‘రాధే’ థియేటర్లకే రావాలి.. ప్లీజ్ భాయ్.. సల్మాన్ కు లేఖ!

Update: 2021-01-04 09:30 GMT
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘రాధే’. సల్లూభాయ్ ని సూపర్‌ పోలీస్‌గా చూపిస్తూ ప్రభుదేవా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ స్టయిలిష్‌ ఎంటర్‌టైనర్‌లో దిశా పటానీ హీరోయిన్ గా నటించగా.. జాకీ ష్రాఫ్, రణ్‌దీప్‌ హుడ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.

అయితే.. ఇటీవలే షూట్ పూర్తయిన ఈ సినిమాను.. త్వరలో ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ మూవీ బిజినెస్ కూడా అయిపోయిందని, రూ.230 కోట్లు పెట్టి జీస్టూడియోస్ ఈ సినిమాను కొనేసిందని కూడా ప్రచారం సాగింది.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ సల్మాన్‌ ఖాన్ కు ఓ లేఖ రాసింది. తమ కష్టాలను ఏకరువు పెడుతూ వినతిపత్రం రాశాారు ఎగ్జిబిటర్లు. ‘రాధే’ను ఓటీటీలో రిలీజ్ చేయొద్దని, థియేటర్లలోనే విడుదల చేయాలని ఆ లేఖలో కోరారు. కరోనాతో చిత్ర పరిశ్రమ ఎంతో ఇబ్బందుల్లో ఉందని, తాము కూడా చాలా నష్టపోయామని, ఇలాంటి కష్టసమయంలో థియేటర్ల‌ బిజినెస్‌కు సహాయంగా నిలబడాలని సల్మాన్ ను కోరారు.

సల్మాన్‌ చిత్రం అంటే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఉంటాయని, ప్రేక్షకులను మళ్లీ థియేటర్స్‌కి తీసుకొచ్చే స్టామినా ఉన్న స్టార్‌ సల్మాన్‌ అని అసోసియేషన్ తెలిపింది. అలాంటి బిగ్ స్టార్ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తే థియేటర్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని, అందువల్ల ‘రాధే’ను టాకీసులకే రానివ్వాలని కోరింది.

కాగా.. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఇప్పటికే థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపిస్తున్నారు. కానీ.. హిందీ ఇండస్ట్రీకి సంబంధించి ఇంతవరకు థియేటర్ల విషయంలో ఎటువంటి స్పష్టతా రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమా వస్తే ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారని ఎగ్జిబిటర్స్ భావిస్తున్నారు. మరి, ఏం జరుగుతుంది? అసోసియేషన్ లేఖపై సల్లూభాయ్ ఎలా స్పందిస్తారు? ‘రాధే’ సినిమా థియేటర్లలోకి వస్తుందా..? లేక ఓటీటీ వేదికగానే రిలీజ్ అవుతుందా? అన్నది చూడాలి.
Tags:    

Similar News