ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టాలీవుడ్ నిర్మాణం.. అయ్యే ప‌నేనా?

టాలీవుడ్ తన షూటింగ్‌లలో కనీసం 25 శాతమైనా ఆంధ్రప్రదేశ్‌లో జరుపుకుంటే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.;

Update: 2026-04-08 04:30 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సినిమా నిర్మాణం .. స్టూడియోల ఏర్పాటు అంశం దశాబ్దాలుగా చర్చల్లోనే ఉంది. టాలీవుడ్ సంపాదించే ఆదాయంలో దాదాపు 65 శాతం వాటా ఒక్క ఏపీ నుంచే లభిస్తున్నా.. షూటింగ్‌లు, నిర్మాణానంతర పనులు మాత్రం హైదరాబాద్‌కే పరిమితం కావడం గమనార్హం. దీనివల్ల యేటేటా సుమారు రూ.3000 నుండి రూ.6000 కోట్ల రూపాయల వరకు పన్ను(వినోద‌పు ప‌న్ను) ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ నష్టపోతోందని పలువురు ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమను ఏపీకి తరలించడం లేదా అక్కడ కనీస వసతులు కల్పించడం అనేది ఇప్పుడు సినీ రాజకీయ వ‌ర్గాల్లో చర్చగా మారింది.

ఇటీవల రాజకీయ నాయకుడు కేశినేని చిన్ని చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరింత వేడెక్కించాయి. టాలీవుడ్ తన షూటింగ్‌లలో కనీసం 25 శాతమైనా ఆంధ్రప్రదేశ్‌లో జరుపుకుంటే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల వసతులు, అనుమతులు.. ఇత‌ర‌ ప్రోత్సాహకాలను అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. అయితే గతంలో ప్రభుత్వాల నుంచి రాయితీలు కోరిన సినీ పెద్దలు.. ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న ఈ సానుకూల సంకేతాలకు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేవలం హామీలతో సరిపెట్టకుండా స్టూడియోల నిర్మాణానికి ప్రభుత్వం ఎప్పుడు భూములు కేటాయిస్తుంది.. అవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే స్పష్టత రావాల్సి ఉంది.

హైదరాబాద్‌ను విడిచి చిత్ర పరిశ్రమ రాకపోవడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలు.... వేల సంఖ్యలో ఉన్న సినీ కార్మికులు.. అత్యాధునిక స్టూడియోలు.. ల్యాబ్‌లు ఏపీలో ఇంకా అందుబాటులోకి రాలేదు. పైగా తెలంగాణ ప్ర‌భుత్వం టాలీవుడ్ ని ఎటూ పారిపోకుండా ప‌ట్టుకుని ఉంది. అలాగే విశాఖపట్నం వంటి నగరాల్లో స్టూడియోల నిర్మాణానికి గతంలో ప్రయత్నాలు జరిగినా.. అవి పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వం రాయితీలతో భూములిచ్చి.. సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేస్తే తప్ప.. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు ఏపీ వైపు అడుగులు వేయడం కష్టమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం షూటింగ్‌లు జరుపుకోవడం వేరు.. శాశ్వత ప్రాతిపదికన మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయడం వేరు అనే వాదన వినిపిస్తోంది.

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను పునరుద్ధరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం పరిశ్రమకు ఒక సానుకూల పరిణామం. మెగాస్టార్ చిరంజీవి, ఆర్.నారాయణమూర్తి వంటి ప్రముఖులు చేసిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థం చేసుకోవాలి. అయితే అవార్డుల ప్రకటన వచ్చినప్పటికీ ఇండస్ట్రీ ప్రస్తుతానికి కొంత స్థబ్ధుగా ఉండటం గమనార్హం. కేవలం అవార్డులు మాత్రమే కాకుండా.. చిత్ర నిర్మాణానికి అవసరమైన ప్రోత్సాహకాలు కూడా లభిస్తేనే సినీ పెద్దల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన వచ్చే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి స‌హా ఇతర అగ్ర నిర్మాతలు ఈ విషయంలో ఎలా ముందుకు వస్తారో వేచి చూడాలి.

ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం- టాలీవుడ్ మధ్య ఒక బలమైన సమన్వయం అవసరం. రాజమండ్రి, వైజాగ్ వంటి ప్రాంతాల్లో షూటింగ్‌లకు అనువైన లొకేషన్లు ఉన్నా..అక్కడ సినిమా ఇన్ ఫ్రాస్ట‌క్చ‌ర్ ప‌రంగా వసతుల లేమి ప్రధాన అడ్డంకిగా ఉంది. కేవలం పన్నుల రూపంలోనే కాకుండా.. స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో కూడా సినిమా రంగం కీలక పాత్ర పోషించగలదు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు.. స్టూడియోల నిర్మాణానికి చేసే సహకారంపైనే టాలీవుడ్ భవిష్యత్తు అడుగులు ఏపీలో పడతాయా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఈ దిశగా సినీ పెద్దల మనోగతం ఎలా ఉందో త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంతో సినీపెద్ద‌లు మ‌రోసారి సానుకూలంగా చ‌ర్చ‌లు సాగించాల్సి ఉంది. కానీ ఆ అడుగు ప‌డేది ఎప్ప‌టికి? అనేదే సందిగ్ధంగా మారింది.

Tags:    

Similar News