2.0 నిర్మాతలు మోసపోయారట

Update: 2017-12-09 16:56 GMT
విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యం ఉన్న సినిమాల్ని అనుకున్న సమయానికి విడుదల చేయడం సవాలే. గత కొన్నేళ్లలో వీఎఫెక్స్ తో ముడిపడ్డ సినిమాలేవీ కూడా అనుకున్న సమయానికి రిలీజవ్వలేదు. ‘బాహుబలి’ రెండు భాగాలూ.. ‘స్పైడర్’ సహా చాలా సినిమాల విడుదలలో ఆలస్యం జరిగింది. ‘2.0’ సైతం ఒకటికి రెండుసార్లు వాయిదా పడటానికి వీఎఫెక్స్ పనుల్లో ఆలస్యమే కారణమని వెల్లడైంది.

హాలీవుడ్ కు చెందిన ఓ వీఎపెక్స్ నిర్మాణ సంస్థ రిథమ్ అండ్ హ్యూస్ స్టూడియోస్ సమయానికి వీఎఫెక్స్ కంటెంట్ డెలివర్ చేయకపోవడం వల్లే ‘2.0’ను వాయిదా వేయాల్సి వచ్చిందట. ఈ సంస్థ ‘లైఫ్ ఆఫ్ పై’ లాంటి భారీ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ సమకూర్చిందట. భారీ మొత్తానికి ఒప్పందం చేసుకుని.. డబ్బులు కూడా ముందే తీసుకున్న ఆ సంస్థ చెప్పిన డేటుకి కంటెంట్ ఇవ్వలేదట. దీంతో 2.0 సినిమాను వాయిదా వేసి.. తాము తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని లైకా ప్రొడక్షన్స్ అంటోంది.

ఈ నేపథ్యంలో రిథమ్ అండ్ హ్యూస్ స్టూడియోస్ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ‘2.0’ నిర్మాతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే వారిపై లా సూట్ ఫైల్ చేయబోతున్నారట. మరి ఆ సంస్థ మీద చర్యలకు సిద్ధమవుతున్న ‘2.0’ నిర్మాతలు వీఎఫెక్స్ పనుల్ని వేరే వాళ్లతో చేయిస్తున్నారా.. లేక వీళ్ల నుంచే కంటెంట్ తీసుకుంటున్నారా అన్నది చూడాలి. ఇంతకీ ఇప్పుడు చెబుతున్నట్లు ఏప్రిల్లో అయినా ‘2.0’ ప్రేక్షకుల ముందుకొస్తుందా?
Tags:    

Similar News