నేనా.. మగధీర రీమేకా?

Update: 2016-04-30 09:44 GMT
మగధీర.. తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిన సినిమా. ‘బాహుబలి’ లాంటి మెగా మూవీకి జక్కన్న శ్రీకారం చుట్టడానికి స్ఫూర్తినిచ్చింది ఈ సినిమానే. తెలుగు సినిమా సత్తా ఏంటో ముందు మిగతా ఇండస్ట్రీలకు తెలిసింది ‘మగధీర’తోనే. ఈ విజువల్ వండర్ ను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హృతిక్ హీరోగా నటిస్తాడని.. కాదు కాదు సల్మాన్ అని.. రకరకాల ప్రచారాలు జరిగాయి.

ఓ దశలో సాజిద్ నడియాడ్ వాలా సాహిద్ కపూర్ హీరోగా ‘మగధీర’ను రీమేక్ చేస్తానని కూడా ప్రకటించాడు. కానీ ఆ తర్వాత ఆ ఆలోచనను పక్కనబెట్టేశాడు. ఐతే తాజాగా గ్రేట్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ ‘మగధీర’ రీమేక్ కు సన్నాహాలు చేస్తున్నట్లుగా ముంబయి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఈ సినిమాను బన్సాలీనే స్వయంగా డైరెక్ట్ చేస్తాడని కూడా ప్రచారం జరిగింది.

ఐతే బన్సాలీ ఆ వార్తల్ని ఖండించాడు. తనకు మగధీర సినిమాను రీమేక్ చేసే ఆలోచనలేమీ లేవని స్పష్టం చేశాడు. ‘‘అలాంటి సినిమా ఏదీ బన్సాలీ చేయట్లేదు. ఈ వార్తలు పూర్తి అబద్ధం. మగధీర అనే కాదు.. అసలు ఏ సినిమానూ రీమేక్ చేసే ఆలోచన బన్సాలీకి లేదు. ఆయన తన సొంత కథతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు’’ అని బన్సాలీ ప్రతినిధి ప్రకటించారు. గత ఏడాది ‘బాజీరావ్ మస్తానీ’ లాంటి అద్భుతమైన సినిమాను అందించిన బన్సాలీ.. ఇదే తరహాలో మరో చారిత్రక సినిమా చేయాలని భావిస్తున్నాడు. దానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడించబోతున్నాడు.
Tags:    

Similar News