వైసీపీ ఆందోళనలపై పూనమ్ ట్వీట్లు వైరల్.. నెటిజన్లు ఫుల్ ఫైర్!

గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ చర్చకు వస్తున్న ఆమె.. ఈసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుచరులకు మద్దతుగా చేసిన ట్వీట్లు వైరల్‌ గా మారాయి.;

Update: 2026-04-08 07:17 GMT

నటి పూనమ్ కౌర్ మరోసారి తన సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ చర్చకు వస్తున్న ఆమె.. ఈసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుచరులకు మద్దతుగా చేసిన ట్వీట్లు వైరల్‌ గా మారాయి. ముఖ్యంగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక న్యూస్ ఛానల్‌ పై తీవ్రంగా స్పందిస్తూ పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.



 


ఇటీవల ఒక ప్రముఖ న్యూస్ ఛానల్‌ లో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించే క్రమంలో మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు వైసీపీ నాయకుల భార్యలను అవమానించే విధంగా ఉన్నాయని పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌ లోని ఆ ఛానల్ కార్యాలయం వద్ద కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి.

ఈ పరిణామాలపై స్పందించిన పూనమ్ కౌర్, మహిళలను కించపరుస్తూ మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 'మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా, వారి బంధాలు అవమానించేలా మాట్లాడే వారికి గుణపాఠం చెప్పడం తప్పనిసరి' అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత కాలంలో కొన్ని న్యూస్ ఛానల్స్ బ్లాక్‌ మెయిలింగ్ బాక్సుల్లా మారిపోయాయని విమర్శించారు.

ఇదే సందర్భంలో మరో ట్వీట్ చేసిన పూనమ్.. గతంలో తనపై జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. 'నాపై కూడా ఇలాంటి దాడులు జరిగినప్పుడు నా జీవితం పూర్తిగా తలకిందులైంది. నేను నిశ్శబ్దంగా నా విధంగా పోరాడినా ఎవరూ క్షమాపణ చెప్పలేదు, పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు' అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత బాధను ప్రతిబింబించాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అయితే, పూనమ్ కౌర్ ట్వీట్లపై కొందరు నెటిజన్లు విమర్శలు కూడా గుప్పించారు. ఒక నెటిజన్ స్పందిస్తూ.. 'ఇంకెంతకాలం ఇదే విషయాన్ని కొనసాగిస్తారు? సింపతీ కోసం కొత్త మార్గాలు ప్రయత్నించండి' అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో పూనమ్ కౌర్ తీవ్రంగా స్పందించారు. ఆ నెటిజన్‌ కు సమాధానంగా ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి.

'మీ కుటుంబంలోని మహిళలు సురక్షితంగా, గౌరవంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. రాజకీయాల వల్ల నష్టపోయిన నా పరిస్థితి వారికి ఎప్పటికీ రాకూడదు. కానీ మీరు ఇలాగే నాపై దాడులు కొనసాగిస్తే, మీరు మద్దతు ఇస్తున్న వారే ఒకరోజు పశ్చాత్తాప పడే పరిస్థితి వస్తుంది' అని ఘాటుగా హెచ్చరించారు. ప్రస్తుతం పూనమ్ కౌర్ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు ఆమెకు మద్దతు లభిస్తుండగా, మరోవైపు విమర్శలు కూడా వస్తున్నాయి. మహిళల గౌరవం, మీడియా పాత్ర, రాజకీయాల ప్రభావం వంటి అంశాలపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.

Tags:    

Similar News