క‌రోనా సాయం.. స‌ల్మాన్ ఏం చేయ‌బోతున్నాడంటే?

Update: 2020-03-30 03:45 GMT
కరోనాపై పోరాటంలో భాగంగా ఇప్పటి వరకు తెలుగు హీరోలు, ఇత‌ర సినీ ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోలు కూడా ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే అక్కడ అక్షయ్ కుమార్ ఏకంగా 25 కోట్లు విరాళం ఇచ్చి సంచలనం సృష్టించాడు. తాజాగా సల్మాన్ ఖాన్ కూడా తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చాడు. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేప‌థ్యంలో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేసే క‌ళాకారుల ప‌రిస్థితి కూడా ద‌య‌నీయంగా మారింది. అలాంటి వారికి స‌హాయం అందించేందుకు సినీ ప్ర‌ముఖులు ముందుకు రావాల‌ని ఈ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (ఎఫ్‌డ‌బ్ల్యూఐసి) అధికార ప్ర‌తినిధి బీఎన్ తివారీ కోరాడు.

ఈ అప్పీల్‌కు స‌ల్మాన్ వెంట‌నే స్పందించాడు. అత‌ను గొప్ప సాయ‌మే చేయ‌బోతున్నాడు. త‌న బీయింగ్ హ్యూమన్‌ ఫౌండేషన్ ద్వారా సల్మాన్ హిందీ సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌ని చేసే డైలీ వ‌ర్క‌ర్లంద‌రికీ ఆర్థిక సహాయం అందించ‌బోతున్నాడు. 25 వేల మంది క‌ళాకారుల‌కు స‌ల్మాన్ నేరుగా అకౌంట్లలో డ‌బ్బులు వేయ‌నున్నాడు. ఈ మేర‌కు వారి అకౌంట్ల వివ‌రాల లిస్టును స‌ల్మాన్‌కు పంపేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. లాక్ డౌన్ ఉన్నంత కాలం సినీ కార్మికులెవ్వ‌రూ తిండికి, ఇత‌ర అవ‌స‌రాల‌కు బాధ ప‌డాల్సిన ప‌ని లేద‌ని.. వారిని తాను ఆదుకుంటాన‌ని స‌ల్మాన్ ప్ర‌క‌టించాడు. తాప్సీ ప‌న్ను, క‌ర‌ణ్ జోహార్ వంటి ప్ర‌ముఖులు సైతం సినీ కార్మ‌కుల‌కు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. 25 వేల మందికి ఆర్థిక సాయం అంటే స‌ల్మాన్ విత‌ర‌ణ కోట్ల‌ల్లోనే ఉండ‌బోతోంది. అక్ష‌య్, స‌ల్మాన్‌ల‌ను చూసి మ‌రింత‌మంది బాలీవుడ్ తార‌లు స్పందించే అవ‌కాశ‌ముంది.
Tags:    

Similar News