ఆ విషయంలో రుద్రమదేవి తర్వాతే బాహుబలి

Update: 2015-07-29 13:40 GMT
బాహుబలి సినిమా కథా కథనాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ భారీతనం, కంప్యూటర్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్టుల విషయంలో మాత్రం ఇండియాలో మరే  సినిమా అందుకోని స్థాయిని అందుకుంది బాహుబలి. బాలీవుడ్ జనాలు, ఇంటర్నేషనల్ క్రిటిక్స్ కూడా ఈ విషయంలో బాహుబలి ప్రత్యేకతను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఐతే బాహుబలి వచ్చిన రెండు నెలలకు విడుదల కాబోతున్న ‘రుద్రమదేవి’ కూడా హై టెక్నికల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కింది. విజువల్ ఎఫెక్టులు, గ్రాఫిక్స్ విషయంలో ఈ సినిమాకు బాహుబలితో పోలిక రావడం సహజం. బాహుబలి టీమ్ కి ఉన్నంత ఆర్థిక పరిపుష్టి గుణశేఖర్ కు లేదు కాబట్టి.. భారీతనం, ఎఫెక్టుల విషయంలో రుద్రమదేవి కొంచెం వెనకబడే అవకాశముంది.

ఐతే బాహుబలితో పోలిక లేకుండా చూస్తే రుద్రమదేవి కూడా అత్యున్నతంగానే అనిపించే అవకాశముంది. ఆ పోలిక పక్కనబెడితే ఓ విషయంలో మాత్రం బాహుబలి కంటే రుద్రమదేవి ఓ మెట్టు పైనే ఉండబోతోందని అర్థమవుతోంది. అదే కాస్ట్యూమ్స్. గత కొన్ని రోజులుగా విడుదలవుతున్న ‘రుద్రమదేవి’ ప్రధాన పాత్రధారుల గెటప్పులు చూస్తుంటే.. స్టైలింగ్ విషయంలో వారెవా అనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా ఈ సినిమాకు పని చేశారు. ఎంతైనా ప్రొఫెషనల్ ప్రొఫెషనలే కదా.. కాబట్టి కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేకత కనిపిస్తోంది. అనుష్క, రానా, అల్లు అర్జున్, నిత్యా మీనన్, కేథరిన్ థ్రెసా, కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్.. ఇలా ఒక్కరని కాదు అందరి గెటప్పులూ, వారి వస్త్రాలంకరణ అత్యుత్తమ స్థాయిలో ఉంది. ఈ విషయంలో మాత్రం బాహుబలి కొంచెం వెనకబడిందనే చెప్పాలి.
Tags:    

Similar News