పెద్ద మనసు చాటుకున్న సంపూ, సందీప్

Update: 2015-10-05 13:30 GMT
సినిమావాళ్లకేంటండీ.. లక్షలు - కోట్లు సంపాదిస్తారని అనుకుంటాం కానీ.. అన్ని రోజులూ ఒకలా ఉండవు. అవకాశాలు ఉన్నన్ని రోజులు దర్జాగా బతుకుతారు. ఐతే కెరీర్ మసకబారాక పరిస్థితులు తల్లకిందులవుతాయి. అప్పటిదాకా విలాసవంతంగా సాగిన జీవితాలు దుర్భర స్థితికి చేరుకుంటాయి. ఇలా దయనీయ పరిస్థితుల్లో గడుపుతున్న కళాకారులు చాలామందే ఉన్నారు. ఐరెన్ లెగ్ శాస్త్రి కుటుంబం కూడా ఇలాంటి స్థితికే చేరింది. 90ల్లో క్రేజీ కమెడియన్ గా లక్షలు లక్షలు సంపాదించేవాడు ఐరెన్ లెగ్ శాస్త్రి. ఐతే ఉన్నట్లుండి అతడికి అవకాశాలు తగ్గిపోయాయి.

ఐరెన్ లెగ్ శాస్త్రి తాగుడుకు బానిసైపోయి దారుణమైన స్థితికి చేరాడన్న సంగతి తెలిసినా అప్పట్లో ఎవ్వరూ పట్టించుకోలేదు ఆయన కన్నుమూసినపుడు తెలిసింది తన కుటుంబ దుర్భర పరిస్థితి గురించి. అప్పుడు కూడా సినీ జనాల మనసు కరగలేదు. ఐతే శాస్త్రి భార్య, ఇద్దరు పిల్లలు ప్రస్తుతం తిండికి కూడా కష్టపడుతున్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఈ సంగతి తెలిసి మన బర్నింగ్ స్టార్ రూ.25 వేల సాయం ప్రకటించాడు. అతను చేసింది చిన్న సాయమే కావచ్చు. కానీ ఈ వార్త తెలిసి మిగతా వాళ్లు కూడా స్పందిస్తే సంపూ చాలా పెద్ద సాయమే చేసినట్లు లెక్క. ఆల్రెడీ హీరో సందీప్ కిషన్ కూడా తన వంతుగా శాస్త్రి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చాడు. ఇలాగే మరిందరు సెలబ్రెటీలు ముందుకొస్తే శాస్త్రి కుటుంబం నిలబడుతుంది.
Tags:    

Similar News