సల్మాన్ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి: కోర్టు

Update: 2021-01-17 13:43 GMT
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ విచారణకు హాజరు కావాలని జోధ్‌పూర్ హైకోర్టు ఆదేశించింది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ అభియోగం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రెండు దశాబ్దాలకుపైగా కొనసాగుతున్న ఈ కేసు శనివారం మరోసారి కోర్టు ముందుకు వచ్చింది.

ఈ విచారణకు సల్మాన్ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరాడు. దీనికి సమ్మతించిన న్యాయస్థానం.. ఫిబ్రవరి 6 న తదుపరి విచారణకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది.

1998 అక్టోబర్ లో జోధ్‌పూర్‌లో జింకలను వేటాడినందుకు ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్‌కు 2018 మార్చిలో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో మిగిలిన నిందితులుగా ఉన్న సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, నీలం, టబు, దుష్యంత్ సింగ్‌ను నిర్దోషులుగా ప్రకటించింది న్యాయస్థానం.

ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సల్మాన్ సవాలు చేశారు. విచారించిన చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కూడా ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. వన్యప్రాణుల రక్షణ చట్టం కింద దోషిగా తేలినప్పుడు సీజేఎం కోర్టు సల్మాన్ కు రూ.10,000 జరిమానా విధించింది. ఆ తర్వాత జోధ్‌పూర్ లోని జిల్లా సెషన్స్ కోర్టుకు కేసు వెళ్లగా.. స్టే విధించిన న్యాయస్థానం 2018లో సల్మాన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Tags:    

Similar News