భార్యవల్లే ఎదిగానన్న సింగర్.. ఏడ్చేసిన సతీమణి!

Update: 2021-01-07 12:11 GMT
''నా భార్య వల్లే నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను.. ఆమె నా జీవితాన్ని రాసిందని గర్వంగా చెబుతా'' అని చుట్టూ జనం చూస్తుండగా ప్రకటించాడు భర్త. అతడి వర్ణనకు, ప్రేమకు అక్కడున్నవారితోపాటు పక్కనే ఉన్న భార్య కూడా ఆనంద భాష్పాలు రాల్చింది.

ప్రముఖ సింగర్లు నేహా కక్కర్‌- రోహన్‌ప్రీత్ ‌సింగ్ ఇటీవ‌ల పెళ్లి చేసుకున్నారు. ఈ కొత్త జంట ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12 షోకు గెస్ట్ గా వెళ్లింది. ఈ సంద‌ర్భంగా రోహ‌న్‌ప్రీత్‌సింగ్ మాట్లాడే క్రమంలో తన భార్య గురించి చెబుతూ.. ఎంతో భావోద్వేగానికి గుర‌య్యారు. త‌న ప్ర‌సంగంతో షోకు వ‌చ్చిన జ‌డ్జిల‌తో పాటు భార్య నేహా‌కు సైతం క‌న్నీళ్లు తెప్పించాడు.

రోహ‌న్ ప్రీత్‌సింగ్ ఏమన్నాడంటే.. ''ఒక రోజు నేను తలపాగా కట్టుకుంటున్న సమయంలో నేహా మేనేజ్‌మెంట్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. నేహా పాడబోతున్న తర్వాతి పాటలో మీరు నటిస్తారా అని అడిగారు. నేను అన్నాను.. అసలు దాని కోసం ప్రత్యేకంగా అడగాలా? అని''

''ఆ క్రమంలోనే.. నేను ఓ రోజు గదిలో అడుగు పెట్టగానే నేహా తల తిప్పి నావైపు చూసింది. ఆ క్షణం నా జీవితాన్నే మార్చేసింది. ఆమె 'నేహు కా వ్యాహ్'‌ అనే పాట రాసిందని మీరంటారు, కానీ నా తలరాతను కూడా ఆమె రాసిందని నేనంటాను.

నేను ఇప్పుడు ఇలా ఈ స్టేజీ మీద నిలబడటానికి కారణం నేహానే అని సగర్వంగా చెప్తాను" అని అన్నాడు రోహన్. దీంతో భర్త ప్రేమను చూసి నేహా కక్కర్‌ కంటతడి పెట్టుకున్నారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన నేహా.. "నన్ను ఏడిపించారు" అనే క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.


Tags:    

Similar News