అడివి శేష్ తో లిటిల్ హార్ట్స్ డైరెక్టర్.. ఏంటీ కాంబో?
కేవలం రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన లిటిల్ హార్ట్స్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు 30 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఘన విజయాన్ని అందుకుంది.;
టాలీవుడ్ లో తక్కువ బడ్జెట్ తో పెద్ద విజయాన్ని అందుకోవచ్చని నిరూపించిన దర్శకుడు సాయి మార్తాండ్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో వార్తల్లో నిలిచారు. లిటిల్ హార్ట్స్ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఆయన, తన తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటించారు. టాలెంటెడ్ హీరో అడివి శేష్ తో వర్క్ చేయనున్నట్లు రివీల్ చేశారు.
కేవలం రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన లిటిల్ హార్ట్స్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు 30 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో సాయి మార్తాండ్ పేరు టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. అప్పటి నుంచి పలువురు హీరోలతో ఆయన సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి మార్తాండ్ కీలక ప్రకటన చేశారు.
తన తదుపరి చిత్రం హీరో అడివి శేష్ తోనే ఉండబోతుందని వెల్లడించారు. ప్రస్తుతం శేష్ చేస్తున్న గూఢచారి 2 పూర్తయ్యాక ఆ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా సాయి మార్తాండ్ తన అభిమానం, ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల క్రితం తాను ఇంటర్ చదువుతున్నప్పుడు క్షణం సినిమా చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు.
"తక్కువ బడ్జెట్ తో కూడా ఇంత క్వాలిటీతో థ్రిల్లర్ ఎలా తీస్తారో అనిపించింది. అప్పటినుంచే శేష్ అన్న నాకు ఇన్స్పిరేషన్" అని తెలిపారు. తాను కూడా అదే మార్గంలో లిటిల్ హార్ట్స్ చిత్రాన్ని రూపొందించానని చెప్పారు. అంతేకాకుండా, తన సినిమా సక్సెస్ ఈవెంట్ కు అడివి శేష్ గెస్ట్ గా రావడం, తనతో కలిసి డ్యాన్స్ చేయడం, పాట పాడడం వంటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
"మన జీవితం ఒక చక్రం లాంటిది. నేను అభిమానిగా చూసిన వ్యక్తి, ఇప్పుడు నా సినిమా వేడుకకు వచ్చి నాతో కలిసి ఎంజాయ్ చేయడం ఎంతో ఆనందంగా అనిపించింది" అని అన్నారు. ఇంకా, ఆ కొత్త ప్రాజెక్ట్ ఒక లవ్ స్టోరీగా ఉండబోతుందని సాయి మార్తాండ్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు థ్రిల్లర్, సస్పెన్స్ కథలతో గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ లవ్ స్టోరీకి ఓకే చెప్పడం ఇండస్ట్రీలో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఆ కాంబినేషన్ కొత్తగా ఉండటంతో ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి నెలకొంది. ఆ చిత్రానికి నిర్మాతలుగా జగపతి బాబు, సునీల్ నారంగ్ వ్యవహరించనున్నారు. వీరిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ ను నిర్మించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ముఖ్యంగా జగపతి బాబు గతంలోనే సాయి మార్తాండ్ తో సినిమా చేయాలని చెప్పి మాట ఇచ్చినట్లు దర్శకుడు గుర్తుచేశారు. మొత్తానికి.. సాయి మార్తాండ్- అడివి శేష్ కాంబినేషన్ లో రాబోయే లవ్ స్టోరీ చిత్రం టాలీవుడ్ లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. తక్కువ బడ్జెట్ తో క్వాలిటీ కంటెంట్ అందించే దర్శకుడు, ప్రయోగాలకు సిద్ధంగా ఉండే హీరో కలిసి వస్తుండటంతో ఆ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.