పుష్ప‌-ది రైజ్ లో స‌మంత స్పెష‌ల్ సాంగ్ !

Update: 2021-11-14 07:30 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్ లో పాన్ ఇండియా చిత్రం `పుష్ప` శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. మొద‌టి భాగం `పుష్ప ది రైజింగ్` టైటిల్ తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇప్ప‌టికే తొలి భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. డిసెంబ‌ర్ లో మొద‌టి భాగాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే బాగా ఆల‌స్య‌మైన నేప‌థ్యంలో ఎట్టి ప‌రిస్థితుల్లో  ఈ ఏడాది లోనే రిలీజ్ చేయాల‌ని యూనిట్ శ్ర‌మిస్తోంది. ఓ వైపు దానికి సంబంధించిన ప్ర‌చారం ప‌నుల‌ను ముమ్మ‌రం చేసింది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌కు..లిరిక‌ల్ సాంగ్స్ కి మంచి ఆద‌ర‌ణ‌ ద‌క్కింది.

దీంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి.  రెండ‌వ భాగం చిత్రీక‌ర‌ణ కూడా సైలెంటు గా సాగుతోంది. సైమ‌ల్టేనియ‌స్ గా పార్ట్ 1కి సంబంధించిన ప్ర‌చారంలోనూ సుకుమార్ టీమ్ వేగం పెంచ‌నుంది.  న‌వంబ‌ర్ 19న ఈ సినిమా నుంచి మ‌రో లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల కానుంది. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా! అంటూ సాగే మాస్ బీట్ తో అభిమానుల ముందుకు వ‌స్తున్నారు. ఈ పాట‌లో బ‌న్నీ మాస్ అవ‌తార్ చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ చెబుతోంది.

ప్లెయిన్ ఫ్యాంటు.. కాలికి బూటు.. పులి ఛ‌ర్మం డిజైన‌ర్ చొక్కాతో స్పెష‌ల్ గా క‌నిపిస్తున్నాడు బ‌న్ని. ఇక పుష్ప‌రాజ్ ఒళ్లంతా బంగార‌మే. చేతికి చెయిన్ లు మెడ‌లో ట‌న్నుల కొద్దీ బ‌రువైన బంగారు గొలుసులు క‌నిపిస్తున్నాయి. ఆ వేళ్ల‌కు ఉన్న ఉంగ‌రాలు అమ్మితే చాలు క్రిప్టో క‌రెన్సీ లో పెట్టుబడి పెట్ట‌గ‌లం! మొత్తానికి మ‌రో మాస్ సాంగ్ తో మ్యాసివ్ గా ప్ర‌మోష‌న్ ని కొట్టేయాల‌న్న‌ది బ‌న్నీ ప్లాన్. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ లో ఈ సినిమాని విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 17 తేదీని లాక్ చేసింది చిత్ర‌బృందం.

స్పెష‌ల్ నంబ‌ర్ వెరీ స్పెష‌ల్ గా..

పుష్ప కాస్టింగ్ విష‌యంలో తొలి నుంచి సుకుమార్ ఎంతో సెల‌క్టివ్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో పుష్ప‌రాజ్ తో డీకొట్టే వాడిగా జాతీయ అవార్డ్ గ్ర‌హీత.. మ‌ల‌యాళ హీరో ఫ‌హ‌ద్ ఫాజిల్ ని ఎంపిక చేసుకోవ‌డం వెన‌క పెద్ద లాజిక్ ఉంది. అలాగే లేడీ విల‌న్ గా రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌ను తీర్చిదిద్దిన వైనంపైనా డిబేడ్ న‌డుస్తోంది. ఇంత‌లోనే ఈ చిత్రంలో స‌మంత ఐట‌మ్ (స్పెష‌ల్) నంబ‌ర్ చేస్తుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే సుకుమార్ టీమ్ సామ్ ని ఒప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. దాదాపు ఖ‌రారైన‌ట్టేన‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఒక వేళ ఇదే నిజ‌మైతే రంగ‌స్థ‌లం స్టార్ల‌ను సుక్కూ పుష్ప కోసం రిపీట్ చేస్తున్న‌ట్టే. అన‌సూయ‌తో పాటు ఇప్పుడు స‌మంత కూడా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టే అవుతుంది. రంగ‌స్థ‌లంలో స‌మంత రామ‌ల‌క్ష్మి అనే ప‌ల్లెటూరి యువ‌తిగా అద‌ర‌గొట్టిన సంగ‌తి తెలిసిందే. సిట్టిబాబు ప్రేమికురాలు రామ‌ల‌క్ష్మి గా స‌మంత ఆ సినిమాకి పెద్ద అస్సెట్ గా నిలిచింది. ఇక రంగ‌స్థ‌లంలో పూజా హెగ్డే ఐటమ్ నంబ‌ర్ లో న‌ర్తించ‌గా ఇప్పుడు సామ్ తో స్పెష‌ల్ నంబ‌ర్ కి ప్లాన్ చేశాడు సుక్కూ. వ‌చ్చే వారం నుంచి షూటింగు ఉంటుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

