థ్రిల్లర్లు నచ్చవు.. థ్రిల్లర్ సినిమానే చేశాడు

Update: 2018-12-03 10:30 GMT
ఏఎన్నార్ మనవడు సుమంత్.. హీరోగా నిలదొక్కుకోవడానికి చాలానే కష్టపడ్డాడు. కానీ అరంగేట్రం చేసి దాదాపు రెండు దశాబ్దాలవుతున్నా అతను ఇంకా స్ట్రగులవుతూనే ఉన్నాడు. ‘సత్యం’.. ‘గోదావరి’.. లాంటి కొన్ని సినిమాలు మాత్రమే ఆడాయి. ఐతే సుమంత్ కెరీర్లో అతడికి మంచి ఫలితాల్నిచ్చిన సినిమాలన్నీ లవ్ స్టోరీలే కావడం విశేషం. చివరగా అతడికి ఊరటనిచ్చిన ‘మళ్ళీ రావా’ సైతం ప్రేమ కథే. ఐతే కెరీర్లో ఎన్నడూ టచ్ చేయని జానర్ ఫిలింతో వస్తున్నాడు సుమంత్ ఇప్పుడు. అతను తొలిసారిగా చేసిన థ్రిల్లర్ మూవీ ‘సుబ్రహ్మణ్యపురం’. ఈ శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే సుమంత్ కు బేసిగ్గా థ్రిల్లర్లంటేనే నచ్చవట. అయినా తాను ఈ జానర్లో సినిమా చేయడం ఆశ్చర్యమే అంటున్నాడతను.

‘‘ఎందుకోగానీ నాకు థ్రిల్లర్లు నచ్చవు. ఆ జానర్ సినిమాలు నేను చూడను కూడా. ఐతే సంతోష్ జాగర్లమూడి నా దగ్గరికి వచ్చి థ్రిల్లర్ కథే చెబుతానన్నాడు. అతను ఎలాంటి కథ చెప్పినా తిరస్కరిద్దామనే ఆలోచనతోనే కూర్చున్నాను. సగం కథ అవ్వగానే నో చెప్పేద్దామనుకున్నాను. కానీ అతను కథ చెబుతుంటే నాకు తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోయాను. ఈ సినిమా కచ్చితంగా చేయాల్సిందే అని ఫిక్సయ్యాను. మామూలుగా దర్శకులు కథ చెబితే.. మార్పులు చేర్పులు చెబుతుంటాం. నా కెరీర్లో మంచి హిట్టయిన సినిమాలకు కూడా అలా చేశాను. కానీ ‘సుబ్రహ్మణ్యపురం’ కథకు మాత్రం చిన్న కరెక్షన్ కూడా చెప్పలేదు. ఉన్నదున్నట్లుగా చేశాను. దర్శకుడు ఎంత బాగా కథ చెప్పినా.. కొత్తవాడు కాబట్టి సరిగా తీయగలడా అనుకున్నాను. కానీ అతను పర్ఫెక్ట్ గా చేశాడు. సంతోష్ చేసిన షార్ట్ ఫిలిమ్స్ కూడా థ్రిల్లర్లే కావడంతో ఫీచర్ ఫిలింను కూడా ఈజీగా డీల్ చేశాడు’’ అని సుమంత్ తెలిపాడు.

    
    
    

Tags:    

Similar News