ధర్మో రక్షతి రక్షితః .. ఆస్కార్ విన్నింగ్ సాహితీవేత్త ప్రత్యేకత అదే!
భారీ యాక్షన్ రాజకీయ అంశాలతో రూపొందుతున్న చిత్రం `ధర్మస్థల నియోజకవర్గం`. డెప్త్ ఉన్న ఇలాంటి కథాంశానికి తగ్గట్టు టైటిల్ ట్రాక్ ని రూపొందించాలంటే దానికోసం చాలా క్రియేటివ్ గా ఆలోచించాల్సి ఉంటుంది.
భారీ యాక్షన్ రాజకీయ అంశాలతో రూపొందుతున్న చిత్రం `ధర్మస్థల నియోజకవర్గం`. డెప్త్ ఉన్న ఇలాంటి కథాంశానికి తగ్గట్టు టైటిల్ ట్రాక్ ని రూపొందించాలంటే దానికోసం చాలా క్రియేటివ్ గా ఆలోచించాల్సి ఉంటుంది. దానికోసం ఏకంగా ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ బరిలో దిగడం ఆసక్తికరం. ఈ సినిమాకు సంబంధించిన `ధర్మో రక్షతి రక్షితః` లిరికల్ పాట తాజాగా విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన పొందుతోంది. ఈ పాట సినిమాపై భారీ అంచనాలను పెంచడమే కాకుండా..శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ కాన్సెప్ట్ బేస్డ్ గీతానికి ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించగా... ప్రముఖ గాయకుడు సాయి చరణ్ తన శక్తివంతమైన గానంతో ప్రాణం పోశారు. మహావీర్ యెలెందర్ సమకూర్చిన సంగీతం..నేపథ్య ప్రతిధ్వనులు (బీజీఎం) పాటలోని భావాన్ని మరింత లోతుగా శ్రోతల హృదయాలకు తాకేలా మలిచాయి. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి - చంద్రబోస్ సంయుక్తంగా ఈ పాటను హైదరాబాద్‌లో విడుదల చేయడం ఈ సాంగ్ ప్రమోషన్‌కు పెద్ద ప్లస్ పాయింట్.
పాట ప్రధాన ఉద్దేశం సమాజంలో ధర్మం ప్రాధాన్యతను చాటిచెప్పడమే. `ధర్మో రక్షతి రక్షితః` (మనం ధర్మాన్ని రక్షిస్తే, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది) అనే సనాతన సూత్రాన్ని ఆధారంగా చేసుకుని... మనిషి జీవితంలో పంచభూతాల పాత్రను ఈ పాటలో లోతుగా విశ్లేషించారు. మంచి నడవడిక ఉన్నప్పుడు జీవాన్ని ఇచ్చే నీరు, గాలి, నింగి, నేల, అగ్ని... మనిషి ధర్మాన్ని విస్మరిస్తే వినాశనానికి ఎలా దారితీస్తాయో స్పష్టమైన ఉదాహరణలతో వివరించడం ఈ పాటలోని సాహిత్యం ప్రత్యేకత. ఆర్.ఆర్.ఆర్ `నాటు నాటు` తర్వాత చంద్రబోస్ కలం మరింత పదును తేరి ఝలిపిస్తోందనడానికి ఈ గీతం కూడా ఒక ఉదాహరణ. బోస్ సంగీతంలోని బలమైన పదజాలానికి తగ్గట్టుగా ఆకర్షణీయమైన బాణీని అందించడంలో ఎలేందర్ పనితనం అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఇలాంటి పాటను ఎంపిక చేసుకున్నప్పుడు గాత్రం పరంగా మరింతగా ప్రయోగాలకు ఆస్కారం ఉంది. సాయి చరణ్ గానం బావున్నా.. ఇంకా టోన్ పరంగా ప్రయోగానికి ఛాన్సుంది కదా! అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే.. ఈ చిత్రంలో సీనియర్ నటులు సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్రలతో పాటు వరుణ్ సందేశ్, వితికా షేరు వంటి యంగ్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనుభవజ్ఞులైన నటులతో పాటు సరికొత్త ప్లాట్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో ఈ పాట కథా గమనానికి.. నాయకత్వ భావజాలానికి ఒక బలమైన పునాదిలా నిలవనుంది.
`ధర్మో రక్షతి రక్షితః` పాట కేవలం ప్రచారం కోసమే కాకుండా సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చే ఆణిముత్యంగా నిలిచింది. హృదయాన్ని గెలుచుకునే సాహిత్యం, ఆకట్టుకునే సంగీతం .. కంటెంట్ ఆధారిత కథనంతో వస్తున్న `ధర్మస్థల నియోజకవర్గం` సినిమా ప్రేక్షకుల ఆదరణ పొంది విజయం సాధిస్తుందనడంలో సందేహం లేదు. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మాణంలో.. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.