సంచ‌ల‌నాల PK సీక్వెల్ .. ఈసారి హీరో ఎవ‌రో తెలుసా?

Update: 2021-02-21 17:30 GMT
మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన పీకే 2014లో రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దేవుళ్ల‌పై వివాదాస్ప‌ద అంశం కావ‌డంతో అప్ప‌ట్లో అది కూడా ప్ర‌చారానికి క‌లిసొచ్చి మ‌రింత పెద్ద హిట్ట‌య్యింది ఈ చిత్రం. సెటైరిక‌ల్ కామెడీగా ఈ మూవీని రాజ్‌కుమార్ హిరానీ తెర‌కెక్కించిన తీరుకు ప్ర‌శంస‌లు కురిసాయి. క్రిటిక్స్ తో పాటు ప్రేక్ష‌కులు అంతే గొప్ప‌గా ప్ర‌శంసించారు.

ప్ర‌ముఖ నిర్మాత‌ విదు వినోద్ చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఆ త‌ర్వాత పీకేకు సీక్వెల్ తెర‌కెక్క‌నుంద‌ని ప్ర‌చార‌మైనా ఇన్నాళ్లు కుద‌ర‌లేదు. సరైన సమయం కోసం వేచి చూసిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల బృందం ఇప్ప‌టికి సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళుతున్నార‌ని తెలుస్తోంది. పీకే ని ఎక్క‌డ ఎండ్ చేశారో అక్క‌డి నుంచి సీక్వెల్ క‌థ మొద‌ల‌వుతుంద‌ట‌. అందులో క్లైమాక్స్ సన్నివేశంలో రణబీర్ కపూర్  ప‌రిచ‌యంతో కథ ముగుస్తుంది. దీంతో సీక్వెల్లో ర‌ణ‌బీర్ న‌టిస్తాడ‌ని అప్పుడే ఊహించారు.

తాజాగా ఓ స‌మావేశంలో విధు వినోద్ మాట్లాడుతూ.. సీక్వెల్ చేస్తున్నాం. సినిమా చివరలో రణబీర్ ను చూపించాం. కాబట్టి చెప్పడానికి ఇంకా కథ ఉంది. కానీ అభిజీత్ (జోషి) ఇంకా సీక్వెల్ క‌థ‌ను రాయ‌లేదు. అతను ఆ క‌థ‌ను రాసిన రోజున మేం తెర‌కెక్కిస్తాం`` అని అన్నారు.

2014 లో విడుదలైన పీకే అప్ప‌టికి ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. సంజయ్ దత్- అనుష్క శర్మ- సుశాంత్ సింగ్ రాజ్ పుత్ త‌దిత‌రులు నటించిన ఈ చిత్రంలో అమీర్ అంత‌రిక్షం నుంచి భూమిపైకి దిగే విదేశీయుడిగా క‌నిపిస్తారు. అతని అంతరిక్ష నౌకతో కమ్యూనికేట్ చేయడానికి సహాయపడే పరికరం మిస్స‌వుతుంది. దానిని వెతుక్కుంటూ మాన‌వ లోక సంచారం చేసేవాడిగా అంత‌రిక్ష‌వాసి అమీర్ క‌నిపిస్తాడు.

ఈ చిత్రం స‌నాత‌న భార‌తీయ సమాజం .. మత విశ్వాసాల గురించి వ్యంగ్య దృక్పథంతో క‌నిపిస్తుంది. భోజ్ ‌పురి యాసలో అంత‌రిక్ష వాసి  సంఘంలో జ‌రిగే ప్ర‌తి వింత‌ను త‌న‌దైన తార్కిక‌త‌తో ప్ర‌శ్నిస్తుంటాడు. ఈ చిత్రం హిరానీ-చోప్రా నుంచి ట్రేడ్ మార్క్ మూవీ అని చెప్పాలి.  ఫన్నీగా ఉంటూనే ఎంతో ఆలోచింప‌జేస్తుంది.

మ‌రోవైపు హిరాణీ అభిమానులు `మున్నా భాయ్` ఫ్రాంచైజీలో మూడవ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత‌ విధువినోద్ శ‌క్తివంతమైన కథల్ని ఎంచుకోవ‌డం ద్వారా ఆర్థికంగా లాభాలు ఘ‌డించారు.

``మేము డబ్బు సంపాదించే వ్యాపారంలో లేము. సినిమా చేసే వ్యాపారంలో ఉన్నాము. డబ్బు సంపాదించడం మా లక్ష్యం అయితే ఇప్పటికి మేము ఆరు నుండి ఏడు వాయిదాలు (సీక్వెల్స్) చేసేశాం. మున్నా భాయ్- రెండు నుండి మూడు (ఎడిషన్లు).. పీకే తెర‌కెక్కించాం. సినిమాల‌తోనే కొన్ని కోట్ల ఆనందం. అనందంతో పాటు శాంతిని సినిమాల‌తోనే కోరుకుంటాం`` అని విధు అన్నారు.
Tags:    

Similar News