సూపర్ స్టార్ ఫ్యాన్స్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా..?

Update: 2021-06-05 06:30 GMT
సరిలేరు నీకెవ్వరు తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ చేస్తున్నాడు. గీతగోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ ప్రారంభించే ప్రణాళికలో ఉన్నారు మేకర్స్. అయితే కొంతకాలంగా సర్కారు వారి పాట గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇదివరకు ఈ సినిమాలో మహేష్ సరసన ఎవరైతే బాగుంటారో అని హీరోయిన్స్ కోసం చిత్రబృందం వెతికి చాలామందిని అనుకున్న తర్వాత ఆఖరికి ఆ రోల్ కీర్తి సురేష్ చేతిలో పడింది.

ఈ సినిమాను దర్శకుడు పరుశురామ్.. మహేష్ బాబు కోసం ఎమోషనల్ గా సాగే ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సిద్ధంచేశాడు. ఇక కరోనా మహమ్మారి తగ్గి అన్ని కుదిరితే ఈ సినిమా త్వరలోనే మూడో షెడ్యూల్ స్టార్ట్ చేయనుంది. ఈ చిత్రం గురించిన మరో ఆసక్తి వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. హీరోయిన్ కోసం వెతికినట్లుగానే ప్రస్తుతం ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం స్టార్ యాక్టర్స్ వేటలో పడ్డారు మేకర్స్. ఇప్పటివరకు పలువురి పేర్లు వినిపించాయి కానీ ఏ ఒక్కరూ ఖరారు కాలేదు. అయితే ఇదివరకు మహేష్ సినిమాలో విలన్ గా కన్నడ స్టార్స్ ఉపేంద్ర - కిచ్చా సుదీప్ పేర్లు బలంగా వినిపించాయి. కానీ సెట్ కాలేదు.

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ నేమ్ వెలుగులోకి వచ్చింది. ఆయనెవరో కాదు యాక్షన్ కింగ్ అర్జున్. మహేష్ సర్కారు వారి పాటలో విలన్ గా అర్జున్ నటించనున్నట్లు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాక్. మరి నిజమో కాదో గాని ఈ సినిమా బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతుంది కాబట్టి అర్జున్ అయితే సెట్ అవుతాడని భావిస్తున్నారట మేకర్స్. ఎందుకంటే ఇటీవలే అభిమన్యుడు సినిమాలో అర్జున్ మాస్టర్ యాక్షన్ ఎలా సినిమాకు ప్లస్ అయిందో తెలిసిందే. కాకపోతే అది తమిళ సినిమా. కానీ తెలుగులో మాత్రం ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అర్జున్ సాలిడ్ హిట్ అందుకోలేదు. మరి ఓవైపు మహేష్ ఫ్యాన్స్ ఈ విషయంలో కంగారు పడుతున్నారని టాక్. ఇదివరకు అర్జున్ నటించిన నా పేరు సూర్య - లై సినిమాలు ప్లాప్ అయ్యాయి. మరి ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుందని టెన్షన్ పడుతున్నారట. కానీ సినిమాలో కంటెంట్ ఉంటే ఏదైనా క్లిక్ అవుతుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఇంకా అర్జున్ ఖరారు అయినట్టు మేకర్స్ ప్రకటించలేదు. సో ఫ్యాన్స్ కంగారు పడే అవసరం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News