ప్రొడ్యూస‌ర్‌గా స్టార్ డైరెక్ట‌ర్ వైఫ్

Update: 2021-12-25 03:30 GMT
టాలీవుడ్‌లో స్టార్ లు నిర్మాత‌లు అవుతున్నారు. సొంతంగా నిర్మాణ సంస్థ‌ల్ని ప్రారంభిస్తున్నారు. కొంత మంది ఇంకా ముందుకెళ్లి మ‌ల్టీప్లెక్స్ రంగంలోకి కూడా ప్ర‌వేశిస్తూ ప‌లువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇక ద‌ర్శ‌కులు కూడా మేమేమీ త‌క్కువ కాదంటూ ఓ ప‌క్క ద‌ర్శ‌కులుగా రాణిస్తూనే త‌మ సినిమాల నిర్మాణంలో భాగ‌స్వాములుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొంత మంద‌లైతే డైరెక్ట్ గా నిర్మాత‌లుగా రాణిస్తున్నారు కూడా. ఇప్ప‌టికే ఈ జాబితాలో ముందు వ‌రులో వున్నారు ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌.

ఆయ‌న త‌రువాత లైన్ లోకి వ‌చ్చిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. త‌న సినిమాల‌కు నిర్మాత‌గా త‌న పేరు వేయ‌క‌పోయినా లాభాల్లో వాటా దారుడిగా మాత్రం ముందు వ‌రుస‌లో నిలుస్తున్నారు. సినిమా ప్ర‌చారాన్ని సైతం తానే డిజైన్ చేస్తూ లాభాల్లో భాగాన్ని సొంతం చేసుకుంటున్నారు. సుకుమార్ కూడా ఈ మ‌ధ్య‌నే ఈ జాబితాలో చేరిన విష‌యం తెలిసిందే. `కుమారి 21` ఎఫ్ తో సుకుమార్ నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించారు. `ఉప్పెన‌`కు భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించి భారీ లాభాల్నే సొంతం చేసుకున్నారు.

తాజాగా ఈ జాబితాలోకి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ చేరారు. హారిక అండ్ హాసిని సంస్థ నిర్మించే చిత్రాల‌కు ఇండైరెక్ట్ గా భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించిన త్రివిక్ర‌మ్ తాజాగా త‌న భార్య సాయి సౌజ‌న్య‌ని నిర్మాత‌గా ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఓ ప్ర‌త్యేక నాట్య కార్య‌క్ర‌మం ద్వారా త‌న భార్య ప్ర‌తిభ‌ని ప్ర‌పంచానికి తెలియ‌జేసిన త్రివిక్ర‌మ్ ఇప్పుడు ఆమెని నిర్మాత‌గా నిల‌బెట్టాల‌ని ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.

ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పేరుతో నూత‌న నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించి ఈ సంస్థ‌లో `జాతిర‌త్నాలు` ఫేమ్ న‌వీన్ పొలిశెట్టి హీరోగా ఓ సినిమాని ప్ర‌క‌టించారు కూడా. `జాతిర‌త్నాలు` చిత్రానికి డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్ లో ప‌నిచేసిన క‌ల్యాణ్ శంక‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. ద‌ర్శ‌కుడిగా ఇదే అత‌ని తొలి చిత్రం. ఇక ఇదిలా వుంటే ధ‌నుష్ హీరోగా వెంకీ అట్లూరి రూపొందిస్తున్న `సార్‌` సినిమా ని గురువారం అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాని త్రివిక్ర‌మ్ వైఫ్ సాయి సౌజ‌న్య కూడా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మ‌రో నిర‌మాత‌గా సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్ అధినేత సూర్య దేవ‌ర నాగ‌వంశీ వ్య‌వ‌హరిస్తున్నారు. ఇది తెలుగులో పాటు త‌మిళంలోనూ ద్విభాషా చిత్రంగా రూపొంద‌నుంది. ఈ చిత్రాలే కాకుండా త్రివిక్ర‌మ్ నిర్మాణ సంస్థ లిస్ట్ లో అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, మ‌హేష్ ల చిత్రాలు కూడా వుండ‌బోతున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తు్నాయి. దీంతో త్రివిక్ర‌మ్ త‌న వైఫ్ ని పాన్ ఇండియా రేంజ్ నిర్మాత‌గా నిల‌బెట్టాల‌నే ఆలోచ‌న‌లో వున్నార‌ని చెప్పుకుంటున్నారు.



Tags:    

Similar News