ట్రెండీ టాక్: జైలుపాలైన నటుడి కోసం క్రౌడ్ ఫండింగా?
ఇండస్ట్రీలో స్నేహాలు చాలా వరకు వ్యాపారం, సక్సెస్ చుట్టూ తిరుగుతుంటాయి. కొందరు ఎందుకు సహాయం చేయలేదంటే.. కోర్టు కేసుల్లో ఉన్న వ్యక్తులకు సహాయం చేస్తే తమ పేరు కూడా వివాదాల్లోకి వస్తుందేమోనని భయపడతారు.;
బాలీవుడ్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్ నిర్మాతగా నష్టాల్ని ఎదుర్కొని చేసిన అప్పులు వాటిపై వడ్డీలు చెల్లించలేక చెక్ బౌన్స్ కేసుల్లో జైలుకు వెళ్లడం పెద్ద చర్చకు తెర తీసిన సంగతి తెలిసిందే. అయితే రాజ్ పాల్ పై పరిశ్రమలో చాలా సానుభూతి వ్యక్తమవుతోంది. కానీ సానుభూతిని మించి ఎవరూ ఆర్థికంగా సహాయం చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. 5 కోట్ల అప్పే కదా.. తీర్చేసి అతడిని బయటికి తేవాలనే ఆసక్తి ఎవరికీ లేదు.
తాజాగా రాజ్ పాల్ ని ఈ కేసులో లొంగిపోవాల్సిందిగా కోర్టు పిలుపునివ్వడంతో చేసేది లేక జైలుకు వెళ్లాడు. అయితే ఇలాంటి సమయంలో అతడికి సహాయం చేయడానికి స్నేహితులు ఎవరూ ఎందుకు ముందుకు రావడం లేదు. ఎవరూ రాకపోయినా నేనున్నాను అంటూ కేఆర్కే లాంటి వివాదాస్పద క్రిటిక్ 10 లక్షలు సహాయం చేస్తున్నాను! మీరు కూడా ఇవ్వండి!! అంటూ సీన్ లోకి రావడం వెనక అసలు కారణమేమిటి? అంటూ ఆరాలు తీస్తున్నారు.
అయితే 5 కోట్లు అప్పు చేసి జైలుకెళ్లిన నటుడిని విడిపించడానికి క్రౌడ్ ఫండింగ్ ఇవ్వాలా?చెక్ బౌన్స్ కేసులో జైలుపాలైన నటుడిని విడిపించడానికి క్రౌడ్ ఫండింగా? దీని అర్థం అతడు ఎలాంటి తప్పు చేయలేదు.. కాపాడమని కోరడమా? కోర్టు తీర్పును అవమానించడమా? లేక నేను మాత్రమే నటుడు రాజ్ పాల్ యాదవ్ కి గొప్ప స్నేహితుడిని అని క్రిటిక్ కేఆర్కే నిరూపించదలిచాడా? అతడి అసలు ఉద్ధేశం ఏమిటి? ఇండస్ట్రీ స్నేహితులు రాజ్ పాల్ యాదవ్ కి కష్టంలో ఎందుకు సహాయపడలేదు? ఇండస్ట్రీ స్నేహాలను అస్సలు నమ్మలేమా? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ ఉన్నాయి.
ఈ ప్రశ్నలు సినీ పరిశ్రమలోని స్నేహాలు, బాధ్యతలు, న్యాయపరమైన అంశాల మధ్య ఉన్న సన్నని గీతను ఆవిష్కరించేవే. ఈ క్రౌడ్ ఫండింగ్ ఇనిషియేషన్ వెనుక ఉన్న విభిన్న కోణాలను పరిశీలిస్తే.. క్రౌడ్ ఫండింగ్ చేయడం అంటే ఆ వ్యక్తి తప్పు చేయలేదని కాదు.. కేవలం ఆపదలో ఉన్న ఒక కళాకారుడికి ఆర్థికంగా ఆసరా అందించి చట్టపరమైన చిక్కుల నుండి బయటపడేయడం అని అర్థం. చెక్ బౌన్స్ కేసుల్లో బాకీ పడిన మొత్తాన్ని చెల్లిస్తే కోర్టు శిక్షను తగ్గించే లేదా రద్దు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కోర్టు తీర్పును అవమానించడం కాదు.. చట్టం ద్వారా లభించే ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవడం.
కేఆర్కే ఉద్దేశం ఏమిటి?
కేఆర్కే (KRK) సాధారణంగా వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుగాంచినా ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతిపాదన లో తప్పేమీ లేదు. రాజ్ పాల్ యాదవ్‌తో ఉన్న పాత పరిచయంతో నిజంగానే సహాయం చేయాలనుకోవడం నిజమైన స్నేహం అని చెప్పబోతున్నాడు. అదే సమయంలో ఇలాంటి సున్నితమైన అంశంపై స్పందించి సోషల్ మీడియాలో మైలేజ్ పొందాలనుకుంటున్నాడని అనుమానించవచ్చు. అయితే రూ.10 లక్షలు ఇస్తానని ప్రకటించడం ద్వారా తను ఇండస్ట్రీలో ఒక మంచి స్నేహితుడిని అని నిరూపించుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు.
ఇండస్ట్రీ స్నేహితులు ఎందుకు సహాయపడలేదు?
ఇండస్ట్రీలో స్నేహాలు చాలా వరకు వ్యాపారం, సక్సెస్ చుట్టూ తిరుగుతుంటాయి. కొందరు ఎందుకు సహాయం చేయలేదంటే.. కోర్టు కేసుల్లో ఉన్న వ్యక్తులకు సహాయం చేస్తే తమ పేరు కూడా వివాదాల్లోకి వస్తుందేమోనని భయపడతారు. ఇది వ్యాపార లావాదేవీలలో అప్పు వల్ల వచ్చిన సమస్య కాబట్టి, అది వారి వ్యక్తిగత విషయమని వదిలేస్తారు. బయట ప్రపంచానికి తెలియకుండా కొందరు సహాయం చేస్తారు కానీ రాజ్ పాల్ యాదవ్ కేసులో అది సరిపోలేదని అర్థమవుతోంది. సినిమా ఇండస్ట్రీలో అవసరం ఉన్నంత వరకే స్నేహం అనే విమర్శ మొదటి నుంచీ ఉంది. మాటలు చెప్పడం సులభం కానీ నిజంగా డబ్బు తీసి సహాయం చేసేవారు చాలా తక్కువ. ఒక సినీప్రముఖుడు అన్నట్లుగా.. ఇండస్ట్రీ అంతా ఏకమైతే అది ఒక గొప్ప మార్పు.
మొత్తానికి.. రాజ్ పాల్ యాదవ్ వంటి నటుడు జైల్లో ఉండటం బాధాకరం. ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆయన బయటకు వస్తే అది ఒక రకంగా ఆయనకు లభించిన పునర్జన్మ అని చెప్పవచ్చు.