‘కిసాన్’గా మారనున్న సోనూ సూద్..

Update: 2021-01-04 09:30 GMT
లాక్ డౌన్లో ఏ దిక్కూమొక్కూ లేక అవస్థలు పడుతున్న ఎంతో మంది కార్మికులను, అభాగ్యులను వారి సొంత ప్రాంతాలకు చేర్చి ఆపద్భాందవుడు అయ్యాడు బాలీవుడ్ నటుడు ‘సోనూ సూద్’. ఈ క్రమంలో తన ఇంటిని కూడా తాకట్టు పెట్టి అన్నార్తులకు సహాయం అందించి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పుడు.. సోనూ రీల్ లైఫ్ లోనూ విలన్ కాదు. ఆయన కోసం ప్రత్యేకంగా కథలు సిద్ధం చేస్తున్నారు దర్శకులు.

ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నెల రోజులపైబడి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎముకలు కొరికే చలిలోనూ నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ ప్రధాన పాత్రలో ‘కిసాన్’ పేరుతో ఓ చిత్రాన్ని సోమవారం ప్రకటించాడు దర్శకుడు ఇ.నివాస్. రచయిత-దర్శకుడు రాజ్ షాండిల్య సహకారం అందించనున్నారు. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా దృవీకరించారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలో వెల్లడవుతాయని ప్రకటించారు.

ఈ సందర్భంగా ‘కిసాన్’ టీంకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు బిగ్ బీ అమితాబ్. అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. అమితాబ్ ట్వీట్‌కు "ధన్యవాదాలు సార్" అంటూ స్పందించాడు సోనూ.

కాగా.. కొవిడ్ లాక్డౌన్ సమయంలో వలస కార్మికులకు సహాయం చేసిన తన అనుభవాన్ని వివరిస్తూ రూపొందిన ఒక పుస్తకాన్ని సోనూ ఇటీవల విడుదల చేశారు. "ఐ యామ్ నో మెస్సయ" పేరుతో ఈ బుక్ రిలీజైంది. బాధితులకు సహాయం అందించేటప్పుడు సోనూ ఎదుర్కొన్న మానసిక సవాళ్లను, అతని పరిస్థితిని చర్చిస్తుంది ఈ పుస్తకం.
Tags:    

Similar News