమాకు ప్రాణంమ‌ని, సినిమా అనేది టెక్నాలజీతో ముందుకు నడిచే మాధ్యమమ‌ని, అందుకే విద్యార్థులకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉంచడమే త‌మ‌ లక్ష్య‌మ‌ని నాగార్జున‌ అన్నారు.

ఎం.ఎం. కీరవాణి ఈ ఫెసిలిటీ డెమోను వీక్షించి, విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. సౌండ్ డిజైన్‌లోని సూక్ష్మతలు, అందచందాలపై తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. సౌండ్ అనేది సినిమాకి ఆత్మ అని, మంచి సౌండ్ డిజైన్ కథనాన్ని మరింత లోతుగా తీసుకెళ్ల‌డంతో పాటూ, ఎమోష‌న్స్ ను పెంచి, ప్రేక్షకుల అనుభూతిని పూర్తిగా మార్చేస్తుందని, ఇలాంటి వరల్డ్-క్లాస్ సౌకర్యాలు విద్యార్థుల్లో క్రియేటివిటీని, ఖచ్చితత్వాన్ని మ‌రింత పెంచుతాయ‌ని చెప్పారు.

సినీ విద్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా చేపడుతున్న ఈ తరహా ప్రయత్నాలు, రాబోయే తరం ఫిల్మ్‌మేకర్లకు బలమైన పునాది వేస్తున్నాయనే చెప్పాలి. Dolby Atmos 7.1.4 HE మిక్స్ ఫెసిలిటీ ప్రారంభంతో, సౌండ్ డిజైన్ రంగంలో ఈ కళాశాల మరో అడుగు ముందుకు వేసింది.

Tags:    

Similar News