వెబ్ సిరీస్ కోసం సుకుమార్ నే రంగంలోకి దింపేశారే!

Update: 2021-12-23 10:30 GMT
గతంలో ఒక సినిమా మారుమూల ప్రాంతానికి వెళ్లడానికి ఎన్నో రోజులు పట్టేది. అయినా కొత్తగా రిలీజ్ అయినట్టుగానే ప్రేక్షకులు ఎంతో సంతోషంతో వెళ్లి ఆ సినిమాలు చూసేవారు. ఆ సినిమాను గురించే చాలా రోజుల వరకూ మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే .. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ తెలిసుంటే సినిమాలన్నీ అరచేతిలో ఉన్నట్టే. నచ్చిన సీన్స్ ను వెనక్కి వెళ్లి మళ్లీ చూడొచ్చు .. నచ్చకపోతే ముందుకు వెళ్లొచ్చు. అందువలన ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టేవారు క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో పోటీని తట్టుకుని నిలబడటం కోసం 'ఆహా' వారు తమ కంటెంట్ విషయంలో రాజీ లేని పోరాటం చేస్తున్నారు. కొత్త టాక్ షోలు .. గేమ్ షోలు .. వెబ్ సిరీస్ లు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. నాణ్యత విషయంలో ఎంతమాత్రం వెనకడుగు వేయడం లేదు. యువ దర్శకులను .. రచయితలను .. నటీనటులను సెట్ చేసుకుని కొత్తదనం కోసం ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే 'ఆహా' వారు ఒక వెబ్ సిరీస్ ను సుకుమార్ తో ప్లాన్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. సుకుమార్ టాలెంట్ పై గీతా ఆర్ట్స్ వారికి మంచి నమ్మకం ఉంది. అందువలన ఆయనకి వాళ్లు కాస్త స్వేచ్చను ఇస్తారు.

'పుష్ప' సినిమాకి ముందు 'ఆహా' కోసం సుకుమార్ ఒక వెబ్ సిరీస్ కి అవసరమైన కంటెంట్ ను రెడీ చేశాడు. 3 నెలల పాటు ఆయన ఈ కథపై కసరత్తు చేసి, స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడట. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి 'ఆహా' వారు ఈ ప్రాజెక్టును ఓకే చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. ఆ ప్రాజెక్టును ఇప్పుడు పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారట. అయితే దీనికి సుకుమార్ దర్శకత్వం వహించడు. కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు మాత్రమే ఆయనవి. ఆ తరువాత ఆయన పర్యవేక్షణ ఉంటుంది.

ఇక విశేషం ఏమిటంటే ఈ వెబ్ సిరీస్ లోని హీరో పాత్రకి, 'పుష్ప'లోని హీరో పాత్రకి చాలా దగ్గర సంబంధం ఉంటుందట. 'పుష్ప'లో మాదిరిగానే ఈ కథలోని నాయకుడు కూడా జీరో స్థాయి నుంచి అంచలంచెలుగా హీరో స్థాయికి ఎదుగుతాడట.

మంచి పేరున్న హీరోనే ఈ వెబ్ సిరీస్ కోసం సెట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇక దర్శకత్వ బాధ్యతలను సుకుమార్ శిష్యులలో ఎవరికైనా ఒకరికి అప్పగిస్తారా? లేదంటే వేరేవారిని రంగంలోకి దింపుతారా?
Tags:    

Similar News