'స్వాతిముత్యం' ఫంక్షన్ ను గుర్తుచేసిన చిరూ సత్కారం!

Update: 2022-06-12 11:46 GMT
అలుపెరగని ప్రయాణం .. అంకితభావం .. ఈ రెండిటికి కలిపి ఓ పేరు పెడితే బాగుంటుందని అనుకుంటే ఆ పేరే కమల హాసన్ అవుతుంది. ఎన్నో వైవిధ్యభరితమైన కథలు .. మరెన్నో విభిన్నమైన పాత్రలలో కమల్ చేసిన సాహసాలు .. ప్రయోగాలు అన్నీ ఇన్నీ కాదు. కమల్ సినిమాలపై పరోశోధన అనేది మొదలు పెడితే ఆయన ఏం చేయలేదు అనే వైపు నుంచి మొదలుపెట్టవలసి ఉంటుంది. అంతగా ఆయన తన కెరియర్లో కొత్తదనం వైపు దూసుకుని వెళ్లారు. అలాంటి కమల్ తాజాగా  'విక్రమ్' సినిమాతో హిట్ కొట్టడంతో ఆయనను అభినందిస్తూ చిరంజీవి సత్కరించారు.

కమల్ తన సొంత బ్యానర్లో నిర్మించిన 'విక్రమ్' సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కమల్ ను చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించి ఆయనను సత్కరించారు. ఆ సమయంలో అక్కడే సల్మాన్ కూడా ఉండటం విశేషం.
ఒక వైపున బాలీవుడ్ స్టార్ హీరోగా సల్మాన్  ..  టాలీవుడ్ మెగాస్టార్ గా చిరంజీవి .. కోలీవుడ్  స్టార్ గా కమల్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అరుదైన దృశ్యంగా చెప్పుకోవాలి .. అరుదైన కలయికగానే ఒప్పుకోవాలి. కమల్ ను చిరంజీవి సత్కరించే సన్నివేశాన్ని చూసినవారు, 1986 నాటి దృశ్యం రిపీట్ అయినట్టుగా చెప్పుకుంటున్నారు.

కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన 'స్వాతిముత్యం' సినిమా 1986లో వచ్చింది. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. కమల్ కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకి సంబంధించిన షీల్డ్ ను అప్పట్లో చిరంజీవి చేతుల మీదుగా కమల్ అందుకున్నారు. ఆ సందర్భంలో ఆ వేదికపై బాలీవుడ్ సీనియర్ స్టార్ రాజ్ కపూర్ ఉన్నారు. ఇప్పుడు  'విక్రమ్' హిట్ కారణంగా కమల్ ను చిరూ సత్కరిస్తున్నప్పుడు సల్మాన్ ఉన్నారు.

ఇక ఇటీవల కమల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చిరంజీవి తమిళ సినిమాలపై  దృష్టి పెట్టలేదుగానీ, లేదంటే అక్కడ కూడా  ఆయన దూసుకుపోయేవారు అనడం విశేషం. నవరసాల అంతు చూసిన కమల్ ఆ మాట అనడం నిజంగా విశేషమే .. అది ఆయన గొప్పతనమే. ఇక తనకి హిట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్ ను ఒకేసారి  చిరంజీవి - సల్మాన్ లకు పరిచయం చేసిన కమల్, ఆల్రెడీ రజనీకి కూడా ఆయనను పరిచయం చేశారు. రేపో మాపో వీళ్ల  కాంబినేషన్లో ప్రాజెక్టులు మొదలైనా ఆశ్చర్యం లేదు.         
Tags:    

Similar News