మార్చి లోపు పార్ట్ 2 అవుతుందా?

పుష్ప‌-పార్ట్ 1తో పాటు పార్ట్ 2 చిత్రీక‌ర‌ణ కూడా కొంత భాగం పూర్త‌యింద‌నేది ఓ గుస‌గుస‌. ఎట్టి ప‌రిస్థితుల్లో మార్చిలోపు పుష్ప పార్ట్ 2 షూటింగ్ స‌హా డ‌బ్బింగ్ పూర్తిచేసి పూర్తిగా బ‌య‌ట‌కు వ‌చ్చేయాల‌ని బ‌న్ని భావిస్తున్న‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. అనంత‌రం మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాని లాంచ్ చేసి రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్లిపోవాల‌న్న‌ది బ‌న్నీ ప్లాన్ గా క‌నిపిస్తోంది.

హిందీ రైట్స్ గొడ‌వ తేలిన‌ట్టేనా?

పుష్ప హిందీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌ల‌కు-డిస్ట్రిబ్యూట‌ర్ కి మ‌ధ్య స‌మ‌స్య త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే. హిందీ డ‌బ్బింగ్ రైట్స్ ఓ ప్ర‌ముఖ యూ ట్యూబ్ ఛాన‌ల్ కు విక్ర‌యించారని స‌మాచారం. సౌత్ లో మాత్ర‌మే థియేట్రిక‌ల్ రిలీజ్ చేస్తున్న‌ట్లు.. హిందీలో మాత్రం థియేట‌ర్ రిలీజ్ కాకుండా అనువాద హ‌క్కులు ఇత‌రుల‌కు క‌ట్ట‌బెట్టారు. ఆ త‌ర్వాత స‌న్నివేశం మారిపోయింది. పాన్ ఇండియా రిలీజ్ నేప‌థ్యంలో హిందీలోనూ థియేట‌ర్లో రిలీజ్ చేయాల‌ని టీమ్ భావించింద‌ట‌. ఈ నేప‌థ్యంలో స‌ద‌రు యూట్యూబ్ ఛాన‌ల్ అధినేత‌లు థియేట‌ర్ రిలీజ్ కి ఎలా వెళ్తారంటూ చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటానంటూ హెచ్చ‌రించార‌ని క‌థ‌నాలొచ్చాయి. దీంతో `పుష్ప` హిందీ రిలీజ్ వ్య‌వ‌హారం కూడా ఇప్ప‌ట్లో తేలేదిగా క‌నిపించ‌డం లేదని గుస‌గుస‌లు వినిపించాయి. దానికి తోడు  సినిమాకి అనుకున్న బ‌డ్జెట్ క‌న్నా అద‌నంగా భారీగానే ఖ‌ర్చు అయింద‌ని స‌మాచారం. ఇంకా పార్ట్ -2 స‌న్నివేశాలు  బ్యాలెన్స్ ఉన్నాయి. ఇలా పుష్ప విష‌యంలో కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితులు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో బ‌న్నీ సైతం వీలైనంత త్వ‌ర‌గా ప్రాజెక్ట్ ని పూర్తిచేయాల‌ని చూస్తున్న‌ట్లు  తెలుస్తోంది. ఇక బ‌న్ని ఆదిత్య శ్రీ‌రామ్ తో ఐకాన్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లాల్సి ఉండ‌గా స‌డెన్ గా బోయ‌పాటి తెర‌పైకి రావ‌డం ఆస‌క్తిక‌రం. మ‌రి ఆ ఇద్ద‌రిలో ఎవ‌రితో ముందు మొద‌లు పెడతారు? అన్న‌దానిపైనా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంటుంది.
Tags:    

Similar News