ఆయ‌న ప‌రిచ‌యంతో శ్రుతికి రెక్క‌లొచ్చాయ‌ట‌!

Update: 2021-03-23 08:30 GMT
న‌టి.. గాయ‌ని.. మ్యూజిక్ డైరెక్టర్.. పాప్ స్టార్.. చిత్ర‌లేఖన క‌ళాకారిణి.. స్క్రిప్ట్ రైట‌ర్.. వ‌గైరా వ‌గైరా క‌ళ‌లు ఒకే వ్య‌క్తికి సాధ్య‌మైతే ఆల్ రౌండ‌ర్ అంటాం. ఈ క‌ళ‌ల‌న్నిటిలో శ్రుతిహాస‌న్ ఆరితేరిన ప్ర‌తిభావని. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ వార‌సురాలిగా తెరంగేట్రం చేసినా అన‌తికాలంలోనే త‌న‌లోని మ‌ల్టీట్యాలెంట్ తో తారాలోకంలో దూసుకెళ్లింది శ్రుతి.

త‌నో మంచి క‌వి.. క‌విత‌లు రాయ‌డ‌మే గాకుండా వాటిని పాడి వినిపిస్తుంటారు. ఇప్పుడు క‌థ‌లు రాసి మెగా ఫోన్ చేప‌ట్టేందుకు రెడీ అవుతోంది. నిజానికి శ్రుతి న‌టి కాక‌పోయి ఉంటే రైట‌ర్ అయ్యేదే. చిన్న‌ప్పుడు త‌న ర‌చ‌న‌లు చూసి పెద్ద ర‌చ‌యిత అయిపోతుంద‌ని క‌మ‌ల్ భావించేవార‌ట‌. సినీర‌చ‌యిత అవ్వాల‌ని కూడా అన్నార‌ట‌. అయితే తాను మాత్రం స్టార్ అయ్యింది. ఇప్పుడు చెన్నైకి సంబంధం లేని ఒక వ్యక్తి గురించి కథ రాస్తున్నానని శ్రుతి తెలిపారు. ఈ కొత్త అధ్యాయంపై ఎంతో ఎగ్జ‌యిట్ అవుతోంది.

ర‌చ‌యిత‌గానే కాకుండా దర్శ‌కురాలు అవుతుంద‌ని కూడా శ్రుతిపై చాలా కాలంగా క‌థ‌నాలొస్తున్నాయి. కానీ అది ఇప్పుడే కాద‌ని కూడా తెలిసింది. ఏదో ఒక‌రోజు పాపా క‌మ‌ల్ హాస‌న్ కి ధీటైన ఆల్ రౌండ‌ర్ అనిపించుకోవాల‌న్నదే త‌న క‌ల అని తెలుస్తోంది. కానీ దానికి చాలా స‌మ‌యం ప‌ట్టొచ్చ‌న్న‌ది ఓ అంచ‌నా.

శ్రుతి ఇటీవ‌ల హీరోయిన్ గా రీఎంట్రీ ఇచ్చాక‌ అద‌ర‌గొడుతోంది. క్రాక్ తో విజ‌యం అందుకుని త‌దుప‌రి వ‌కీల్ సాబ్ లో ప‌వ‌న్ ఫ్యాన్స్ కి ట్రీటిచ్చే స్పెష‌ల్ రోల్ లో క‌నిపించ‌బోతోంది. అటు సేతుప‌తి స‌హా ప‌లువురు టాప్ హీరోల సినిమాల‌తో శ్రుతి బిజీగా ఉంది. ఇటీవ‌ల డూడుల్ ఆర్టిస్ట్ శంత‌ను ప‌రిచ‌యంతో శ్రుతి ఆలోచ‌న‌లకు స‌రికొత్త రెక్కలొచ్చాయ‌‌ని తెలిసింది. మునుముందు ర‌చ‌యిత‌గా ద‌ర్శ‌కురాలిగా నిర్మాత‌గానూ స‌త్తా చాటే ప్లానింగ్ కూడా శ్రుతికి ఉందిట‌.
Tags:    

Similar News