వ‌రుస పెట్టి బిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌ల వెన‌క జెన్ Z .. ఓటీటీ ప్ర‌భావం లేన‌ట్టేనా?

ఓటీటీల ఆగమనం - కార్డ్-కటింగ్ విప్లవానికి నాంది పలికిన మిలీనియల్స్- జెన్ Z ఇప్పుడు థియేటర్లకు పెద్ద ఎత్తున క్యూ కడుతూ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలను నమోదు చేస్తున్నాయి.

Update: 2026-08-18 17:03 GMT

ఓటీటీల ఆగమనం - కార్డ్-కటింగ్ విప్లవానికి నాంది పలికిన మిలీనియల్స్- జెన్ Z ఇప్పుడు థియేటర్లకు పెద్ద ఎత్తున క్యూ కడుతూ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలను నమోదు చేస్తున్నాయి. ఫాండ్యాంగో 2026 నివేదిక ప్రకారం.. గడిచిన ఏడాది కాలంలో 87 శాతం మంది జెన్ జీ ప్రతినిధులు సినిమా థియేటర్లలో చిత్రాలను వీక్షించినట్లు వెల్లడైంది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద `స్పైడర్-మాన్: బ్రాండ్ న్యూ డే`,`టోయ్ స్టోరీ 5`, `ది ఒడిస్సీ`, `మైఖేల్`, `ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ` వంటి ఐదు భారీ చిత్రాలు 1 బిలియన్ డాల‌ర్ మార్కును దాటడం ఈ సినిమా ఆదరణకు స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది.

స్మార్ట్‌ఫోన్లు - సోషల్ మీడియా వాడకంతో నిరంతరం సాగే స్వైపింగ్ నుంచి విరామం కోరుకుంటున్న యువత.. రెండు గంటల పాటు డిజిటల్ ప్రపంచానికి దూరంగా స్నేహితులతో కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని పంచుకోవడానికి వెండితెరకు ప్రాధాన్యత ఇస్తోంది. కేవలం స్నేహితులతోనే కాకుండా.. ఒంటరిగా సినిమాకి వెళ్లి చీకటి థియేటర్‌లో ప్రశాంతంగా సినిమాను ఆస్వాదించే వెసులుబాటు కూడా వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా సినిమాలు సులువుగా అందుబాటులో ఉన్నా.. థియేటర్‌కు వెళ్లి ప్రత్యేకంగా ఆ ఈవెంట్‌ను ఆస్వాధించడంలో ఉండే మజా వేరని వారు నిరూపిస్తున్నారు.

కోవిడ్ అనంతర కాలంలో పీవీఆర్ ఐనాక్స్ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ దిగ్గజాలు జనరేషన్ Z ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించేందుకు ధరల త‌గ్గింపు.. సినిమా వీక్ష‌ణ‌ అనుభూతిని మెరుగుపరిచే సరికొత్త వ్యూహాలను అనుసరించాల్సి వచ్చింది. ఇంటి వద్ద లభించే స్ట్రీమింగ్ కంటే.. థియేటర్లలో లభించే ఆడియో-విజువల్ అనుభూతి ఎంతో గొప్పదని భావిస్తున్న యువత కోసం థియేటర్ యాజమాన్యాలు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నాయి. గొవర్ స్టేశ్ అనలిటిక్స్ అంచనాల ప్రకారం... 2026 నాటికి గ్లోబల్ బాక్సాఫీస్ వసూళ్లు 34.7 బిలియన్ డాల‌ర్ల‌కు చేరుకుంటాయని భావిస్తుండగా.. భారత్‌లోనూ హిందీ బాక్సాఫీస్ వసూళ్లలో 57 శాతం వాటా 30 ఏళ్లలోపు యువత నుంచే వస్తోందని ఓర్మాక్స్ నివేదిక స్పష్టం చేసింది.

సోషల్ మీడియా ద్వారా అధికంగా ప్రభావితమయ్యే ఈ జెన్ జీ తరం.. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ , లెటర్‌బాక్స్డ్ వంటి వేదికలపై రీల్స్, ఎడిట్స్‌ను షేర్ చేస్తూ సినిమాలకు సరికొత్త డిజిటల్ ప్రచారాన్ని కల్పిస్తోంది. సినిమా చూసిన తర్వాత దానిపై చర్చించడం... ఆన్‌లైన్‌లో మీమ్స్ .. పోస్టుల ద్వారా ట్రెండింగ్‌లో ఉండటం వారి సోషల్ లైఫ్‌లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. సోషల్ మీడియా వల్ల శ్రద్ధా నిడివి తగ్గిపోయిందని రకరకాల విమర్శలు వస్తున్నా కంటెంట్‌లో నిజమైన సత్తా ఉంటే రెండున్నర గంటల సినిమానైనా ఓపికగా చూసేందుకు ఈ తరం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని రుజువవుతోంది.

ఈ సానుకూల పరిణామాలు కేవలం చలనచిత్ర ప్రదర్శన రంగానికే కాకుండా.. నూతన దర్శకులకు.. సినీ నిర్మాణ రంగానికి సరికొత్త ఉత్సాహాన్ని, భవిష్యత్తుపై భరోసాని ఇస్తున్నాయి. డిజిటల్ మీడియా విప్లవం వల్ల సినిమా హాల్స్ ప్రాముఖ్యత కోల్పోతాయని కొందరు భావించినా యువత చూపుతున్న ఈ విశేషమైన ఆదరణ వెండితెర భవిష్యత్తును సురక్షితంగా మార్చింది. సాంకేతికత ఎంత వేగంగా మారుతున్నా సామూహిక వినోదం కోసం యువత థియేటర్లను ఎంచుకోవడం వినోద రంగంలో డిజిటల్.. భౌతిక మాధ్యమాల చక్కటి సమన్వయానికి అద్దం పడుతోంది.

Tags:    

Similar News