సంక్రాంతి సందడిలో కనిపించని శ్రీను వైట్ల!

Update: 2021-01-17 02:30 GMT
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో శ్రీను వైట్ల ఒకరు. తను చెప్పదలచుకున్న కథను కామెడీ టచ్ తో రక్తి కట్టించడం ఆయన స్టైల్.కామెడీ ట్రాక్ ను సెపరేట్ గా పెట్టేసి అదో కథ అన్నట్టుగా ఆయన చూపించడు. కామెడీని కథలో భాగం చేసి .. అందులో హీరోనే ముందుగా నిలబెట్టేసి ఎంటర్టైన్ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఈ ఫార్ములాతోనే ఆయన అనేక హిట్లను తన ప్యాకెట్లో పెట్టేసుకున్నాడు. శ్రీను వైట్ల సినిమాలో కామెడీ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలుస్తాయి. ఆయన కామెడీ సీన్స్ ఎక్కడా కూడా లూజ్ గా కనిపించవు. ల్యాగ్ లేకుండా టైట్ కామెడీని పట్టుగా .. పెర్ఫెక్ట్ గా చూపడం ఆయన ప్రత్యేకత.

శ్రీను వైట్ల సినిమాల సక్సెస్ లో ఆయన కామెడీ ఎపిసోడ్స్ ప్రధానమైన పాత్రను పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ టీవీల్లో ఆయన సినిమాలకి మంచి రేటింగ్ రావడానికి కారణం ఆ కామెడీ ఎపిసోడ్స్ అనే చెప్పాలి. అలాంటి శ్రీను వైట్లకి ఆ కామెడీ కూడా కలిసిరాలేదు. ఏ కథను ఎంచుకున్నా .. ఎలాంటి కామెడీని ఎక్కుపెట్టినా అవి థియేటర్ నుంచి వెనక్కి వచ్చాయేగానీ, ప్రేక్షకుల మనసుల వరకు వెళ్లలేకపోయాయి .. గెలవలేకపోయాయి. ఓడినవారికి ఒంటరితనమే తోడు అన్నట్టుగా ఆయన మిగిలిపోయాడు.

ఈ నేపథ్యంలోనే శ్రీను వైట్లతో ఒక సినిమా చేస్తున్నట్టుగా మంచు విష్ణు ప్రకటించాడు. గతంలో తమ కాంబినేషన్లో హిట్ కొట్టిన 'ఢీ' సినిమాకి ఇది సీక్వెల్ అని చెప్పాడు. ఈ సినిమాకి 'డి అండ్ డి' అనే టైటిల్ ను సెట్ చేసి, తన పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ ను కూడా వదిలాడు. విష్ణు తన సొంత బ్యానర్లో నిర్మించనున్న ఈ సినిమాకి కథను గోపీమోహన్ అందించగా, మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఏమైనా వస్తుందేమోనని అభిమానులు ఎదురు చూశారు. కానీ ఎక్కడా ఆ సందడి కనిపించలేదు .. వినిపించలేదు.మరి వీళ్లిద్దరూ అన్నీ ఎప్పుడు సెట్ చేసుకుంటారో .. సెట్ వైపుకు ఎప్పుడు నడుస్తారో చూడాలి.
Tags:    

Similar News