ట్రైలర్ టాక్: గ్రాఫిక్స్ హంగామా

Update: 2018-11-17 11:57 GMT
సినిమాకు గ్రాఫిక్స్ అదనపు ఆకర్షణ అవుతాయే తప్ప వాటి ఆధారంగా ఆడటం ఆడకపోవడం అనేది జరగదు. అమ్మోరుతో కనకవర్షం కురిపించుకున్న నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి అంజితో అంతకంతా పోగొట్టుకోవడం గ్రాఫిక్స్ వల్లే జరిగింది. సో ఇది రెండు వైపులా నాణెం లాగా రిస్క్ పొంచి ఉంటుంది. తాజాగా అశ్విన్ కుమార్ నిర్మాతగా ఆకాష్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న శరభ చిత్రం గ్రాఫిక్స్ నే ప్రమోషన్ కు వాడుకుంటూ హైప్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది. ట్రైలర్ కూడా విడుదల చేసారు.

లక్ష్మినరసింహ స్వామి నేపధ్యాన్ని తీసుకుని ఓ యువకుడికి అతని ఊళ్ళ ప్రవేశించిన దుష్ట శక్తులకు మధ్య జరిగే యుద్ధంగా దర్శకుడు నరసింహ రావు దీన్ని తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత జయప్రద తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తున్నారు. ఆవిడ భర్తగా నాగార్జున హలో బ్రదర్ లో పరిచయమై మనకు బాగా గుర్తుండిపోయిన నెపోలియన్ నటిస్తున్నారు. ఎల్బి శ్రీరామ్ తనికెళ్ళ భరణి లాంటి సీనియర్ ఆర్టిస్టులతో పాటు బుర్ర సాయి మాధవ్-కోటగిరి వెంకటేశ్వర్ రావు లాంటి టాప్ టెక్నీషియన్స్ దీనికి వర్క్ చేసారు.

శరభ ట్రైలర్ ని గమనిస్తే ఆద్యంతం గ్రాఫిక్స్ తో నింపేశారు. కొన్ని బాగానే అనిపిస్తుండగా మరికొన్ని మాత్రం ప్రొడక్షన్ లో పడిన రాజీని ఎత్తి చూపేలా ఉన్నాయి. హంగామా మాత్రం తెరనిండుగా ఉంది. ఆకాష్ మొదటి సినిమా కాబట్టి పెర్ఫార్మన్స్ పరంగా ఉన్న లోపాలను విజువల్ ఎఫెక్ట్స్ తో కవర్ చేసే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది. హీరోయిన్ గా మిస్త్రీ చక్రవర్తి నటిస్తోంది. చిన్నదానా నీ కోసంలో నితిన్ తో ఆడిపాడింది ఈ బ్యూటీనే. సీనియర్ సంగీత దర్శకులు కోటి దీనికి వర్క్ చేయడం మరో విశేషం. డిసెంబర్ 22న విడుదల కాబోతున్న శరభ వర్మ భైరవ గీతతో పాటు హవా-24 కిస్సెస్ తో పోటీ పడనుంది. గ్రాఫిక్స్ ని నమ్ముకుని కొత్త హీరోతో ఇంత సాహసం చేయటం ఎంత వరకు ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News